ట్రాయ్, బ్రాడ్ కాస్టర్లు అడుతున్న నాటకంలో పావులు కేబుల్ ఆపరేటర్లు

0
741

కేబుల్ వ్యాపారం ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. డిజిటైజేషన్ లో వచ్చిన మార్పులను సక్రమంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఒకవైపు ట్రాయ్, మరోవైపు బ్రాడ్ కాస్టర్లు వేసిన వలలో చిక్కుకొని అమాయకంగా నష్ట పోతున్నారు. ఒకవైపు అందరికీ సమాన న్యాయం అంటూనే బ్రాడ్ కాస్టర్లు పరిమితంగా కొన్ని రాయితీలు ఇవ్వటానికి అవకాశం కల్పించిన ట్రాయ్ పరోక్షంగా చిన్న ఎమ్మెస్వోలను దెబ్బతీసింది. అదే సమయంలో కొందరు పెద్ద ఎమ్మెస్వోలు కూడా బ్రాడ్ కాస్టర్లు ఇచ్చే తాయిలాల సాయంతో ఆఫర్లు ప్రకటించి ఆపరేటర్లను, తద్వారా చందాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివలన కలిగే తాత్కాలిక ప్రయోజనానికీ, దీర్ఘకాల వ్యాపార ప్రయోజనాలకీ మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఎవరితో పోటీ పడాలో తెలియని అయోమయ వాతావరణంలో కొంతమంది ఎమ్మెస్వోలు కేబుల్ వ్యవస్థకే నష్టం చేస్తున్నారు.
మన పోటీ డిటిహెచ్ తో కదా?
కేబుల్ రంగానికి ప్రధాన పోటీదారు డిటిహెచ్. ఇది తిరుగులేని వాస్తవం. దేశంలో 22 కోట్లకు పైగా టీవీ ఇళ్ళు ఉంటే అందులో 4 కోట్ల ఇళ్ళలో ఫ్రీడిష్ పోను డిటిహెచ్ కనీసం 8 కోట్ల ఇళ్ళలో తిష్టవేసింది. ఒకప్పుడు తిరుగులేని కేబుల్ టీవీ ఇప్పుడు సగం ఇళ్ళకే పరిమితమైంది. ఇంతగా కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీసిన డిటిహెచ్ ని ఎదుర్కోవటానికి కేబుల్ రంగం దగ్గర ఆయుధాలున్నప్పటికీ వాటిని సక్రమంగా వాడుకోలేకపోతోంది. డిటిహెచ్ కనెక్షన్ కి ప్రధానంగా ఉన్న అవరోధాలు చాలా ముఖ్యమైనవి:
 వర్షాకాలంలో ప్రసారాలకు విఘాతం కలగటం,
 సర్వీసింగ్ అందుబాటులో లేకపోవటం,
 లోకల్ చానల్స్ ఇవ్వలేకపోవటం,
 ఇంటర్నెట్ ఇవ్వలేకపోవటం.
వీటన్నిటినీ చందాదారుకు గుర్తు చేసి మార్కెట్ లోకి చొచ్చుకుపోవాల్సిన కేబుల్ ఆపరేటర్లు అందులో విఫలమవుతున్నారనే చెప్పాలి.
సాటి కేబుల్ ఆపరేటర్ మీదనే యుద్ధమా?
కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్లు మరో కేబుల్ ఆపరేటర్ మీదనే యుద్ధం ప్రకటిస్తున్నారు. కొంతమంది ఎమ్మెస్వోలు తమలో తాము పోటీపడుతూ ఆపరేటర్లను రెచ్చగొడుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి పోరు వలన చివరికి డిటిహెచ్ కే మేలు జరుగుతుందన్న విషయాన్ని గ్రహించటం లేదు. డిటిహెచ్ చందాదారులను తమవైపు ఆకట్టుకోవటం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవాలన్న ఆలోచన విరమించుకుంటున్నారు. ఈ తరహా అనారోగ్యకరమైన వాతావరణం వలన కేబుల్ చందాదారులు తగ్గిపోయే ప్రమాదముంది.
ఇందులో బ్రాడ్ కాస్టర్ల వ్యూహం కూడా దాగి ఉంది. కార్పొరేట్ ఎమ్మెస్వోలకు, మరికొందరు బడా ఎమ్మెస్వోలకు పే చానల్ చందా రేట్లలో డిస్కౌంట్లు ఇస్తున్నారు. మామూలుగా అందరు బ్రాడ్ కాస్టర్లకూ ఒకే ధరకు చానల్స్ ఇవ్వాల్సి ఉన్నా, ఏడాదిలో ఒకసారి కొన్ని నెలలపాటు ప్రోత్సాహక డిస్కౌంట్లు ఇవ్వటానికి ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ పెద్ద ఎమ్మెస్వోల ద్వారా తగ్గింపు ధరల నాటకం ఆడిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని గ్రామాల్లో సైతం కొంతమంది ఎమ్మెస్వోలు ఆఫర్లు ప్రచారం చేస్తూ కేబుల్ రంగాన్ని దెబ్బతీస్తున్నారు. ఆ విధంగా తమ రంగానికే కీడు చేస్తున్నామన్న స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు.
డిడి ఫ్రీడిష్: పొంచి ఉన్న ముప్పు
ఎమ్మెస్వోలు ఇలా కేబుల్ ఆపరేటర్ల మధ్య స్పర్థలు పెంచుకుంటూ, ఆఫర్ల పేరుతో తాత్కాలిక ఆశలు చూపి వ్యవస్థను దెబ్బతీస్తే మరెన్నో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రసార భారతి వారి డిడి ఫ్రీడిష్ ఎప్పటికప్పుడు తన చానల్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. 2018 డిసెంబర్ లో 80 చానల్స్ ఉండగా 2019 డిసెంబర్ నాటికి 104 కు, 2020 డిసెంబర్ నాటికి 161 కు పెరిగాయి. త్వరలో ఈ సంఖ్య 200 దాటే అవకాశముంది. అలా పెరిగే కొద్దీ ప్రాంతీయ చానల్స్ కూడా అందులో చేరితే ప్రేక్షకులు అటువైపు మొగ్గు చూపే అవకాశముంది.
ఒకసారి కొంటే నెలవారీ చందా కట్టె అవసరం లేకుండా అన్నీ ఉచిత చానల్స్ చూసే అవకాశం మార్కెట్ మీద బాగానే ప్రభావం చూపుతుంది. పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా ఫ్రీడిష్ కోసం ఒక చానల్ తయారుచేసి అందించటం ఖాయం. ఇప్పటికే స్టార్, జీ, వయాకామ్ 18, సోనీ సంస్థలు తమ ఉచిత చానల్స్ ను కేవలం ఫ్రీడిష్ ను దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం, తద్వారా భారీ రేటింగ్స్ సంపాదించుకొని ప్రకటనల అదాయాన్ని గణనీయంగా పెంచుకోవటం చూస్తున్నాం. ఇక రాబోయే కాలంలో ఫ్రీడిష్ సృష్టించబోయే కలకలం అంతా ఇంతా ఉండబోదు.
ఈ నేపథ్యంలో కేబుల్ ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఆలోచించాల్సింది కేబుల్ రంగం ఎదుగుదలే తప్ప ఏదో విధంగా ఆశచూపి ఇంకో కేబుల్ ఆపరేటర్ ను పడగొట్టటం కాదు. వీలైతే డిటిహెచ్ మీద పోరాడాలి తప్ప సొంత పరిశ్రమకే తూట్లు పొడిస్తే నష్టపోయేది యావత్ కేబుల్ రంగమే. బ్రాడ్ కాస్టర్లు, డిటిహెచ్ ఆపరేటర్లు కోరుకుంటున్నది అదే. అందుకే ఈ కుట్రను గ్రహించి అనవసరమైన ఆఫర్లతో కేబుల్ రంగానికి నష్టం చేసుకోవటం మంచిది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here