కొత్త టారిఫ్ ఆర్డర్ మీద స్టే ఇవ్వని సుప్రీం కోర్టు; 18న విచారణ

0
542

ట్రాయ్ ప్రతిపాదించిన కొత్త టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 2.0 అమలు మీద స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈనెల 12 న కొత్త రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్ల మీద సంతకాలు చేసి కొత్త టారిఫ్ అమలు చేయాల్సి ఉండగా అభ్యంతరం తెలియజేస్తూ బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. వారం సమయం కూడా లేకపోవటంతో బ్రాడ్ కాసటర్లు హడావిడిగా తమ పే చానల్స్ రేట్లు నిర్ణయించి నిబంధనలకు అనుగుణంగా బొకే ధరలు కూడా వెల్లడించాల్సి రావటం కత్తిమీద సాము లా తయారవుతుంది.
ఈ ఏడాది జనవరి 1 న ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకటించగా బ్రాడ్ కాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొంబాయ్ హై కోర్టుకు వెళ్ళారు. కానీ అక్కడ చుక్కెదురైంది. బొకే ధరల విషయంలో విధించిన జంట షరతులలో ఒకటి తప్ప అన్నిటినీ కోర్టు ఆమోదించింది. అయితే, ఇది తమ వ్యాపార హక్కును కాలరాయటమే అని బ్రాడ్ కాస్టర్లు చేసిన వాదనతో బొంబాయ్ హైకోర్టు ఏకీభవించలేదు. ట్రాయ్ చెప్పిన మిగతా నిబంధనల ప్రకారం అమలుకు ఆరువారాల సమయం ఇచ్చింది.
దీంతో బొంబాయ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బ్రాడ్ కాస్టర్ల సంఘం సహాయ మొత్తం 9 పిటిషన్లు దాఖలు కాగా ఈ రోజు విచారణకు స్వీకరించారు. అయితే ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లు 51 వాల్యూమ్స్ ఉన్నాయని, వాటిని లారీలో తీసుకురావాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. అవి చదవటానికి సమయం ఉండదు గనుక చదవరనే అభిప్రాయంతో ఇలా చేయటం తగదన్నారు. స్టే ఇవ్వటానికి నిరాకరిస్తూ, కేసును 18 వ తేదీకి వాయిదా వేశారు. అదే విధంగా ఈ డాక్యుమెంట్లు సాధ్యమైనంత సంక్షిప్తంగా ఉండాలని కూడా సూచించారు.
సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవటం వలన బ్రాడ్ కాస్టర్లు ఇప్పుడు తప్పనిసరిగా ఈనెల 12 నాటికి కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం తమ పే చానల్స్ ధరలు ప్రకటించాలి. అ లా కారటే ధరలు, బొకే ధరలు విడివిడిగా ట్రా రెండో టారఫ్ ఆర్డర్ కు అనుగుణంగా తయారుచేయాలి. కొత్తగా మళ్ళీ పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. అదే సమయంలో పంపిణీ సంస్థలు కూడా చందాదారులు కోరుకునే పాకేజ్ లు తయారుచేసి అందించాలి. అందువలన ఈ వారం రోజులు హడావిడి తప్పదు.
మొత్తంగా చూస్తే ట్రాయ్ ఆలోచనకు అనుగుణంగా నిజంగా ధరలు తగ్గుతాయా, లేదా బొకే లో పెట్టకుండా ప్రధాన చానల్స్ కు అలా కార్టే ధరలు పెంచుకొని బ్రాడ్ కాస్టర్లు తమ మిగతా చానల్స్ ను దెబ్బతీసుకుంటారా లేదా తెలివితేటలు ప్రదర్శించి ఆదాయం తగ్గకుండా చందాదారు ఎంపికను ప్రభావితం చేస్తారా అనేది ఈ వారంలో తేలిపోతుంది. దీన్నిబట్టి ట్రాయ్ లక్ష్యం నెరవేరిందీ లేనిదీ స్పష్టమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here