2020 – కేబుల్ రంగానికి సమస్యలూ, సవాళ్ళూ

0
609

2020 లో కేబుల్ రంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. రెండో టారిఫ్ ఆర్డర్ తెచ్చిన ఆంక్షలు కొన్నిటివలన ఆదాయం తగ్గిపోగా కరోనా సంక్షోభం మరికొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. డిటిహెచ్ నిబంధనలు సడలిస్తూ ట్రాయ్ చేసిన సిఫార్సులు, వాటికి ప్రభుత్వ ఆమోదం పరోక్షంగానైనా కేబుల్ రంగానికి నష్టం చేకూర్చే పనే. ఇక రిలయెన్స్ జియో లాంటి కార్పొరేట్ ఎమ్మెస్వోలు అనైతికంగా వ్యాపారాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరో అంశం. ఏడాది చివరలో ట్రాయ్ లోకల్ చానల్స్ ను కట్టడి చేయటానికి నడుం బిగించటం కేబుల్ పరిశ్రమమీద ఆధారపడినవారి ఆదాయానికి గండికొట్టే ప్రయత్నమే.
2020 సంవత్సరం అనేక విధాలుగా కేబుల్ టీవీ పరిశ్రమ మీద ప్రతికూల ప్రభావం చూపింది. సరిగ్గా కొత్త సంవత్సరం ప్రారంభమైన జనవరి1 నాడే ఎన్ టీ వో 2.0 పేరుతో కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకటించింది. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద ఇచ్చే కనీస మొత్తం రూ.139 కి ఇచ్చే ఉచిత చానల్స్ సంఖ్యను 100 నుంచి 200 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో దూరదర్శన్ చానల్స్ ను వీటికి అదనంగా ఇవ్వాలనే షరతు విధించింది. దీనివలన అదనపు చానల్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయం పోయింది. అదే సమయంలో ఒక ఇంట్లో రెండో కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ కు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు 40 % మాత్రమే వసూలు చేయాలనే నిబంధనపెట్టింది. ఇది కూదా ఆదాయ వనరుకు గండికొట్టే విషయమే, సాధారణంగా రెండో కనెక్షన్ ఉంటే డబ్బున్నవాళ్ళే అయి ఉంటారు, వాళ్లకి రాయితీ ఇచ్చి కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టినట్టయింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే బ్రాడ్ కాస్టర్లు అలా రెండో టీవీకి రాయితీ ఇవ్వాలని మాత్రం నిబంధన పెట్టలేదు. మొత్తంగా చూస్తే, రెండో టారిఫ్ ఆర్డర్ పేరుతో కేబుల్ ఆపరేటర్ల ఆదాయ వనరులకు గండికొడుతూ ట్రాయ్ కొత్త సంవత్సర కానుక ఇవ్వటం దారుణం.
కరోనా సంక్షోభం ఈ రంగానికి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రజలు రేయింబవళ్ళూ ఇళ్లలోనే ఉంటూ టీవీ చుస్తున్న సమయంలో ప్రసారాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా అందించటానికి కేబుల్ సిబ్బంది పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సొంత ఆరోగ్యాన్ని ఖాతరు చేయకుండా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. ఇంకోవైపు ప్రేక్షకులనుంచి తీవ్ర నిరసనలు కూడా ఎదుర్కున్నారు. బ్రాడ్ కాస్టర్లు కొత్త కార్యక్రమాలు నిర్మించలేకపోవటం వలన పాతవే మళ్లీ మళ్లీ చూపటం ప్రేక్షకులను బాగా నిరాశపరచింది. ఆ అసంతృప్తిని కూడా ప్రేక్షకులు కేబుల్ ఆపరేటర్లమీదనే చూపించారు. చణ్దా వసూళ్ళు పూర్తుగా డిజిటైజ్ కాకపోవటం వలన కేబుల్ సిబ్బంది ఇంటింటికీ తిరగాల్సి వచ్చింది. పాత ప్రసారాలు చూపినా, బ్రాడ్ కాస్టర్లు పూర్తిమొత్తం వసూలు చేయాలనుకోవటం కూడా మళ్లీ ఆపరేటర్లకే తలనొప్పి వ్యవహారంగా తయారైంది. ఏమైనా, కరోనా సంక్షోభ సమయంలో ఆపరేటర్లకే అన్ని రకాల సమస్యలూ ఎదురయ్యాయి.
ఇంకోవైపు కార్పొరేట్ ఎమ్మెస్వోల దాష్టీకం బాగా పెరిగిపోయింది. రకరకాల ఆకర్షణీయమైన పాకేజ్ ల పేరుతో మభ్యపెడుతూ, చందాదారులను ఆకట్టుకుంటూ ఆపరేటర్లమీద వత్తిడి పెంచారు. వ్యాపారం ఉంటుందా పోతుందా అనే భయం కలిగించి ఆపరేటర్లను లొంగదీసుకునే ప్రయత్నాలు సాగాయి. ఎన్ ఎక్స్ టి డిజిటల్ వంటి సంస్థలు ఈ రంగాని చెందనివారిని ప్రోత్సహించి కేబుల్ వ్యాపారంలో ఉన్నవారిని దెబ్బతీయటానికి ప్రయత్నించటం కూడా జరిగింది. రిలయెన్స్ జియో లాంటి సంస్థలు తాత్కాలిక ప్రయోజనాలు చూపి, భవిష్యత్ గురించి ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా చేస్తూ వచ్చాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎపి ఎస్ ఎఫ్ ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆపరేటర్లలో అత్మవిశ్వాసం నింపటంలో విఫలమయ్యాయి. సంస్థ సేవలు కొనసాగుతాయా లేదా అనే అనుమానాస్పద వాతావరణం నెలకొంది. డిటిహెచ్ విషయంలో ట్రాయ్ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయటం కూడా పరోక్షంగా కేబుల్ రంగాన్ని దెబ్బతీయబోతోంది. లైసెన్స్ ఫీజును ఆదాయంలో 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించటం లాంటి నిర్ణయాల వలన డిటిహెచ్ ఆపరేటర్ల లాభం పెరుగుతుంది. దీనివల్ల మరిన్ని పాకేజీలతో కేబుల్ వ్యాపారాన్ని లాక్కునే ప్రయత్నం చేసే ప్రమాదముంది.
ఏడాది చివరినెలలో ట్రాయ్ ఒక చర్చాపత్రం జారీచేసి ఎమ్మెస్వోలు, కేబుల్ చానల్స్ నడుపుకునే చానల్స్ సంఖ్యను పరిమితం చేయాలన్న అభిప్రాయాన్ని అందరిముందూ ఉంచింది. కేబుల్ ఆపరేటర్ల పోస్టల్ రిజిస్ట్రేషన్ చాలదన్నట్టు ఇప్పుడు హోం మంత్రిత్వశాఖనుంచి క్లియరెన్స్ ఉండాలని వాదిస్తోంది. హిట్స్ ఆపరేటర్ సహా కార్పొరేట్ ఎమ్మెస్వోలు కూడా ఇది సరైన నిర్ణయమేనని చెప్పటం ద్వారా ఆపరేటర్లమీద ఆంక్షలు పెరగబోతున్నాయి. కేబుల్ ఆపరేటర్లు ఇచ్చే చానల్స్ కచ్చితంగా ఎమ్మెస్వో దగ్గర ఎన్ క్రిప్ట్ కావాలన్న నిబంధన చాలా పెద్ద సమస్యలు సృష్టించబోతున్నది. బ్రాడ్ బాండ్ చార్జీలు అదనం కావటంతోబాటు ఎమ్మెస్వోలు అన్ని చానల్స్ ఇవ్వగలిగే అవకాశం లేకపోవటంతో ఇకమీదట కేబుల్ ఆపరేటర్లు సొంత చానల్స్ నడుపుకునే అవకాశం కనబడటం లేదు. కేబుల్ ఆపరేటర్ అస్తిత్వానికి నిదర్శనమైన లోకల్ చానల్స్ లేకపోతే స్థానికంగా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోతుంది. పైగా, కార్యక్రమాలు తయారుచేసి ఇచ్చే ఏజెన్సీలనుంచి చౌకగా కంటెంట్ అందుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇది పెద్ద సమస్యే అవుతుంది. ఒకేసారి పైరసీని అడ్డుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తుండగా ఇకమీదట ఒక్కో ఆపరేటర్ ఇచ్చే చానల్స్ సంఖ్య పరిమితంగా ఉంటుంది.
ఈ విధంగా 2020 సంవత్సరం కేబుల్ రంగాన్ని ఎన్నో రకాల సమస్యలకు గురి చేసింది. ప్రభుత్వ నిబంధనలు సైతం ప్రతికూలంగా ఉండి కేబుల్ ఆపరేటర్లను, స్వతంత్ర ఎమ్మెస్వోలను ఇబ్బందుల పాలు చేశాయి. అయితే, సమస్యలను ఎదుర్కోవటం కేబుల్ పరిశ్రమకు కొత్తకాదు గనుక మళ్లీ కోలుకోవటానికి, మరింత దీటుగా సమాధానమిస్తూ 2021లో దూసుకుపోవటానికి సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here