బ్రాడ్ కాస్టర్లమీద కేబుల్ ఆపరేటర్ల ఫిర్యాదు: నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు

0
980

ఐదు ప్రధానమైన టీవీ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖవారి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నా యంటూ రెండు కేబుల్ ఆపరేటర్ల సంఘాలు నేరుగా మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశాయి. హోంమంత్రిత్వశాఖ ఆమోదం పొందకుండానే ఆ బ్రాడ్ కాస్టర్లు ప్రసారాలను అక్రమంగా పంపిణీచేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో ఆరోపించాయి.
కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సమాఖ్య (ఇండియా), మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల ఫౌండేషన్ సొసైటీ ఈ మేరకు మంత్రిత్వశాఖకు తమ న్యాయవాదుల ద్వారా ఫిర్యాదు లేఖ పంపాయి. ఆ ఫిర్యాదులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సంస్థలలో స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, వయాకామ్ 18, వార్నర్ మీడియా ఇండియా ఉన్నాయి.
ఈ బ్రాడ్ కాస్టర్లు కేబుల్ టీవీ నెట్వర్క్స్ చట్టం (1995) లోని నిబంధనలను ఉల్లంఘించారని, టీవీ చానల్స్ పాటించాల్సిన డౌన్ లింకింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి ఎమ్మెస్వో/ఆపరేటర్ లైసెన్స్ లేకుండానే నేరుగా చందాదారుకే ప్రసారాలు అందిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఖరి వినియోగదారునికి చానల్ ప్రసారాలు అందజేయటమన్నది కేబుల్ టీవీ చట్టానికి అనుగుణంగా మాత్రమే జరగాల్సి ఉంది. అంటే డాస్ లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే జరగాలని వారు వాదించారు.
అయితే, ఈ బ్రాడ్ కాస్టర్లు ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండా తమ చానల్స్ ను సొంత ఓటీటీ వేదికల ద్వారా అక్రమంగా నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారని కేబుల్ ఆపరేటర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. జీ గ్రూప్ వారి జీ 5 ను, సోనీ వారి సోనీ లివ్ ను, స్టార్ ఇండియా వారి డిస్నీహాట్ స్టార్ ను, వయాకామ్18 వారి వూట్ ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“అదే సమయంలో ఈ బ్రాడ్ కాస్టర్లు చీటికీ మాటికీ పంపిణీ సంస్థలకు తమ పే చానల్స్ ధరలు పెంచుతూ చివరికి చందాదారుల మీద భారం మోపుతున్నారు. కానీ వారి ఓటీటీ ల చందాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి.” అని మంత్రిత్వశాఖ దృష్టికి తెచ్చారు. ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండా టారిఫ్ ఆర్డర్ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ఈ బ్రాడ్ కాస్టర్లు అందిస్తున్న చానల్స్ కు ఎమ్మెస్వోల ద్వారా కేబుల్ చందాదారులకు ఇస్తున్న ధరలు , ఓటీటీ వేదిక మీద ధరలు ప్రస్తావిస్తూ పోల్చి చెప్పిన జాబితా కూడా జాతచేశారు.
2017 నాటి టెలికమ్యూనికేషన్ ( బ్రాడ్ కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్ ఇంటర్ కనెక్షన్ ( అడ్రెసిబుల్ సిస్టమ్స్) రెగ్యులేషన్ ప్రకారం టీవీ చానల్స్ పంపిణీదారు నిర్వచనంలో ఎమ్మెస్వో, డీటీహెచ్ ఆపరేటర్, హిట్స్ ఆపరేటర్, ఐపీటీవీ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. బ్రాడ్ కాస్టర్ నేరుగా పంపిణీ చేయటమన్నది చట్టవిరుద్ధం. ఇదే విషయాన్ని కేబుల్ ఆపరేటర్ సంఘాలు ప్రస్తావించాయి.
పోటీపడేందుకు సమాన అవకాశాలు లేకపోవటం వలన కేబుల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నదని, ఈ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలు చట్టాన్ని అతిక్రమించి మరీ దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ధరలో తేడా కారణంగా తమ చందారులు పెద్ద సంఖ్యలో ఇదే బ్రాడ్ కాస్టర్ల ఓటీటీ లకి తరలిపోయారని మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఒకే ప్రసారాలను వేరు వేరు ధరలకు ఇవ్వటం ద్వారా టారిఫ్ ఆర్డర్ నియమాలను కూడా ఉల్లంఘించారని చెప్పారు. అదే లోగో తో చానల్ ప్రసారాలు అందిస్తున్న సంగతి గుర్తు చేశారు.
ఒకవైపు ఎమ్మెస్వోలు/కేబుల్ ఆపరేటర్లు టారిఫ్ ఆర్డర్ ప్రకారమే చందాదారులకు పే చానల్స్ అందిస్తుండగా అవే చానల్స్ ను బ్రాడ్ కాస్టర్లు బాగా తగ్గించి ఓటీటీల ద్వారా తగ్గింపు ధరకు ఇచ్చి చందాదారులను లాక్కోవటం దారుణమన్నారు. చౌక ధరతోబాటు ఆ ప్రసారాలు ఎప్పుడైనా, ఎక్కడైనా చూసుకునే వెసులుబాటు కల్పించటం, ఒక వార్షిక చందాతో ఒకటికంటే ఎక్కువ పరికరాలమీద చూసుకునే వీలు ఇవ్వటం కూడా కేబుల్ రంగాన్ని దెబ్బతీసినట్టు ఆ ఫిర్యాదులో చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ఈ బ్రాడ్ కాస్టర్ల చట్ట ఉల్లంఘనను గుర్తించి తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ రెండు కేబుల్ ఆపరేటర్ల సంఘాలూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here