డిష్ టీవీకి 20 ఏళ్ళ డిటిహెచ్ లైసెన్స్

0
756

దేశంలో మొదటి డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) వేదిక అయిన జీ గ్రూప్ వారి డిష్ టీవీకి కొత్త నిబంధనల కింద 20 ఏళ్ళ లైసెన్స్ వచ్చింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజా రూపొందించిన నియమావళి కింద తొలి ఆమోదం పొందిన డిటిహెచ్ అయిన డిష్ టీవీ కి ఏప్రిల్ 1 నుంచి కొత్త లైసెన్స్ 20 ఏళ్ళ పాటు అమలులో ఉంటుంది.
పూర్తి స్థాయి ఆమోదం రావటానికి ముందుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ షరతులకు అంగీకరిస్తూ ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇతర మార్గదర్శకాలకు సంబంధిమ్చిన అనుమతులు పొందాల్సి ఉంటుంది. డిష్ టీవీకి మొదటి సారిగా 2003 అక్టోబర్ లో లైసెన్స్ వచ్చింది. అప్పట్లో లైసెన్స్ కాలపరిమితి 10 సంవత్సరాలు మాత్రమే. డిష్ టీవీ తరువాత టాటా స్కై, వీడియోకాన్, ఎయిర్ టెల్, రిలయెన్స్, సన్ గ్రూప్ సంస్థలు కూడా డిటిహెచ్ రంగంలో ప్రవేశించాయి.
అయితే ముందుగా పదేళ్ళ లైసెన్స్ పూర్తయిన సంస్థ కావటంతో రెన్యూవల్ వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. తాత్కాలికంగా గడువు పెంచుతూ వచ్చిన ప్రభుత్వం ఆ తరువాత మిగిలిన డిటిహెచ్ సంస్థలకు కూడా లైసెన్స్ కాలపరిమితి పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో డిటిహెచ్ లైసెన్సులమీద టాయ్ ని సిఫార్సులు పంపాల్సిందిగా కోరగా ట్రాయ్ కొన్ని మార్గదర్శకాలు సవరించింది.వాటికి ఎం ఐ బి ఆమోదం తెలియజేసింది.
ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారమే డిష్ టీవీకి లైసెన్స్ వచ్చింది. ఇది 20 ఏళ్ళపాటు అమలులో ఉంటుంది. డిటిహెచ్ రంగంలో నూటికి నూరుశాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. గతంలో స్థూల ఆదాయంలో 10 శాతాన్ని లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు దాన్ని 8 శాతానికి తగ్గించటంతోబాటు స్థూల ఆదాయంలొ జీఎస్టీ మినహాయించిన తరువాత ఉండే సవరించిన స్థూల ఆదాయంలో మాత్రమే 8 శాతం చెల్లించాలనే కొత్త నిబంధనలు తయారు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి మూడు నెలలకొకసారి చెల్లించేట్టు కూడా నిబంధనలు మార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here