సందిగ్ధంలో ఎపి ఎస్ఎఫ్ఎల్ కేబుల్ చానల్స్

0
1141

టెలికామ్ రెగ్యులేటరీ అథ్యారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు కేబుల్ చానల్స్ మీద ఆంక్షలు ప్రతిపాదించటంతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఎపిఎస్ఎఫ్ఎల్), దాని మీద నడిచే కేబుల్ చానల్స్ అయోమయంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయిన ఎపిఎస్ఎఫ్ఎల్ ట్రిపుల్ ప్లే పేరిట టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కారుచౌక ధరలకే కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది సొంతగా కేబుల్ చానల్స్ ఏర్పాటు చేసుకొని వాటిని ఎపిఎస్ఎఫ్ఎల్ ద్వారా ప్రసారం చేస్తూ వస్తున్నారు. అయితే, ట్రాయ్ ఇప్పుడు కేబుల్ చానల్స్ అన్నిటినీ నియంత్రించాలన్న పట్టుదలతో ఉండటంతో ఒక్కసారిగా తేనెతుట్టెను కదిలించినట్టయింది.
ఎపిఎస్ఎఫ్ఎల్ కు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 9 లక్షల కేబుల్ కనెక్షన్లున్నాయి. ఎక్కువగా ఒకేచోట కేంద్రీకరించి లేకపోయినా, రాష్టవ్యాప్తంగా దాని ఉనికి విస్తరించి ఉంది. 15,000 మంది కేబుల్ ఆపరేటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు వెబ్ సైట్ లో చెప్పుకోవటం అతిశయోక్తిగా అనిపించినా సుమారు 800-1000 మంది ఉండే అవకాశముంది. వీళ్లలో కొంతమంది తమ చానల్స్ ను పంపిణీ చేస్తున్నారు. ఎపిఎస్ఎఫ్ఎల్ మాత్రం కొన్ని వాల్యూ యాడెడ్ సర్వీసులకు పరిమితమవుతూ సొంత చానల్స్ నడపటం మీద దృష్టిపెట్టలేదు.
కొంతమంది ఔత్సాహికులైన జర్నలిస్టులు సొంతగా కేబుల్ చానల్స్ నడుపుతూ వాటిని వేరు వేరు ఎమ్మెస్వోల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెస్వోలు అడిగే కారేజ్ ఫీజు చెల్లింపుకు సైతం ఒప్పుకున్నారు. స్థానికంగా ప్రకటనలు తీసుకొవద్దన్న ఎమ్మెస్వోల షరతుకు సైతం సరేనన్నారు. అదే సమయంలో చాలామంది ఎపిఎస్ఎఫ్ఎల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపటానికి కారణం అది రాష్ట్రమంతటా చెదురుమదురుగానైనా వ్యాపించి ఉండటం. ఇలా చానల్స్ నుంచి డిమాండ్ పెరగటం, రాజకీయ వత్తిళ్ళు కూడా ఉండటంతో కారేజ్ ఫీజు నిర్ణయించి సంస్థ ఒక ప్రాతిపదిక సిద్ధం చేసుకుంది. అది కూడా, న్యూస్ ఉండే చానల్స్ కు కాస్త ఎక్కువ ధర, ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే చానల్స్ కు కాస్త తక్కువ ధర నిర్ణయించింది. ప్రస్తుతం దాదాపు పాతికకు పైగా అలాంటి చానల్స్ ప్రసారమవుతున్నాయి.
ట్రాయ్ ప్రతిపాదించిన నియంత్రణ ఇలాంటి ఏర్పాటుకు ఇప్పుడొక ప్రధానమైన అవరోధంగా మారబోతున్నది. మొదటగా, ఎమ్మెస్వో వేదికనుంచి ప్రసారమయ్యే చానల్స్ సంఖ్య మీద పరిమితి పెట్టటం. దీన్ని అమలు చేయాలంటే ఏ చానల్ ను ఒప్పుకోవాలి, దేన్ని తిరస్కరించాలి అనే విషయంలో ఎపిఎస్ఎఫ్ఎల్ కు ఇబ్బందులెదురవుతాయి. మరోవైపు రాజకీయ వత్తిళ్ళు కూడా తప్పకపోవచ్చు. ఏ విధంగా చూసినా కొన్ని కేబుల్ చానల్స్ కు నిరాశ తప్పదు. పైగా సొంత ఆపరేటర్లకు ప్రాధాన్యం ఇచ్చే పక్షంలో కేబుల్ టీవీ పంపిణీతో సంబంధం లేని కేబుల్ చానల్ యజమానుల పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటప్పుడు ప్రసారభారతి వారి డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ తరహాలో స్లాట్స్ వేలం వేయటం ఒక్కటే మార్గం కావచ్చు.
ఇక రెండో సమస్య- ఏ కేబుల్ చానల్ అయినా ఒకటి కంటే ఎక్కువ ఎమ్మెస్వో వేదికల మీద ప్రసారం కాకూడదన్న నిబంధన. అంటే, ఆ కేబుల్ చానల్ ఆ ఎమ్మెస్వో పరిధిలోని ఇళ్లకే పరిమితం కావాలి. ఒకరు కంటే ఎక్కువ ఎమ్మెస్వోల ద్వారా ఇవ్వటం కుదరదు. ప్రసారాలు స్థానిక అంశాలకే పరిమితం కావాలన్న ఉద్దేశమే ట్రాయ్ ఇలాంటి నిబంధన విధించటానికి కారణం. ఇప్పుడు ఎక్కువమంది ఎపిఎస్ఎఫ్ఎల్ వైపు మొగ్గు చూపుతుండటం వల్ల మిగిలిన ఎమ్మెస్వోలకు కారేజ్ ఫీజు ఆదాయం తగ్గవచ్చు. ఈ కేబుల్ చానల్స్ విస్తృతి ఇకమీదట బాగా పదిపోతుంది. అది వాటి ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి వాటి మనుగడకే ప్రమాదకరం కావచ్చు.
ఈ కొత్త ప్రతిపాదనలలో ఎపిఎస్ఎఫ్ఎల్ కు మరొక ప్రతికూల విషయమేంటంటే ఈ చానల్స్ అన్నీ సంస్థ దగ్గరినుంచే ఎన్ క్రిప్ట్ అయి ప్రసారం కావాల్సి ఉండటం. ప్రస్తుతం ఒక ఐపి బాక్స్ సాయంతో ఆపరేటర్లు తమ సొంత చానల్స్ తమ దగ్గరే జోడించుకోవటానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఇప్పుడది కుదరదు. ఇది దేశవ్యాప్త నిబంధన కాబట్టి సంస్థ పరిధిలోని ఆపరేటర్లు ప్రత్యేకంగా సంస్థను తప్పుబట్టే అవకాశం మాత్రం లేదు.
ఇకమీదట కేబుల్ చానల్స్ రాష్ట్రమంతటా ప్రసారం కావాలనుకుంటే ఎపిఎస్ఎఫ్ఎల్ ను, ఒక ప్రాంతానికే అనుకుంటే స్థానిక ఎమ్మెస్వోను ఆశ్రయించక తప్పదు. ఇప్పుడు ట్రాయ్ ఇచ్చే అంతిమ మార్గదర్శకాల కోసం ఎదురుచూడటం తప్ప చేసేదేమీ లేదు.
-తోట భావనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here