కేబుల్ ప్రయోజనాలు పట్టించుకొండి: ట్రాయ్ కొత్త చైర్మన్ కి లేఖ

0
616

కేబుల్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే ఈ విషయంలో అనేకమార్లు లేఖలు రాశామని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంస్థ అధ్యక్షుడు అరవింద్ ప్రభు ట్రాయ్ కి రాసిన తాజా లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఇంటింటి వినోదంలో ఇప్పటికీ కేబుల్ రంగానిదే పైచేయి అయినప్పటికీ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఇంకా అనేక సవాల్ళు ఎదుర్కుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఒటిటి  ఒకవైపు, ట్రాయ్ నియంత్రణలు మరోవైపు కేబుల్ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయన్నారు. కోవిడ్ కారణంగా చందాదారుల సంఖ్య తగ్గిపోవటం ఈ సంక్షోభం మొదలైన తొలి నాలుగు నెలల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఒకవైపు కోరుకున్న కార్యక్రమం చూసే వెసులుబాటు ఉన్న ఒటిటి వేదికలు, మరోవైపు పాత కార్యక్రమాలే చూపిస్తున్న బ్రాడ్ కాస్టర్లు ఇలాంటి పరిస్థితికి దారితీశాయన్నారు.

 వ్యాపార సంస్థలు మూతపడటంతో మరికొన్ని కనెక్షన్లు కోల్పోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు. సరోనా సమయంలో పోయిన కనెక్షనలో సగం కూడా తిరిగిరాలేదని తేలిపొయిందన్నారు. చాలామంది కరోనా ఆరంభంలోనే ఒటిటి వైపు వెళ్ళగా వారెవరూ వెనక్కి వచ్చే అవకాశం కనబడటం లేదన్నారు. మామూలు టీవీ కార్యక్రమాలతోబాటు రక రకాల వెబ్ సిరీస్, స్పోర్ట్స్ కూడా అందుతూ ఉండటం అందుకు ప్రధాన కారణంగా విశ్లేషించారు.

కరోనా తరువాత నిర్వహణకు సంబంధించి ఎదురైన పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. అన్ లాక్ మొదలైనప్పటినుంచి క్రమంగా వస్తున్న మార్పు ఇంకా పూర్తి స్థాయికి చేరుకోలేదని వ్యాఖ్యానించారు. కేబుల్ టీవీ  నిత్యావసరమే అయినప్పటికీ సిబ్బందికి కరోనా సమయంలో ప్రభుత్వ బీమా లేకపోవటం ఒక సమస్యగా మారిందన్నారు. కేబుల్ రంగానికి అవసరమైన పరికరాల అందుబాటు కూడా సమస్యగా మారిన నేపథ్యంలో ఇబ్బందుక్లు తప్పలేదని చెబుతూ, గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో సిబ్బంది సమస్య  ఎక్కువగా ఉన్న విషయాన్ని ట్రాయ్ దృష్టికి తెచ్చారు. మహారాష్ట్ర లాంటి చోట కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో మామూలు పరిస్థితులు రావటానికి ఇంకో నెల పట్టవచ్చునన్నారు.

కరోనా సంగతి పక్కనబెట్టినా, అంతకుముందు నుంచే కేబుల్ ఆపరేటర్లు అనేక సమస్యలు ఎదుర్కుంటూ వస్తునట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ట్రాయ్ రెండో టారిఫ్ ఆర్డర్ ఇస్తూ, అందులో నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు మీద పరిమితి విధించటం వలన ఆపరేతర్ల ఆదాయ వనరుకు గండిపడిందన్నారు. కొత్త టారిఫ్ ఆర్డర్ కు ముందు ఇచ్చిన చర్చాపత్రం మీద ఆపరేటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను ట్రాయ్ లెక్కలోకి తీసుకోకపోవటం సమస్యలు తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు.

కొత్త చైర్మన్ పిడి వాఘేలా తగిన చొరవ తీసుకోకపోతే కేబుల్ రంగం కోలుకోవటం చాలా కష్టమని కూడా ప్రభు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పంపిన అనేక లేఖలు చూసినా సమస్యలు పూర్తిగా అర్థమవుతాయని, వాటి ఆధారంగా కేబుల్ రంగానికి ఏది అవసరమో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. అందుకే ఈ రంగంలో ఉన్న బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లు) కేబుల్ ఆపరేటర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ట్రాయ్ చైర్మన్ కు సూచించారు.

దీర్ఘకాల సమస్యలతోబాటు ఆపరేటర్లు ఎదుర్కుంటున్న స్వలప కాల సమస్యలగురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరముందన్నారు. నమూనా ఇంటర్ కనెక్ట్ ఒప్పందం మీద ఎవరూ సంతకం చేయకపోవటాన్ని ప్రస్తావించారు.రెండు మూడేళ్ళ క్రితం నాటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప కొత్త ఒప్పందాలు జరగలేదన్నారు. అదే విధంగా సెట్ టాప్ బాక్స్ యాజమాన్యం ఎవరిదనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టతా లేదన్నారు.  చందాదారు కొనుక్కుంటే చందాదారు యజమాని అవుతాడని, ఆపరేటర్ కొని ఉంటే ఆపరేటర్, ఎమ్మెస్వో కొని ఉంటే ఎమ్మెస్వో యజమాని కావాలే తప్ప ఎలాంటి స్పష్టమైన నిర్వచనమూ లేకపోవటం కూడా అనేక సమస్యలకు దారితీస్తున్నదని ప్రభు ఆ లేఖలో ట్రాయ్ దృష్టికి తెచ్చారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here