ఎనిమిదో ఏట కేబుల్ సమాచారమ్

0
491

ప్రియమైన పాఠకులారా!
మాస పత్రికగా మొదలై టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ శరవేగంగా సమాచారాన్ని అందించటానికి డిజిటల్ మాధ్యమంలోకి ప్రవేశించిన మీ అభిమాన కేబుల్ సమాచారమ్ నేడు ఎనిమిదో ఏట అడుగుపెట్టింది. మా కృషికి మీ ఆదరణ తోడవటం వల్లనే ఈ విజయం సాధ్యమైంది.
కేబుల్ టీవీ డిజిటైజేషన్ దిశగా అడుగులు పడుతున్న సమయమలో విలువైన సమాచారాన్ని తేట తెలుగులో అర్థమయ్యేలా తెలియజేయాలన్న కోరికతో ఏడేళ్ళ కిందట కేబుల్ సమాచారమ్ పేరుతో మాస పత్రిక ప్రారంభించాం. ఇది కేబుల్ ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు, బ్రాడ్ బాండ్ ఆపరేటర్లకు, బ్రాడ్ కాస్టర్లకు కూడా పరిశ్రమకు సంబంధించిన తాజా సమాచారం అందిస్తూ వచ్చింది.
అదే సమయంలో పరిశ్రమలో డిజిటైజేషన్ నియమనిబంధనలు రావటంతో అన్నిటినీ ఒక చోట చేర్చి అవగాహన పెంచుకోవటానికి సహాయపడేలా ‘కేబుల్ టీవీ డిజిటైజేషన్’ పేరుతో ఒక పుస్తకం కూడా ప్రచురించాం. దాన్ని కూడా మీరందరూ ఆదరించారు.
ఈ స్పీడ్ యుగంలో పరిశ్రమ తాజా సమాచారం కోసం నెలరోజులు వేచి చూడాల్సిన పరిస్థితి మారాలన్న ఆలోచనతో కేబుల్ సమాచారమ్ ను వెబ్ సైట్ గా తీర్చిదిద్దటంతోబాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అందుబాటులోకి తెచ్చాం. కేవలం వార్తలకే పరిమితం కాకుండా విశ్లేషణాత్మక వ్యాసాలు ఇవ్వటం ద్వారా కేబుల్ రంగంలోని వారందరి అవగాహన పెంచుతూ వచ్చాం. ఆ విధంగా కేబుల్ రంగానికి ఏకైక వెబ్ సైట్ గా మీ అందరి హృదయాలలో ముద్ర వేసుకున్నాం.
ఒక వెబ్ సైట్ పెట్టటం వేరు, క్రమం తప్పకుండా దాన్ని నిర్వహించటం వేరు. మాస పత్రికలా నెలకోమారు కాకుండా ఎప్పటికప్పుడు వార్తలందించటం కత్తిమీద సాములాంటిదే. జాతీయస్థాయిలో టెలివిజన్ పోస్ట్, కేబుల్ క్వెస్ట్ లాంటి పోర్టల్స్ మూతబడినా కేబుల్ సమాచారమ్ మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది. మీ ఆదరాభిమానాలే మా బృందం కృషికి మీరిచ్చే బహుమతి.
ఎప్పటికీ మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ,
మీ
సుభాష్ రెడ్డి,
చీఫ్ ఎడిటర్, కేబుల్ సమాచారమ్ డాట్ కామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here