అలా మొదలైంది: జీ టీవీ

0
1023

ముంబయ్ లో ఎస్సెల్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఒక మోస్తరుగా మాత్రమే నడుస్తోంది. ప్రజల వినోద అవసరాలు తీర్చటంలో దూరదర్శన్ కు ఒక సరైన ప్రత్యామ్నాయం అవసరమన్నదే బియ్యం వ్యాపారం మొదలై పాకేజింగ్ మీదుగా మీడియా వైపు చూసిన సుభాష్ చంద్ర ఆలోచన. సొంతగా టీవీ చానల్ లేకపోయినా, జైన్ టీవీ పేరుతో వీడియో ప్రొజెక్టర్, స్క్రీన్ తో వ్యాన్లు తయారుచేసి రాజకీయ పార్టీల ప్రచారానికి అద్దెకిచ్చే డాక్టర్ జెకె జైన్ నమూనా గుర్తొచ్చింది. సినిమాల మధ్యలో ప్రకటనలు వేస్తూ అలా జిల్లాకొక వ్యాన్ పంపి జిల్లాలోని ముఖ్యమైన ఊళ్లన్నీ తిప్పుతూ, పదిరోజులకోసారి సినిమా మారిస్తే ఎలా ఉంటుంది? కానీ, సినిమా ఊరికే చూపించినా వివిధ రాష్ట్రాల్లో స్థానికంగా వసూలు చేసే వినోదపు పన్ను తడిసి మోపెడవుతుందని తెలిసి ఆ ఆలోచన విరమించుకున్నాడు.
అప్పుడు ఇంకో దారుణమైన ఆలోచన వచ్చింది. భారతదేశంలో ప్రభుత్వం ఎలాగూ దూరదర్శన్ కు పోటీ రావటాన్ని ఒప్పుకోదని తెలుసు కాబట్టి దగ్గర్లో ఉన్న విదేశాలనుంచి దూరదర్శన్ తరహాలో హై పవర్ ట్రాన్స్ మిటర్ ద్వారా కార్యక్రమాలు ప్రసారం చేస్తేనో? నేపాల్ లాంటి ఎత్తైన ప్రదేశం ఎంచుకుంటే ఎలా ఉంటుంది? దేశంలో మిగిలిన ప్రాంతాలకోసం మూడు వైపులా సమద్రంలో భారీ తెప్పలు కట్టి వాటిమీద ట్రాన్స్ మిటర్లు ఏర్పాటు చేస్తేనో? ఆలోచన వచ్చిందే తడవుగా ప్రయత్నించి చూస్తే పగలబడినవ్విన వాళ్లు కొందరైతే కుదరదుగాక కుదరదని చెప్పేసింది నేపాల్ ప్రభుత్వం. మీ దేశమే ఒప్పుకోకపోతే మేమెలా ఇస్తామన్నది ఎదురుప్రశ్న.
ప్రేక్షకులను చేరటానికి ఇంకేం మార్గం ఉందా అని ఆలోచిస్తున్నప్పుడు గల్ఫ్ యుద్ధం వచ్చింది. అలా 1991 తొలినాళ్లలో సిఎన్ ఎన్ యుద్ధవార్తల కవరేజ్ చూడటానికి సుభాష్ చంద్ర మిత్రులు ఆయనని హోటల్ కి రమ్మనేవారు. అలా శాటిలైట్ ద్వారా వేరే దేశం నుంచి ప్రసారాలు పంపి భారతదేశంలో డిష్ ద్వారా అందుకుంటే ఇబ్బందేమీ ఉండదు కదా అనే ఆలోచన మెరుపులా మెరిసింది. ఈ శాటిలైట్ ప్రసారం గురించి తెలుసుకోవటానికి డిడి లో పనిచేసే చిన్నప్పటి క్లాస్ మేట్ గుల్షన్ సచ్ దేవ్ ను పట్టుకుంటే కాస్త జ్ఞానం అబ్బింది. వినోద కార్యక్రమాలతో ఒక టీవీ స్టేషన్ పెట్టాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. వందలాది ట్రాన్స్ మిటర్లు, వేలాది మంది ఉద్యోగులు, వందలకోట్ల పెట్టుబడి ఉన్న దూరదర్శన్ తో పోల్చుకోవటం కుదిరే పని కాదని చెప్పినా సుభాష్ చంద్ర వినలేదు. ఇక తప్పదని ఒక డిడి డిప్యూటీ ఇంజనీర్ ని పరిచయం చేశాడు సచ్ దేవ్. ఈ అలోచనలు వినగానే భయపడతాడని సుభాష్ చంద్రను ఒక ఎన్నారైగా పరిచయం చేశాడు.
ఏమైతేనేం, గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగాక శాటిలైట్ వాడుకోమని సలహా ఇచ్చాడు గాని సుభాష్ చంద్రను సీరియస్ గా తీసుకోలేదు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే సచ్ దేవ్ ద్వారా పాతికవేలు అడిగించాడు. పది వేలు అడ్వాన్స్ ఇచ్చి నాలుగు నెలలు వెంటపడితే ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది. ఏషియాశాట్ శాటిలైట్ అయితే భారత్ మీద తగినంత ఫుట్ ప్రింట్ ఉంటుందని అందులో సూచించాడు. ఆ కంపెనీని ఎలా సంప్రదించాలని అడిగితే ఒక ఫోన్ నెంబర్ సంపాదించి ఇచ్చాడు.
దాని కార్యాలయం ఉన్న హాంకాంగ్ గురించి తెలియదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకేం కావాలో ఒక లెటర్ రాసి ఫాక్స్ చేస్తే సమాధానం రాలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. అక్కడ ఫోన్ తీసినవాళ్ళు మాట్లాడే భాష అర్థమయ్యేది కాదు. నెల తరబడి ప్రయత్నించాక నేరుగా హాంకాంగ్ ఆఫీసుకు వెళ్లాడు సుభాష్ చంద్ర. తీరా అక్కడికెళ్ళాక వాళ్ళ సీఈవో కెనడా వెళ్ళినట్టు తెలిసింది. రిసెప్షనిస్ట్ ను బ్రతిమాలి ఆ సీఈవో కెనడాలో ఉన్న హోటల్ నెంబర్ సంపాదించి ఫోన్ చేస్తే నిద్రమేలుకొని చిర్రెత్తిపోయాడు. ట్రాన్స్ పాండర్లు ఖాళీలేవని, ఉన్న ఒక్కటీ మరో కంపెనీకి ఇచ్చేశామని చిరాగ్గా చెప్పాడు. కనీసం ఆ కంపెనీ వివరాలిమ్మని అడిగితే “రేపు చూద్దాం” అని ఫోన్ కట్ చేశాడు. చాలా ఆశ్చర్యంగా మరుసటి రోజు రెండే లైన్ల ఫాక్స్ మెసేజ్ వచ్చింది. ఫోన్ నెంబర్ తోబాటు కంపెనీ పేరు శాటిలైట్ టెలివిజన్ ఫర్ ది ఏషియా రీజియన్ ( స్టార్) లిమిటెడ్ అని ఉంది.
వివరాలు సంపాదిస్తే, లీ కా షింగ్ అనే చైనా వ్యాపారి కొడుకు రిచర్డ్ లీ ఆసియా కోసం ఒక చానల్ పెట్టే పనిలో ఉన్నాడని, వాళ్ళు చాలా పెద్ద వ్యాపారులని తనలాంటి వాణ్ణి ఖాతరు చేసే అవకాశం ఉండకపోవచ్చునని సుభాష్ చంద్రకు అర్థమైంది. యాంబియెన్స్ యాడ్ ఏజెన్సీకి హెడ్ గా ఉన్న అశోక్ కురియన్ అనే వాక్చాతుర్యం ఉన్నవాణ్ణి తన ఉద్యోగిగా తీసుకొని వెంటపెట్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తీరా అక్కడ లీ ని కాదుగదా, సీఈవో రాబర్ట్ ను కూడా కలవటం కుదరలేదు. డేవిడ్ అనే మధ్యస్థాయి అధికారికి తాను వచ్చిన పనిచెబితే అతనికి ఏ మాత్రం నమ్మకం కలగలేదు. నమీనా కార్యక్రమాలతో ఒక షో రీల్ తెమ్మన్నాడు. మళ్ళీ ముంబయ్ వచ్చి డిడి లో పనిచేసే వాళ్ల సాయంతో షో రీల్ తయారు చేసుకొని వెళితే ట్రాన్స్ పాండర్ అద్దెకివ్వటం కాకుండా, జాయింట్ వెంచర్ కి సిద్ధమా అని అడిగాడు. కొంతకాలం అలా నడిపితే టెక్నాలజీ అర్థమవుతుంది కదా అని ఒకవైపు, వ్యాపారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనన్న భయం ఇంకోవైపు లాగాయి. గత్యంతరం లేక జాయింట్ వెంచర్ కి ఒప్పుకుంటు 50 శాతం వాటాతోబాటు నిర్వహణ తనకే ఉండాలని షరతు పెట్టాడు.
బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోడానికే ఏదెనిమిది నెలలుపట్టింది. అందులో ట్రాన్స్ పాండర్ అద్దె 12 లక్షల డాలర్లు అని రాశారు. పేపర్లన్నీ సిద్ధమయ్యాయి. సంతకాలు మాత్రమే మిగిలాయి. అశోక్ కురియన్ ను వెంటబెట్టుకొని హాంకాంగ్ వెళ్ళాడు సుభాష్ చంద్ర. స్టార్ కార్యాలయంలో అధికారుల మధ్య కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా లోనికి వచ్చి సుభాష్ చంద్ర ఎదురుగా కూర్చున్నాడు లీ. “ ఓకే..ఇండియన్ చానల్..హిందీ చానల్. ఇండియాలో డబ్బులెక్కడున్నాయ్? అక్కడసలు డబ్బు లేదు” అంటూ నిరుత్సాహపరచాడు. సుభాష్ చంద్ర ఏదో చెప్పబోతుంటే “నాకు జాయింట్ వెంచర్ మీద నమ్మకం లేదు” అనేశాడు లీ. అక్కడ ఉన్న అధికారులంతా షాక్ అయ్యారు. డాక్యుమెంట్లు సిద్ధం చేసిన అధికారులు సుభాష్ చంద్రవైపు చూడలేకపోయారు. తన స్పందన చూడటానికి ఇది లీ వేసిన ప్లాన్ కావచ్చునని సుభాష్ చంద్రకు అనిపించింది.
ఏదెనిమిది నెలలు చేసిన కృషి విఫలమైందన్న బాధ, ఉక్రోషం… తనతో మాట్లాడేటప్పుడు కూడా తనవైపు చూడకుండా స్టార్ ఎగ్జిక్యుటివ్ ల వైపే చూస్తూ మాట్లాడిన లీ నిర్లక్ష్యం.. ఏమైతేనేం, చివరికి గొంతు పెగల్చుకొని అడిగేశాడు “ మిస్టర్ లీ, జాయింట్ వెంచర్ మీద మీకు ఆసక్తి లేకపోతే ట్రాన్స్ పాండర్ అద్దెకిచ్చే విషయం పరిశీలిస్తారా?” అని. లీ మళ్ళీ తన బృందం వైపు చూస్తూ, “మన బిజినెస్ ప్లాన్ లో ట్రాన్స్ పాండర్ అద్దె ఎంత చూపించారు?” అని అడిగాడు. “ఏడాదికి 12 లక్షల డాలర్లు” సమాధానమిచ్చాడో ఎగ్జిక్యుటివ్. “ అదెలా సాధ్యం? 12 లక్షల దాలర్లకు ట్రాన్స్ పాండర్ ఎలా వస్తుంది? ఏడాదికి 50 లక్షలకు తక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు” తేల్చి చెప్పాడు లీ. తనను దూరం పెట్టటానికి చెబుతున్న ధర అదని సుభాష్ చంద్రకు అర్థమైంది. అలాకేవలం పది నిమిషాలే గడిపిన లీ కనీస మర్యాద గాని, మరికాస్త సమయంగాని ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.
మీటింగ్ హాల్ అంతా నిశ్శబ్దం. కొద్ది సెకెన్లపాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరచిన సుభాష్ చంద్ర “ సరే, 50 లక్షల డాలర్ల అద్దెకడతా. కానీ ఈరోజే, ఇప్పుడే లీజ్ అగ్రిమెంట్ జరగాలి” అని బలంగా చెప్పాడు. అందరూ హతాశులయ్యారు. కొంతమంది ఇప్పుడే వస్తామంటూ హడావిడిగా లీ తో మాట్లాడటానికి బయటికి వెళ్ళారు. ( ఈరోజు లెక్క ప్రకారం సుభాష్ చంద్ర ఒప్పుకున్న ధర 50 లక్షల డాలర్లు అంటే దాదాపు 37కోట్ల రూపాయలు. ఇప్పుడు మన చానల్స్ ఒక్కో చానల్ కు కడుతున్నది ఏడాదికి 75 లక్షలు మాత్రమే). ఈ మొత్తం విన్న అశోక్ కురియన్ కు కళ్ళు బైర్లు కమ్మాయి. కింద కాళ్లు గోకుతూ “మీరు చెబుతున్నదేంటో మీకర్థమవుతున్నదా?” అని సుభాష్ తో గుసగుసలాడాడు. ఆయనమాత్రం ఊపిరిబిగబట్టి స్థిరంగా ఉండిపోయాడు. దాదాపు గంటన్నర తరువాత తిరిగొచ్చిన స్టార్ ఎగ్జిక్యుటివ్ లు “ క్షమించండి. మీ నిస్పృహ అర్థమైంది. కానీ ఇప్పుడు సంతకాలు చేయలేం. త్వరలో సంప్రదిస్తాం” అనేసి వెళ్ళి పోయారు. తీవ్రమైన నిరాశను పట్టుదల అధిగమించింది. ఎలాగైనా టీవీ చానల్ పెట్టాల్సిందే అనుకున్నాడు సుభాష్.
రిచర్డ్ లీ ఆలోచన మరోలా ఉంది. సుభాష్ చంద్ర ఆఫర్ కొత్త ఆలోచనలు రేకెత్తించింది. తన ప్రతినిధులను భారత్ కు పంపి, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, హిందుస్తాన్ టైమ్స్ యాజమానులతోబాటు కొందరి సినిమా నిర్మాతలను కూడా సంప్రదించారు. ఢిల్లీలో ఎవరో లీ మనుషులు అసలు సుభాష్ చంద్ర అనే వ్యక్తి పేరే వినలేదని చెప్పటం వల్ల కలుసుకోవాల్సిన వాళ్ల జాబితాలో ఆయన పేరు లేదు. ఈ లోపు రష్యా వాళ్ళ ట్రాన్స్ పాండర్ ద్దెకు దొరుకుతుందని తెలిసి అక్కడికెళ్ళివచ్చాక తనకొక ప్రత్యామ్నాయం దొరికిందన్న నిశ్చింత ఏర్పడింది. అది ఏషియా శాట్ కంటే మెరుగైనది మాత్రం కాదని డిడి ఇంజనీర్లు చెప్పినమాట కూడా ఆయనకు గుర్తుంది.
స్టార్ వాళ్లు భారత్ లో భాగస్వామి కోసం వెతుకుతున్నారన్న సమాచారం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంది. కానీ ఎవరూ 50 లక్షల డాలర్ల ట్రాన్స్ పాండర్ అద్దె కట్టటానికి సిద్ధంగా లేరు. పైగా, వాళ్ళెవరికీ శాటిలైట్ చానల్ గురించి కనీస స్థాయిలో విజన్ కూడా లేదు. ఎవరూ ధైర్యం చేయలేదు. అలా ఉండగా ఒకరోజు స్టార్ సీఈవో నుంచి ఫోన్. ఆసియా దిగ్గజమనుకుంటున్న స్టార్ కి తనతో అవసరమొచ్చింది. “నలభై రోజులుగా మీ కదలకలన్నీ నాకు తెలుసు. అమ్దరినీ కలిసినా, నన్ను కలవలేదు. నాకు తలకొట్టేసినట్టయింది. మళ్ళీ స్టార్ మనుషుల్ని కలిసే ఉద్దేశం లేదు” అని తేల్చి చెప్పేశాడు రష్యన్ శాటిలైట్ ఉందన్న ధీమాతో సుభాష్ చంద్ర. అయన ఢిల్లీలో ఉన్న హోటల్ ఆచూకీ పట్టుకొని స్టార్ సీఈవో మళ్లీ ఫోన్ చేస్తే “ముంబయ్ వెళుతున్నా. నాతో విమానంలో రాగలిగితే ఆ ప్రయాణంలో మాట్లాడే టైమ్ ఇస్తా” అని ఫోన్ పెట్టేశాడు.
మొత్తానికి కష్టపడి టికెట్ సంపాదించి విమానమెక్కాడు స్టార్ సీఈవో స్టీవ్. భారత్ లో సరైన భాగస్వామి సుభాష్ చంద్ర మాత్రమేనని లీని ఒప్పించానన్నాడు. “ ఎవరెవరితోనో మాట్లాడి కుదరకపోతేనే నాదగ్గరకు వచ్చారు కదూ” అని సుభాష్ అడిగితే చిన్నబుచ్చుకున్నాడు. రిచర్డ్ లీ ని తీసుకొని ఇండియా వచ్చి తనను కలుస్తానని, ఒప్పుకోమని పదే పదే అడిగితే సుభాష్ చంద్ర సరేనన్నాడు. స్టీవ్ ఎంతగా సుభాష్ చంద్ర గురించి చెప్పినా1992 మే లో భారత్ వచ్చిన రిచర్డ్ మాత్రం నస్లి వాడియా, సమీర్ జైన్, సంజయ్ దాల్మియా లాంటి వ్యాపార దిగ్గజాలను కలిశాక ఆఖరి చాయిస్ గా మాత్రమే సుభాష్ చంద్రను కలిశాడు. హెలికాప్టర్ లో తీసుకెళ్ళి ఎస్సెల్ అమ్యూజ్ మెంట్ పార్క్, ఎస్సెల్ పాకేజింగ్ యూనిట్లు చూపించాక పెద్దపెద్ద బ్రాండ్లకు సప్లయ్ చేస్తున్న విషయం, క్లయింట్స్ జాబితాలో ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలు స్వయంగా చూశాక సుభాష్ చంద్ర స్థాయి అర్థమైంది. అదే రోజు, అంటే 1992 మే 21న ముంబయ్ ఒబెరాయ్ హోటల్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద సంతకాలయ్యాయి. కొంతమంది ఎన్నారై మిత్రులతో కూడా పెట్టుబడి పెట్టించి సుభాష్ చంద్ర ఏర్పాటు చేసిన ఏషియా టుడే లిమిటెడ్ కూ, స్టార్ కూ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ విధంగా 1992 అక్టోబర్ 1న హర్యానాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన ఒక బియ్యం వ్యాపారి భారతదేశపు తొలి హిందీ ప్రైవేట్ శాటిలైట్ చానల్ జీ టీవీ ప్రారంభించగలిగాడు.
అమెరికాలో ఎంబీయే చదివి, టీవీ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి, జీ టీవీలో కొన్ని గంటలు ఇవ్వగలరేమో అడుగుదామని రెండు మూడు సార్లు జీ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఇద్దరు యువకులకు కూడా సుభాష్ చంద్ర నుంచి అదే అనుభవం ఎదురైంది. ఇక్కడ కూడా చరిత్ర పునరావృతమైంది. ఏడాది తిరక్కుండానే దక్షిణాదిన ఒక మీడియా సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

  • తోట భావనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here