మరింత కఠినంగా కేబుల్ టీవీ చట్టం

0
1215

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు జాతీయ ప్రసార విధానం (నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ) ప్రకటించటానికి సిద్ధమవుతుండగా అదే సమయంలో కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్) చట్టం, 1995 ను సవరించి కొత్త రూపంలో ప్రకటించ బోతోంది. గతంలో కేబుల్ టీవీ ఆపరేటర్ ను మాత్రమే ప్రస్తావించగా ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లను, పంపిణీ సంస్థలను (ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్, ఐపిటీవీ ఆపరేటర్లను కూడా ఈ పరిధిలోకి తెస్తున్నది. గత నెలలోనే సిద్ధమైన ముసాయిదా మరికొన్ని మార్పులు కూడా చేసి వెల్లడించబోతోంది.
ఇప్పటివరకు ఉన్న కేబుల్ టీవీ చట్టానికి పేరు మార్చి టెలివిజన్ ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ (రెగ్యులేషన్ ) యాక్ట్ గా ప్రకటించబోతోంది. ఈ ప్రతిపాదిత చట్టంలో చాలా కీలకమైన మార్పులు చేయటం ద్వారా దాని పరిధిని బాగా విస్తృతం చేశారు. కేబుల్ ఆపరేటర్ నిర్వచనంలో స్థానిక కేబుల్ ఆపరేటర్ తో బాటు ఎమ్మెస్వోను కూడా చేర్చారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ ద్వారా ప్రసారాలు అందించే వారు, వాటిని నియంత్రించేవారు కూడా కొత్త చట్టం కిందికి వస్తారు. ఆవిధంగా ఎమ్మెస్వోలను కూడా చేర్చినట్టయింది.
ఇందులో కంపెనీ అనే పదం నిర్వచనంలో 2013 నాటి కంపెనీల చట్టం కింద నమోదైన డిపివో, డిటిహెచ్, హిట్స్, ఐపిటీవీ, ఎల్ సి వో, ఎమ్మెస్వో లు అందరూ వస్తారు. కార్యక్రమాల, ప్రకటనల నియమావళికి వచ్చే సరికి పంపిణీ సంస్థలతోబాటు బ్రాడ్ కాస్టర్లను కూడా ఆ పరిధిలోకి తీసుకువస్తున్నారు.
అదే సమయంలో బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ అందించటానికి వీలుకల్పిస్తూ దానికి కూడా రైట్ ఆఫ్ వే సౌకర్యం కల్పించబోతున్నారు. దీనివలన కేబుల్ ఆపరేటర్లు బ్రాడ్ బాండ్ ఇవ్వదలచుకుంటే అదనంగా కేబుల్ వేసుకోవాల్సినప్పుడు కూడా వెసులుబాటు కలుగుతుంది. ఆ విధంగా డిటిహెచ్ చందాదారులకు కూడా ఇంటర్నెట్ ఇవ్వటానికి కూడా ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఫైబర్ లైన్ వేసుకోవచ్చు.
ఇక ప్రధానమైన కొత్త నియమాల విషయానికొస్తే, ప్రతి కేబుల్ ఆపరేటర్ తాను ప్రసారం చేసే కార్యక్రమాల జాబితా మొత్తాన్ని ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ రూపంలో ఎలక్ట్రానికి పద్ధతిలో కనీసం ఏడాదిపాటు నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనివలన ఎక్కదైనా కార్యక్రమాల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్టు ఫిర్యాదు అందితే చర్యలుతీసుకోవటానికి వీలుంటుంది. అదే విధంగా ప్రసార హక్కులు లేని కార్యక్రమాలు ప్రసారం చేసినా చర్యలు తీసుకోవటం సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఎప్పుడు అడిగినా ఆ వివరాలు సమర్పించవలసి ఉంటుంది.
జరిమానాలు, శిక్షల విధింపు విషయంలో కూడా నిరుడు జారీచేసిన చర్చాపత్రంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్యక్రమాలు, ప్రకటనల నియమవాళి సహా కొత్త చట్టంలో నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో గతంలో రెండేళ్ళ జైలు శిక్ష, రూ.1000 జరిమానా ఉండగా ఇప్పుడు దాన్ని రూ.10,000 కు పెంచాలని ప్రతిపాదించారు. రెండో విడత తప్పు చేస్తే రూ. 5000 ఉన్న జరిమానాను 50 వేలకు, జైలుశిక్షను ఐదేళ్ళకు పెంచాలని ప్రతిపాదించారు. ఇలా ఉల్లంఘనలకు విధించే శిక్షను కేవలం కేబుల్ ఆపరేటర్లకే కాకుండా బ్రాడ్ కాస్టర్లను, పంపిణీ సంస్థలకు కూదా వర్తింపజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here