డిజిటల్ న్యూస్ మీడియా: శ్రమ ఎవరిది, సిరి ఎవరిది?

0
622

విశ్వసనీయమైన వార్తలు ప్రజాస్వామ్యానికి పునాది. అయితే, విశ్వసనీయమైన వార్తలు అందజేయటం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. కేవలం వార్తాసేకరణే కాకుండా, రకరకాల వనరుల ద్వారా అందే వార్తల్లో నిజానిజాల నిర్థారణ కూడా అంతే ముఖ్యం. అప్పుడే విశ్వసనీయమైన, దోషరహితమైన వాస్తవాలు ప్రజలకు అందుతాయి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. జర్నలిస్టులకు జీతాలివ్వాలి. మౌలికసదుపాయాల మీద వెచ్చించాలి. ఇదంతా ఒక వంతయితే, ఆ వార్తల పంపిణీ మరో వంతు. ముద్రణ అవసరం లేని డిజిటల్ మాధ్యమంలో వార్తాంశాల పంపిణీని వ్యాపారంగా మార్చుకున్న సంస్థలు గుత్తాధిపత్యం చాటుకుంటూ అపారమైన లాభాలు సొంతం చేసుకోవటంతో డిజిటల్ మాధ్యమాల మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది.
భారతదేశంలో దశాబ్దాల తరబడి ప్రతిష్ఠ కూడగట్టుకున్న మీడియా సంస్థలు అస్థిరమైన వ్యాపార నమూనామీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ధోరణికి తగినట్టు డిజిటల్ వైపు మళ్ళటం ద్వారా ముద్రిత పత్రికల నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కొంతలో కొంత ఆదాయం సమకూర్చుకుంటున్న డిజిటల్ వనరు వల్లనే ఆ పత్రికలు ఇంకా మనగలుగుతున్నాయి. అయితే, వాస్తవంగా అందాల్సిన ఆదాయం డిజిటల్ మాధ్యమాలకు అందటం లేదన్న అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఇంటర్నెట్ లో వార్తల పంపిణీ ట్రాఫిక్ లో 80% ఆధిపత్యం గూగుల్, ఫేస్ బుక్ సొంతం చేసుకున్నాయి. అంటే, వాటి ద్వారా దాదాపు 80% మంది పాఠకులు డిజిటల్ వార్తావేదికలను చేరుతున్నారు. నిజానికి అత్యధికభాగం వెబ్ సైట్లు తమ వెబ్ సైట్ లో గూగుల్ సెర్చ్ ని జోడిస్తున్నాయే తప్ప సొంత వెబ్ సైట్ లో సెర్చ్ మీద దృష్టి పెట్టటం లేదు.
దీన్ని గూగుల్, ఫేస్ బుక్ అవకాశంగా వాడుకున్నాయి. కేవలందారి చూపినందుకు పెద్దమొత్తంలో లాభాలు గడిస్తూ వచ్చాయి. డిజిటల్ న్యూస్ మీడియా పరిస్థితి బాగా దిగజారుతూ వచ్చింది. ఒకవైపు వార్తాసేకరణ వ్యయం పెరుగుతూ ఉండటం, మరోవైపు తగినంత ఆదాయం లేకపోవటం డిజిటల్ వార్తామాధ్యమాలకు పెనుసవాలుగా తయారైంది. పాఠకులను రప్పించటానికి దళారీ పాత్ర పోషిస్తున్న సంస్థల ఆదాయానికీ, వార్తల వేదికల ఆదాయానికీ ఏ మాత్రం పొంతన లేకపోవటమే ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తున్న అంశం. రాబడిలో ఎవరి పాత్ర ఎంత, అది పంచుకోవటంలో ఎవరి వాటా ఎంత అని గమనిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బైటపడుతున్నాయి.
ఏడాదిన్నరగా ఆస్ట్రేలియా ఈ విషయాన్ని శోధించటం మొదలుపెట్టింది. వార్తాంశాల పంపిణీ పేరుతో గూగుల్, ఫేస్ బుక్ చేస్తున్న వ్యాపారపు పర్యవసానాన్ని ఆస్త్రేలియాలోని కాంపిటిషన్ అండ్ కన్స్యూమర్స్ కమిషన్ అధ్యయనం చేసింది. అవి సంపాదిస్తున్న లాభాలు సంప్రదాయ మీడియా ఉనికినే దెబ్బతీసే విధంగా ఉన్నట్టు గుర్తించింది. ఆస్ట్రేలియాలోని ప్రతి 100 డాలర్ల డిజిటల్ ప్రకటనల ఆదాయంలో గూగుల్ కి 53 డాలర్లు, ఫేస్ బుక్ కి 28 డాలర్లు పోతుంటే, వార్తలు తయారుచేసే వేదికలకు వచ్చే ఆదాయం కేవలం 19 డాలర్లు. ఉత్పత్తిదారుకంటే దాని అమ్మకానికి దారిచూపించే దళారికి ఇంత పెద్దమొత్తం వెళ్ళటం అసలు సమస్య. ఎంతమాత్రమూ పారదర్శకత లేకుండా ఈ టెక్నాలజీ కంపెనీలు దోచుకుంటున్న తీరుకు అడ్డుకట్టవేయటానికి చట్టం తీసుకురావటం తప్పనిసరి అని ఆస్ట్రేలియా భావించింది.
అయితే, ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయానికి ఈ టెక్ కంపెనీలు స్పందించిన తీరు విచిత్రంగా ఉంది. ఫేస్ బుక్ అయితే దాని భాషలోనే చెప్పాలంటే ఆస్ట్రేలియాను ’అన్ ఫ్రెండ్’ చేసి ఏకంగా యుద్ధం ప్రకటించినంత పనిచేసింది. ఆస్ట్రేలియాలో ఫేస్ బుక్ వార్తల బ్లాకౌట్ ప్రకటించటమనే సాహసోపేతమైన నిర్ణయం ద్వారా ప్రపంచమంతటా రాజకీయ నాయకుల ఆలోచనాధోరణిలో మార్పు తీసుకురాగలనని జుకర్ బర్గ్ ఆలోచించాడు. కేవలం మీడియా సంస్థలకే పరిమితం కాకుండా ప్రభుత్వం అందించే ఆరోగ్య, వాతావరణ, ఫైర్, అంబులెన్స్ వంటి అత్యవసరసేవల సమాచారాన్ని, చివరికి కోవిడ్ సమాచారాన్ని కూడా నిలిపివేయటం ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావటానికి దారితీసింది. పైగా “ ఏది న్యూస్ అనే విషయంలో చట్టం స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోవటం వలన స్థూలంగా ఆలోచించి చట్టాన్ని గౌరవించే ఉద్దేశ్యంతో వీటన్నిటినీ న్యూస్ గా పరిగణించాం” అంటూ ఫేస్ బుక్ తన అతి తెలివిని ప్రదర్శించింది.
అయితే, ఇది కచ్చితంగా ఫేస్ బుక్ తన గుత్తాధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నమేనని అందరికీ స్పష్టంగా అర్థమైంది. గతంలో బ్రిటన్ లో “ఇలా అయితే ఇంకెక్కడైనా పెట్టుబడి పెడతాం” అంటూ బెదరించటానికి ప్రయత్నించి విఫలమైంది. అ తరువాత ప్రభుత్వంతో సర్దుకుపోయింది. అయితే, ఇప్పుడు మరీ దూకుడుగా ఆస్ట్రేలియాలో వ్యవహరించిన తీరుతో ఇలా ఎన్ని మార్కెట్లనుంచి తప్పుకోవటానికి సిద్ధమవుతావంటూ యావత్ ప్రపంచం ఫేస్ బుక్ ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. “నా కోడి లేకపోతే ఈ ఊరికి ఎలా తెల్లవారుతుందో చూస్తా”నని బెదిరించినవాడి సామెతలా ఫేస్ బుక్ మొదట భేషజానికి పోయినా చివరికి మళ్లీ బేరసారాలకు సిద్ధం కాక తప్పలేదు. ఎనిమిదిరోజుల ప్రతిష్ఠంభన తరువాత మళ్ళీ న్యూస్ అందించటంతోబాటు ప్రాథమిక వాణిజ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టింది.
ఒక ప్రజాస్వామ్య దేశం మీద ఇలా దాడికి పూనుకోవటం వలన ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురుకావచ్చునని ఫేస్ బుక్ గ్రహించకపోవటం ఒక వ్యూహాత్మక తప్పిదం. ప్రభుత్వాల నియమనిబంధనలు తమకు వర్తించబోవని, ప్రభుత్వాలకంటే తామే పెద్దవాళ్లమని అనుకునే ఈ బడా టెక్ కంపెనీల గురించి ఆస్ట్రేలియా ప్రధాని వ్యాఖ్యానిస్తూ “ అవి ప్రపంచాన్ని మార్చవచ్చునేమో గాని అవే ప్రపంచాన్ని నడుపుతున్నాయకోవటం అర్థరహితం” అన్నారు. ప్రజాస్వామ్యానికి బలమైన మీడియా అవసరమని, అలాంటి మీడియాకు ఆర్థిక పరిపుష్టి చేకూరటానికి కచ్చితంగా వాటికి దక్కాల్సినవాటా దక్కాల్సిందేనని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది.
గూగుల్ స్పందన కూడా ఫేస్ బుక్ తరహాలోనే ఉన్నప్పటికీ, తన ఆలోచనను చాలా వేగంగా మార్చుకుంది. ఆస్ట్రేలియా ఈ చట్టం చేసే పక్షంలో తన సెర్చ్ ఇంజన్ ను తొలగిస్తానని గూగుల్ హెచ్చరించింది. కానీ ఇప్పుడు మర్దోక్ సంస్థ ’న్యూస్ కార్ప్’ వారి న్యూస్ కంటెంట్ కు డబ్బు చెల్లించటానికి ఒప్పందం చేసుకుంది. ప్రకటనల ఆదాయం పంచుకోవటంతోబాటు వీడియో జర్నలిజంలొ పెట్టుబడి పెట్టటానికి కూడా గూగుల్ సిద్ధమైంది. ఇంకా అనేక మీడియా సంస్థలతో ఒప్పందాలు జరగబోతున్నట్టు కూడా ప్రకటించింది. అయితే, సెనేట్ ఆమోదం కూడా పొంది చట్ట రూపం సంతరించుకున్న తరువాత గూగుల్ ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా రూపొందించిన నియమావళిని అక్కడి దిగువ సభ ఆమోదించింది. సెనేట్ కూడా ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. దాన్ని ఏడాది తరువాత మాత్రమే సమీక్షించవచ్చు. ఈ కొత్త చట్టం ప్రకారం గూగుల్ స్థానిక మీడియా సంస్థల కంటెంట్ ను తన వేదికమీద వాడుకుంటున్నందుకు వాటికి డబ్బు చెల్లించాలి. ఆయా మీడియా సంస్థలతో బేరసారాలు ఒక కొలిక్కిరాని పక్షంలో ప్రభుత్వం నియమించిన మధ్యవర్తి గూగుల్, ఫేస్ బుక్ చెల్లించాల్సిన మొత్తాలను నిర్ణయిస్తారు. అయితే, ఈ పద్ధతిలో పెద్ద మీడియా సంస్థలు మాత్రమే లాభపడతాయని, చిన్న సంస్థలు బాగా దెబ్బతింటాయని అంచనా వేస్తున్నవారూ కూడా ఉన్నారు. అందువలన సమీక్ష కోసం ఉన్న ఏడాది గడువు తరువాత మాత్రమే ఆస్ట్రేలియా మరింత పకడ్బందీగా నియమాలు సవరించే అవకాశముంది. ప్రస్తుతం ఇది గూగుల్, ఫేస్ బుక్ కు మాత్రమే పరిమితమైనా, ముందు ముందు మరిన్ని వేదికలకు విస్తరిస్తుందని కూడా ఆస్ట్రేలియా స్పష్టంగా చెప్పింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఫేస్ బుక్ తీసుకున్న రిస్క్ కు కొంత లెక్క ఉందని కూడా విశ్లేషిస్తున్నవారున్నారు. ఇటీవల ఫేస్ బుక్ అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందజేసిన నివేదికలో తన భయాలను, సమస్యలను వెల్లడించింది.” యూరోపియన్ యూనియన్, అమెరికాతోబాటు మరికొన్ని దేశాలలో ఆంక్షలు విధించటానికి చట్టాలు రూపొందుతున్నాయి. అవి మా వ్యాపార అవకాశాలను దెబ్బతీయవచ్చు. కాపీ రైట్ ఉల్లంఘన, డేటా పరిరక్షణ, డేటా స్టొరేజ్ తమదేశాల్లోనే ఉండాలని కోరటం లాంటివి ఆర్థిక భారంగా మారవచ్చు” అని పేర్కొనటం ద్వారా సూత్రప్రాయంగానైనా తనకు ఎదురయ్యే పరిస్థితులగురించి అవగాహన ఉంది. అందువలన ఆస్ట్రేలియా చూపిన బాటలో మరిన్ని దేశాలు నడుస్తాయని ఫేస్ బుక్ కి ఈ పాటికి పూర్తిగా అర్థమై ఉంటుంది.
రెండో అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన భారతదేశం ఈ విషయంలో ముందుగా చొరవ తీసుకొని ఉండాల్సింది అనే అభిప్రాయం కూడా ఉంది. ఏమైతేనేం, ఆస్ట్రేలియా ముందడుగు వేసింది. ప్రజాస్వామ్యదేశాలన్నిటికీ ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ పిలుపునిస్తూ వార్తలమీద గూగుల్, ఫేస్ బుక్ అర్జించే లాభాల్లో వాటా కోసం వత్తిడి చేయాలని కోరారు. ఫ్రాన్స్ సారధ్యంలో యూరోపియన్ దేశాలు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అమెరికాలో కూడా సమాలోచనలు ఊపందుకున్నాయి. ఇప్పుడు దృష్టి సారించాల్సింది భారతదేశమే. ప్రజాస్వామ్యానికి అండగా ఉండాల్సిన స్వదేశీ వార్తాసంస్థల మనుగడ ఇప్పుడు చాలా ముఖ్యం. బహుళజాతి టెక్ కంపెనీల ద్వారా వచ్చే పన్నులకంటే స్వదేశీ మీడియా కంపెనీల నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువన్న సంగతి కూడా ప్రభుత్వం గ్రహించాలి. ఆస్ట్రేలియా కంటే పకడ్బందీగా చట్టం చేయగలిగే అవకాశాన్ని వాడుకోవాలి.
-తోట భావనారాయణ
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here