జియో దౌర్జన్యాలమీద గొంతెత్తిన ఆపరేటర్లు

0
749

మధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఉజ్జయిని, భోపాల్ నగరాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు జియో వ్యవహరిస్తున్న తీరుమీద పెద్ద ఎత్తున ఉద్యమించారు. భోపాల్ లో నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆపరేటర్లు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. అన్యాయంగా, అనైతికంగా వ్యవహరిస్తూ కేబుల్ ఆపరేటర్లను తొలగించేందుకు జియో ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు.

కారు చౌక ధరలు ప్రకటించటం ద్వారా చందాదారులను ఆకట్టుకోవటానికి, స్థానికి ఆపరేటర్లను తరిమెయ్యటానికి జియో ఇప్పటికే తన ప్రణాళికను అమలు చేయటం తెలిసిందే. ఈ విధంగా తాత్కాలికంగా ఊరించి భారీ రాయితీలతో ఆపరేటర్లను దెబ్బతీయటం ద్వారా గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నదని ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆపరేటర్ల కేబుల్స్ కత్తిరించటం ద్వారా భయపెట్టి, ప్రజలకు కేబుల్ సేవల్లో అంతరాయం కలిగించి ఆపరేటర్లకు చెడ్దపేరుతెచ్చే ప్రయత్నం చేస్తోందని కూడా మధ్య ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.

జియో మనుషులు గూండాగిరి చేస్తున్నారని, కేబుల్ ఆపరేతర్లను బెదిరిస్తున్నారని మధ్యప్రదేశ్ కేబుల్ టీవీ సంఘం వ్యవస్థాపకులు అన్సర్ అహ్మద్ అన్నారు. మరోవైపు ప్రతిచోటా కేబుల్ కత్తిరింపులకు పాల్పడుతూ కేబుల్ సేవలకు అంతరాయం కలిగిస్తోందని ఆరోపించారు. “నిజానికి జియో దాదాపు 150 మంది కేబుల్ ఆపరేటర్లతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు దానికి భిన్నంగా సొంత వ్యాపారం కోసం కేబుల్ వేసుకుంటూ మా కేబుల్ కత్తిరిస్తోంది. ఇది అన్యాయం, అనైతికం” అన్నారు.
మధ్య ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తివారీ మాట్లాడుతూ, జియో తన వైఖరి మార్చుకోకపోతే దీన్ని దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ఒప్పందాలను ఉల్లంఘించినందుకు కోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా ఉందని, జియో అక్రమాలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసారు.

మాజీ మంత్రి పిసి శర్మ ఈ ధర్నా స్థలాన్ని సందర్శించి కేబుల్ ఆపరేటర్లకు తన మద్దతు ప్రకటించారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యను తగిన వేదికలమీద ప్రస్తావించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here