తగ్గిన డీటీహెచ్ చందాదారులు

0
840

వాడకం కొనసాగిస్తున్న డీటీహెచ్ చందాదారుల సంఖ్య తగ్గింది. వివిధ డీటీహెచ్ సంస్థలు ట్రాయ్ కి సమర్పించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది జనవరి-మారకి మధ్య త్రైమాసికానికి ఈ విధమైన తగ్గుదల నమోదైంది. నిరుడు అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 7 కోట్ల 9 లక్షల 90 వేల కనెక్షన్లు ఉండగా ఆ తరువాత మూడు నెలల కాలంలో ఆ సంఖ్య 6 కోట్ల 95 లక్షల 70 వేలకు పడిపోయింది. అంటే, 14 లక్షల 20 వేల కనెక్షన్లు తగ్గాయి. ఈ లెక్కలో ప్రసారభారతి ఆధ్వర్యంలో నడిచే ఉచిత డీటీహెచ్ డీడీ ఫ్రీ డిష్ చందాదారులను చేర్చలేదు. మొత్తం నాలుగు ప్రధాన డీటీహెచ్ ఆపరేటర్లలో టాటా స్కై (33.3 శాతం), డిష్ టీవీ ఇండియా (24.09 శాతం), భారతి టెలీమీడియా (25.54 శాతం), సన్ డైరెక్ట్ టీవీ (17.07 శాతం ) వాటా కొనసాగిస్తున్నట్టు కూడా ట్రాయ్ సమాచారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ 901 ఉండగా అందులో 327 పే చానల్స్. మిగిలినవి ఫ్రీ టు ఎయిర్ (ఉచిత) చానల్స్. పే చానల్స్ లో 235 స్టాండర్డ్ డెఫినిషన్ ( ఎస్ డి) చానల్స్ కాగా 92 హి డెఫినిషన్ ( హెచ్ డి ) చానల్స్. సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర అనుమతి పొందిన ఎమ్మెస్వోల సంఖ్య 1726 కాగా అందులో 12 ఎమ్మెస్వోలు, ఒక హిట్స్ ఆపరేటర్ మాత్రమే పది లక్షలకు మించిన చందాదారులతో కొనసాగుతున్నారు. అందరికంటే ఎక్కువగా సిటీ నెట్ వర్క్స్ 82 లక్షల చందాదారులతో ఉండగా ఆ తరువాత స్థానంలో ఉన్న జీటీపీఎల్ హాత్ వే కు 77 లక్షలమంది చందాదారులున్నారు. హాత్ వే డిజిటల్ లో 56 లక్షలమంది, డెన్ నెట్ వర్క్స్ లో 45 లక్షల మంది, తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్ లో 35 లక్షల మంది, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లో 30 లక్షల 50 వేలమంది, తమిళనాడు అరసు కేబుల్ లో 29 లక్షలమంది, ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్ లో 22 లక్షలమంది, ఎన్ ఎక్స్ టి డిజిటల్ (హిట్స్) లో 20 లక్షల 50 వేల మంది, కల్ కేబుల్ లో 20 లక్షల 20 వేలమంది. వికె డిజిటల్ లో 17 లక్షలమంది, ఏషియానెట్ డిజిటల్ నెట్ వర్క్స్ లో 12 లక్షలమంది, ఎన్ ఎక్స్ టి డిజిటల్ కేబుల్ టీవీలో 11 లక్షలమంది చందాదారులున్నారు. అంటే 10 లక్షల చందాదారులకంటే ఎక్కువ ఉన్న ఎమ్మెస్వోల చందాదారులందరి సంఖ్యా కలిసినా సుమారు 4.5 కోట్లు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 105 నగరాలలో 366 ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియో చానల్స్ ఉండగా ఎఫ్ ఎం బ్రాడ్ కాస్టింగ్ సంస్థల సంఖ్య 30. ఒడిశా టెలివిజన్ లిమిటెడ్ వారికి రూర్కెలా లో ఉన్న ఏకైక ఎఫ్ ఎం స్టేషన్ మూతబడింది. ఎఫ్ ఎం రేడియోలా ప్రకటనల ఆదాయం అంతకుముందు త్రైమాసికంలో రూ. 323.01 కోట్లు ఉండగా తాజా త్రైమాసికంలో అది రూ. 321.52 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా అంతకుముందు త్రైమాసికంలో 315 కమ్యూనిటీ రేడియోలు పనిచేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 324 కు పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here