ఒలంపిక్స్ ప్రసారంపై కేబుల్ ఆపరేటర్లకు హెచ్చరిక

0
698

రాబోయే ఒలంపిక్స్ క్రీడల ప్రసారాలను అనధికారికంగా ప్రసారం చేసే ఎమ్మెవోలను, కేబుల్ ఆపరేటర్లను, వెబ్ సైట్లను ఢిల్లీ హైకోర్టు ముందస్తుగా హెచ్చరించింది. భారత్ లో ఈ సారి ఒలంపిక్స్ క్రీడల ప్రసారానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రత్యేకంగా హక్కులు పొందింది. అనధికారికంగా ఈ సిగ్నల్స్ వాడుకునే అవకాశమున్నవారినుంచి రక్షణ కావాలని సోనీ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2020 ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఇప్పుడు జులై 23 న మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరిగే ఈ ఒలంపిక్స్ క్రీడాంశాలను భారతదేశంలో ప్రసారం చేయటానికి సోనీ హక్కులు కొనుక్కుంది. గతంలో క్రికెట్ ప్రసార సమయంలోనూ కొన్ని వెబ్ సైట్లు, కొంతమంది ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రసారాలు చేయటం వలన కోర్టును ఆశ్రయించినట్టు సోనీ తన పిటిషన్ లో పేర్కొంది.
తమ వేదికల మీద అక్రమంగా ఈ ప్రసారాలు అందించే వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అదే విధంగా ప్రభుత్వం కూడా అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు జారీచేయాలని ఆదేశించింది. సోనీ తో ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ అసోసియేషన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత్ లో ఏ మీడియా వేదికపైన అయినా ప్రసారం చేసుకునే హక్కు సోనీకి మాత్రమే ఉంటుంది.
ఇప్పటికే భారత బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోనీ నెట్ వర్క్ హమ్ హోంగే కామ్ యాబ్ పేరిట ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. టొక్యో లో జరిగే ఒలంపిక్స్ క్రీడలను సోనీ నెట్ వర్క్ తన సోనీ టెన్ 1, సోనీ టెన్ 2, సోనీ టెన్ 3, సోనీ టెన్ 4, సోనీ సిక్స్ చానల్స్ లో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here