కేబుల్ ఆపరేటర్లకు సుభాష్ రెడ్డి లేఖ

0
1171

కరోనా సంక్షోభ సమయంలో కేబుల్ రంగ సోదరులకు ధైర్యం చెబుతూ, జాగ్రత్తలు సూచిస్తూ, భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తూ బ్రైట్ వే ఎండీ, తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు ఎమ్, సుభాష్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను కేబుల్ సమాచారమ్ వెబ్ సైట్ యథాతథంగా అందిస్తోంది.
కేబుల్ ఆపరేటర్ మిత్రులారా!
మళ్లీ విజృంభించిన ఈ కరోనా కాలంలో ఇలా పలకరించాల్సి వస్తున్నందుకు బాధగా ఉన్న తప్పటం లేదు. ఈ రెండో విడత మరింత ప్రమాదకారిగా మారి మన ఆపరేటర్ మిత్రులను పొట్టనబెట్టుకుంటున్న వార్తలు మనందరినీ కలచి వేస్తున్నాయి. నిత్యావసర సర్వీసులుగా నేరుగా ప్రభుత్వం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనం అందించే సేవలు ఎంత గొప్పవో మన చందాదారులకు తెలుసు. మనల్ని కోవిడ్ వారియర్లుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోయినా మన చందాదారులపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేరుస్తూనే ఉన్నాం.
అయితే, ఈ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో మన పరిశ్రమలోని సోదరులు కూడా బలవుతున్న విషయాన్ని మనం తీవ్రంగానే పరిగణించాలి. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం ఎంత నిస్వార్థమైన సేవలు అందించినా, అవి మన ప్రాణం కంటే ఎక్కువ కాకూడదు. మనం మన కుటుంబానికి బాధ్యత వహించాల్సిన, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఇప్పుడు 18 ఏళ్ళు పైబడినవారందరికీ టీకాలు వేయించుకునే అవకాశం వచ్చింది కాబట్టి మన సిబ్బందితో సహా అందరం తప్పనిసరిగా టీకాలు వేయించుకుందాం. కేబుల్ బిల్లులు నగదు రూపంలో కాకుండా డిజిటల్ పద్ధతిలో జరగటాన్ని ప్రోత్సహించటం ద్వారా ఇంటింటికీ తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తే సిబ్బంది సురక్షితంగా ఉంటారు. కచ్చితంగా మాస్క్ ధరించేటట్టు, సాఅమాజిక దూరాన్ని పాటించేట్టు సిబ్బందికి అలవాటు చేసి కచ్చితంగా పర్యవేక్షించాలి.
ఇటీవలి కాలంలో మనవాళ్ళను చాలామందిని మనం కోల్పోయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది, ఎమ్మెస్వో సోదరుడు కొల్లా కిశోర్ గారి సోదరి, బతుకమ్మ టీవీ సీఈవీ అయిన కల్పన గారు కరోనా బారినపడి మరణించారు. మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి కేంద్రంగా ఆమె ఎనిమిదేళ్ళుగా బతుకమ్మ టీవీ నిర్వహిస్తూ వచ్చారు. సంగారెడ్డి కేబుల్ ఆపరేటర్ కటకం శ్రీనివాస్ గారు, బ్రైట్ వే యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ మంతెన లింగయ్య గారు, కోరుట్ల పావని డిజిటల్ కమ్యూనికేషన్స్ అధిపతి కటకం ప్రవీణ్ గారు, సంగారెడ్డి జిల్లాసదాశివపేట్ కృష్ణానగర్ కు చెందిన ఆపరేటర్ రమేశ్… ఇలా ఎంతో మందిని ఈ మధ్య కాలంలో పోగొట్టుకున్నాం. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ క్లిష్టపరిస్థితిల్లో జాగ్రత్త వహించటం ఒక్కటే మనం వాళ్ళకు అందించే నివాళి.
దుఃఖం దిగమింగుకుంటూ ముందుకు సాగాల్సిన సమయమిది. ఒకవైపు కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే మరోవైపు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని వెదుక్కోవాలన్న సూత్రాన్ని మనకు మనం వర్తింపజేసుకుందాం. వ్యాపారాన్ని కూడా జాగ్రత్తగా వృద్ధి చేసుకోవటం మీద దృష్టిపెడదాం. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన బ్రాడ్ బాండ్ కు మళ్ళీ డిమాండ్ పెరుగుతున్న సమయంలో డిటిహెచ్ కి అవకాశం లేని, కేబుల్ రంగానికే అవకాశం ఉన్న ఈ ఆదాయ మార్గాన్ని వాడుకుందాం. బ్రాడ్ బాండ్ తీసుకునే అవకాశమున్న ఏ ఇంటినీ వదలకుండా వాళ్లలో అవగాహన పెంచి బ్రాడ్ బాండ్ కనెక్షన్లు ఇద్దాం. ఈ వ్యాపార అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పటికే బిఎస్ ఎస్ ఎల్ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు రూపొందించింది. వారి భాగస్వామ్యంతో లబ్ధిపొందే ప్రయత్నం చేద్దాం.
సదా మీ శ్రేయస్సు కోరే
మీ
సుభాష్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here