కేబుల్ టీవీ చట్ట సవరణల మీద అభిప్రాయాల వెల్లడికి తాజా గడువు

0
698

కేబుల్ టీవీ చట్టం (1995) లోని నిబంధనల కింద భారీ నేరాల నిబంధనలను సడలించే ప్రక్రియ మీద అభిప్రాయ సేకరణకు గడువు పొడిగిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మరో సర్క్యులర్ జారీ చేసింది. ఇంతకుముందు జులై 24 వరకు గడువు ఉండగా ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించారు. టీవీ పరిశ్రమలోని వారితో బాటు ఇతరులు కూడా ప్రతిపాదించిన ఈ సవరణల మీద తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఈ చట్టంలోని నాలుగో అధ్యాయం 16వ సెక్షన్ కింద నిబంధనలు ఉల్లంఘించినవారికి 5 ఏళ్ళవరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. కేబుల్ టీవీ నెట్ వర్క్ రిజిస్ట్రేషన్ సరిగా చేసుకోకపోయినా, అడ్రెసిబుల్ సిస్టమ్స్ ద్వారా ప్రసారాలు చేయకపోయినా, ప్రామాణికమైన పరికరాలు వాడకపోయినా, టెలికామ్ వ్యవస్థకు భంగం కలిగించినా ఇలాంటి భారీ శిక్ష పడే వీలుంది. కార్యక్రమాల నియమావళి, ప్రకటనల నియమావళి గురించి కూడా ఈ చట్టం నిర్దేశిస్తున్నది. అందువలన ఈ 16వ సెక్షన్ ను రద్దు చేయటం వలన ఆపరేటర్లకు అనవసరమైన జైలు శిక్షలు, చట్టపరమైన సమస్యలు తొలగిపోతాయి.
ఇప్పుడు తాజాగా ప్రతిపాదించిన సవరణ ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఆపరేటర్ వాడుతున్న సామగ్రి జప్తు చేయటం మాత్రమే జరుగుతుంది. కార్యక్రమాలలో హద్దుమీరితే చానల్ లైసెన్స్ రద్దవుతుంది లేదా క్షమాపణ కోరుతూ స్క్రోల్ నడపమని ఆదేశించవచ్చునే తప్ప ఆపరేటర్ ను శిక్షించరు. ఇంతకుముందు చానల్ ప్రసారాలకు కూడా ఆపరేటరే బాధ్యుడవుతాడని చట్టంలో పేర్కొన్నారు.
ఇప్పుడు కేబుల్ టీవీ చట్టం నాలుగో అధ్యాయంలో ” నేరాలు, జరిమానాలు” కింద ఉన్న 16,17,18 సెక్షన్లు పూర్తిగా తొలగించాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. నిజానికి అనేక పాత చట్టాలను సమీక్షించి చిన్న తప్పులకు కూడా భారీ శిక్షలకు అవకాశమున్న నిబంధనలు సడలించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ సవరణ ప్రతిపాదించారు.
పరిశ్రమలోని వారితోబాటు సామాన్య ప్రజలు కూడా ఈ ప్రతిపాదిత సవరణల మీద తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను 2020 ఆగస్టు 15లోగా మెయిల్ చేయాల్సిన చిరునామా: sodasmoiab@gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here