కేబుల్ టీవీ సేవలమీద చర్చకు గడువు పెంచిన ట్రాయ్

0
462

కేబుల్ టీవీ మార్కెట్ నిర్మాణం, కేబుల్ సేవలలో దాగి ఉన్న పోటీ స్వభావం గురించి చర్చించటానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ఇప్పటికే ఒక చర్చాపత్రం జారీచేయగా అభిప్రాయాలు తెలియజేయటానికి గడువును డిసెంబర్ 6 వరకూ పొడిగించింది. ఈ పరిశ్రమలో భాగస్వాములైన బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, చందాదారులు తదితరులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను ట్రాయ్ కి పంపవచ్చు. ఈ అభిప్రాయాలను ట్రాయ్ తన వెబ్ సైట్ లో ప్రదర్శిస్తుంది. ఆ తరువాత ఈ అభిప్రాయాలకు సమాధానాలు, వ్యాఖ్యలు చేయదలచుకుంటే అలాంటివారికోసం మరో రెండు వారాల వ్యవధి ఉంటుంది. అంటే డిసెంబర్ 20 గడువు తేదీ.
కేబుల్ టీవీ రంగంలో గుత్తాధిపత్యాలు తయారవుతున్నాయా, దీనివలన కేబుల్ రంగంలో ఎవరికైనా అన్యాయం జరుగుతోందా? కేబుల్ టీవీకి డీటీహెచ్ సరైన ప్రత్యామ్నాయమేనా? చందాదారులు ఇలాంటి గుత్తాధిపత్యాల వలన నష్టపోతున్నారా? తదితర అంశాలమీద అభిప్రాయాలు స్వీకరించటం ద్వారా దాని మీద చర్చించి తగిన నియంత్రణకు చర్యలు తీసుకోవటం ట్రాయ్ లక్ష్యం. మారుతున్న పరిస్థితులమధ్య ఈ విషయంలో తగిన మార్పులు అవసరమేమో పరిశీలించాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కోరటంతో ట్రాయ్ ఈ చర్చకు పూనుకుంది. ఇందులో పరిశ్రమ భాగస్వాముల నుంచి స్పందన కోరిన అంశాలు స్థూలంగా ఇవి:
 టీవీ సేవలు అందుకోవటానికి వినియోగదారులకు కేబుల్, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ లాంటి రకరకాల అవకాశాలున్నాయి. అయితే టీవీ పంపిణీ రంగంలో తగినంత పోటీ ఉందని మీరు భావిస్తున్నారా?
 ఇప్పుడున్న నియంత్రణ వ్యవస్థను, మార్కెట్ నిర్మాణాన్ని లెక్కలోకి తీసుకుంటూ కేబుల్ టీవీ సేవలలో గుత్తాధిపత్యం లేదా పరిమితస్వామ్యం లేదా మార్కెట్ ఆధిపత్యం పెరిగిపోయిందని అనుకుంటున్నారా?
 భారత కేబుల్ రంగంలో కొత్తగా వచ్చేవారికి అవరోధాలున్నాయని మీరు భావిస్తున్నారా? అవుననుకుంటే, వాటిని తెలియజేస్తూ తగిన పరిష్కారమార్గాలు చూపండి. మీ వాదనకు పూర్తిస్థాయి సమర్థింపు ఇవ్వండి.
 కేబుల్ టీవీ రంగం ఎదుగుదలకు, పోటీని పెంచటం ద్వారా చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి స్థానిక కేబుల్ ఆపరేటర్లను (ఎల్ సి వో లను) నియంత్రించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా?
 ఇంటింటికీ బ్రాడ్ బాండ్ సేవలందించటానికి కేబుల్ ఆపరేటర్ స్థాయిలో కేబుల్ టీవీ మౌలికసదుపాయాలను పంచుకునే వెసులుబాటుకు ఎలాంటి నియమాలు అవసరం? కేబుల్ ఆపరేటర్ బ్రాడ్ బాండ్ సేవల ద్వారా తన ప్రాంతంలో మార్కెట్ ను నియంత్రించే ప్రమాదముందా?
 కేబుల్ సర్వీసుల మార్కెట్ శక్తిని కొలవటానికి ‘సంబంధిత మార్కెట్’ ను ఎలా నిర్ణయించాలి?
 కేబుల్ టీవీ సేవలకు ఒక రాష్ట్రం లేదా నగరం లేదా నగరంలోని ఒక ప్రాంతాన్ని సంబంధిత భౌగోళిక మార్కెట్ గా గుర్తించవచ్చునా? కేబుల్ టీవీ సేవలకు “సంబంధిత భౌగోళిక మార్కెట్” ను నిర్వచించటానికి ఏయే అంశాలను లెక్కలోకి తీసుకోవాలి?
 సంబంధిత మార్కెట్ లో బలాన్ని లెక్కగట్టేటప్పుడు ఎమ్మెస్వోలను, వారి జాయింట్ వెంచర్లను ఒకే వ్యవస్థగా లెక్కించాలని మీరు అనుకుంటున్నారా?
 ఒక మార్కెట్ లో కేబుల్ ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో బలంగా పాతుకుపోయినట్టు లెక్కగట్టానికి, పోటీ స్థాయిని కొలవటానికి ఎలాంటి పద్ధతి సరైనదని మీరు భావిస్తున్నారు?
 కేబుల్ ఆపరేటర్ స్థాయి పోటీని జిల్లా/ పట్టణ ప్రాతిపదికన లెక్కగట్టటం సరైనదని భావిస్తున్నారా?
 ఒక ఎమ్మెస్వో పరిమితి మించి మార్కెట్ ను నియంత్రిస్తుంటే ఎలాంటి పద్ధతుల ద్వారా మార్కెట్ వాటాని క్రమబద్ధం చేసి అదుపులో పెట్టవచ్చు?
 కేబుల్ టీవీ సేవలకు డీటీహెచ్ సరైన ప్రత్యామ్నాయం కాదని మీరు అనుకుంటున్నారా? అవుననుకుంటే డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ కు, ఎమ్మెస్వోలకూ, ఇతర పంపిణీ వేదికల యజమానులకూ తేడా ఏంటి?
 కేబుల్ టీవీ రంగంలో విలీనాలు, కొనుగోళ్ళ ద్వారా ఎమ్మెస్వోలు గుత్తాధిపత్యానికి పాల్పడవచ్చు. మార్కెట్ లో అలాంటి ధోరణులకు అడ్డుకట్టవేసే మార్గాలు సూచించండి.
 విలీనాలు, కొనుగోళ్లను అడ్డుకునే క్రమంలో వ్యాపారాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియ దెబ్బతినకూడదు. పోటీ దెబ్బతినకుండా, వ్యాపారాన్ని సులభతరం చేసుకోవటానికి అవకాశమిస్తూ విలీనాలు, కొనుగోళ్ళు జరుపుకోవటానికి ఎలాంటి నియంత్రణావిధానం అమలులోకి తీసుకురావాలి?
 ట్రాయ్ తన సిఫార్సులను కొన్ని రకాల ఎమ్మెస్వోలకు మాత్రమే వర్తింపజేయాలా?
 2013 నాటి సిఫార్సులలో పేర్కొన్న విధంగా పంపిణీ రంగంలో గుత్తాధిపత్యం/ మార్కెట్ఆధిపత్యం కోణంలో సమాచార వెల్లడి, పర్యవేక్షణ విధానం ఉండాలన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?
 వివిధ పంపిణీ వేదికలు, సర్వీస్ ప్రొవైడర్లు పరస్పరం తమ కంపెనీలలో పెట్టుబడులు పెట్టుకోవటం మీద ఏవైనా ఆంక్షలు ఉండాల్సిన అవసరముందా?
ఈ అంశాలమీద మీ అభిప్రాయాలను డిసెంబర్ 6 లోగా పంపాలి. వాటిని 7 న ట్రాయ్ వెబ్ సైట్ లో పొందుపరచిన మీదట ఆ అభిప్రాయాల మీద అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 20 లోగా పంపాలి. ఆలా పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామాలు: advbcs-2@trai.gov.in లేదా jtadv-bcs@trai.gov.in.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here