రేటింగ్స్ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం సిద్ధం?

0
664

ప్రస్తుతం టీవీ రేటింగ్ ఏజెన్సీలకోసం అమలులో ఉన్న మార్గదర్శకాలను త్వరలో ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ ఏడాది జనవరిలోనే తన నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. అందులోని సిఫార్సులకనుగుణంగా రేటింగ్స్ నియమావళిలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్టు కేంద్ర సమాచారశాఖామంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇప్పుడున్న నియమాలు, మార్గదర్శకాలలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆ నివేదికమీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “కమిటీ సిఫార్సులను కూలంకషంగా విశ్లేషించిన మీదట వాటిని అమలు చేయాలని నిర్ణయించాం. ఇప్పుడున్న మార్గదర్శకాలలో ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ కొత్తవి చేరుస్తాం.” అన్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాలలో ప్రేక్షకుల కొలత పద్ధతులు, పానెల్ ఎంపిక, గోప్యత కాపాడటం, డేటా విశ్లేషణ, పారదర్శకత లాంటివన్నీ ఉన్నాయని, ఇవన్నీ జవాబుదారీతనంతో కూడుకున్న ఏ వ్యవస్థకైనా తప్పనిసరి అన్నారు.
పానెల్ ఇళ్ళ ఎంపికకు ముందు ఎస్టాబ్లిష్ మెంట్ సర్వే జరగాలని, అందుకు అనుగుణంగానే ఇళ్ల ఎంపిక జరగాలని ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్స్ చేసింది. కాలక్రమంలో ఇళ్ళ మార్పిడి కూడా పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే విధంగా పానెల్ సైజు కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలని, ఈ మొత్తం లెక్కింపు ప్రక్రియను రేటింగ్స్ సంస్థ తన వెబ్ సైట్ లో పెట్టాలని కూడా చెప్పింది. ఈ కమిటీ సిఫార్సులతోబాటు ట్రాయ్ చేసిన సిఫార్సులను కూడా లెక్కలోకి తీసుకుంటూ రేటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు.
2020 అక్టోబర్ లో ముంబయ్ పోలీసులు ఒక రేటింగ్ కుంభకోణాన్ని బైటపెట్టటంతో ఈ వ్యవహారంలో పెద్ద ఎత్త్తున దుమారం లేచింది. నగర కమిషనర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసికొన్ని ఆధారాలను కూడా బైటపెట్టారు. ఇందులో నిందితులు రేటింగ్స్ లెక్కించే బ్రాడ్ కాస్ట ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అధికారులకు లంచమిచ్చి తమకు అనుకూలమైన ప్రేక్షకాదరణ లెక్కలు అందుకున్నట్టు పోలీసులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థ పారదర్శకంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు సిఫార్సు చేయటానికి కమిటీని నియమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here