ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు ఆలస్యం కాక తప్పదా?

0
555

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) జారీచేసిన రెండవ టారిఫ్ ఆర్డర్ అమలు ఆలస్యం అవుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ విషయం ఇప్పటికే కోర్టులలో ఉండటం, స్టార్ ఇండియా వేసిన కేసులో విచారణ కూడా పూర్తయి, తీర్పు రిజర్వ్ లో ఉండటం తెలిసిందే. అలా ఉన్న సమయంలో ట్రాయ్ మధ్యలోనే మళ్ళీ బ్రాడ్ కాస్టర్లందరినీ కొత్త నిబంధనలకు అనుగుణంగా టారిఫ్ ప్రకటించవలసిందిగా ఆదేశాలు ఇవ్వటమంటే అది కోర్టు ధిక్కారం కిందికి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు చానల్ ధరలు ప్రకటించవలసిందిగా కోరిన ట్రాయ్ ఆ కొత్త ధరల అమలుకు ఎలాంటి షెడ్యూల్ నూ ప్రకటించకపోవటాన్ని బట్టి కూడా అమలుకు ఇంకా చాలాకాలం పట్టువచ్చునన్న అభిప్రాయాలకు ఊతమిస్తున్నాయి. కొత్త ధరలు ప్రకటించిన తరువాత బ్రాడ్ కాస్టర్లకూ, పంపిణీ సంస్థలకూ మధ్య ఒప్పందాలు జరగాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ అతరువాత పంపిణీ సంస్థలకు, ఆపరేటర్లకు మధ్య కూడా ఒప్పందాలు జరగాలి. ఈలోపు చందాదారులు తమకు నచ్చిన బొకేలు ఎంచుకోవాలి.ఈ మొత్తమ్ ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అందువలన దసరా-దీపావళి సీజన్ లోపు ఇది అమలు జరిగే అవకాశం కనబడటం లేదు.
2017 మార్చి లో ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ఇవ్వగా ఈ ఏడాది జనవరి 1న సవరించిన ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇది ఈ దశాబ్ద కాలంలోనే మీడియా పరిశ్రమలో అత్యంత వివాదాస్పదమైన ఆదేశంగా పేరు తెచ్చుకుంది. 2017 నాటి ఉత్తర్వులు చాన్ల యాజమాన్యాలు బొకేలు తయారుచేయకుండా అడ్డుకోవటానికే ఉద్దేశించినది. అలాంటి బొకేల వలన ఒక పక్క ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు మరో పక్క చందాదారులు ఏదో విధంగా బ్రాడ్ కాస్టర్ల చానల్స్ అన్నీ తీసుకునేట్టు చేయటమే బ్రాడ్ కాస్టర్ల లక్ష్యం.
ట్రాయ్ ఆ ఆదేశాలు జారీ చేసే సమయానికి దేశమంతటా బ్రాడ్ కాస్టర్లే పరోక్షంగా వినియోగదారులు చూడాల్సిన చానల్స్ ను నిర్ణయించేవారు. అప్పట్లో పంపిణీ సంస్థలకు ఆ విధంగానే ఇచ్చేవారు. అందువలన వారు కూడా చందాదారులకు అవే పాకేజీలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూపొందించిన బొకేల కారణంగా డజన్లకొద్దీ చానల్స్ ఇవ్వాల్సి వస్తున్నది.
చానల్స్ ను విడివిడిగా కూడా ఇస్తున్నప్పటికీ అది నామమాత్రమే. విడి ధరలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఎవరూ అలా విడి చానల్స్ తీసుకోవటానికి ఇష్టపడరు. మరీ కొంతమంది పెద్ద బ్రాడ్ కాస్టర్లు అయితే 35-70 చానల్స్ నిర్వహిస్తూ రకరకాల బొకేలు పెట్టి ఏదోవిధంగా బొకేలు అంటగట్టటానికే ప్రయత్నిస్తూ వచ్చారు. ఇంకోవైపు వీళ్ళే ఎమ్మెస్వోల, డిటిహెచ్ ఆపరేటర్ల కెపాసిటీలో ఎక్కువభాగం ఆక్రమిస్తూ వస్తున్నారు. చిన్న చానల్స్ కు అవకాశం లేని పరిస్థితి కల్పించారు. అలాంటి చిన్న చానల్స్ వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది.
అయితే, ట్రాయ్ ఈ విధానానికి చరమగీతం పాడాలని నిర్ణయించింది. చందాదారులకు తగినంత స్వేచ్చ లేదని కూడా గుర్తించింది. కానీ కోర్టు కేసులు ఏడాదిన్నరకాలంగా సాగినమీదట 2019 జనవరిలో అమలు మొదలైంది. కానీ బొకేలు తయారు చేయటాన్ని మాత్రం ట్రాయ్ సమర్థంగా అడ్డుకోలేకపోయింది. పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోగా, చందాదారులకు ధరలు పెరిగాయి. ఈ విషయంలో ఒకవైపు చందాదారులనుంచి, మరోవైపు ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లనుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ట్రాయ్ ఈ బొకేల విధానానికి అడ్డుకట్ట వేయటానికి పూనుకుంది. ఫలితంగా సవరించిన టారిఫ్ ఆర్డర్ ను ఈ ఏడాది జనవరి 1న విడుదల చేసింది.
అయితే, దీనిమీద కూడా బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెళ్లారు. కొత్త ఆదేశాలు అమలు కాకుండా స్టే లాంటి మధ్యంతర ఉత్తర్వులతో ఊరట కల్పించాలని కోరారు. కానీ వాళ్లకు స్టే లభించలేదు. అయితే, బొంబే హైకోర్టు మాత్రం కొద్ది రోజుల్లోనే విచారణ పూర్తి చేసి మార్చి ఆరంభంలో తీర్పు రిజర్వ్ చేసింది. అందుకే ఆదేశాలు వచ్చేదాకా బలవంతం చేయగూడదని ట్రాయ్ నిర్ణయించుకొని తన ఆదేశాల అమలుకోసం పట్టుబట్టలేదు.
ఐదు నెలలు గడిచినా కోర్టు నుంచి ఆదేశాలు రాకపోవటంతో ట్రాయ్ గతవారం కొత్త టారిఫ్ అమలు దిశలో బ్రాడ్ కాస్టర్లు ఆగస్టు 10 లోగా చానల్స్ ధరలు ప్రకటించాలని ఆదేశించింది. ఇది అమలు జరగటమంటూ మొదలైతే మాత్రం బ్రాడ్ కాస్టర్లు కచ్చితంగా తమ చానల్స్ ధరలు కనీసం 30% తగ్గించాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు చందాదారుల బిల్లులు సగటున నెలకు రూ. 50 అయినా తగ్గే అవకాశముంటుంది. ఆ మేరకు మరికొన్ని చానల్స్ తీసుకుంటారా, తగ్గిన ధరతో ఆనందిస్తారా అనేది ముందు ముందు తేలుతుంది.
చందాదారులు, కేబుల్/డిటిహెచ్ ఆపరేటర్లు ట్రాయ్ పట్ల సానుభూతితో ఉన్నారు. చందాదారుల అభిప్రాయాలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ట్రాయ్ నిర్ణయం వలన చందాదారులు కొంత ఊరట చెందుతారనే అభిప్రాయం వాళ్లకుంది. కోరుకున్న చానల్స్ మాత్రమే ఎంచుకునే స్వేచ్చ పెరగటం వలన చందాదారులు సంతృప్తి చెందుతారు. పాత బొకే విధానంలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. కానీ బ్రాడ్ కాస్టర్లు మాత్రం వాళ్ళు నడిపే చిన్న చితకా చానల్స్ ప్రజలకు అందుబాటు తగ్గిపోయి ఆర్థికంగా నష్టపోతామనే భయంతో ఉన్నారు. కొన్ని చానల్స్ మూతబడవచ్చునని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here