కేబుల్ ఆపరేటర్ల మీద చర్యలకు కర్నాటక హైకోర్టు ఆదేశం

0
1265

విద్యుత్ స్తంభాలకు వేలాడేలా అడ్డదిడ్డంగా కేబుల్స్ వేసిన కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లమీద చర్యలు తీసుకోవాలని కర్నాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బెంగళూరు నగరపాలకసంస్థను ఆదేశించింది. దేశమంతటా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమయ్యాయని, ఈ పరిస్థితిలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టం చెయ్యాలని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రశ్నించింది.
ఎన్ పి అమృతేష్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది, అక్రమంగా కేబుల్స్ వేలాడదీస్తూ విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న ఈ కేబుల్ వైర్ల వలన ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నదని పిటిషనర్ వాదించారు. బెంగళూరు నగరపాలక సంస్థ అనుమతి లేకుండా కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కేబుల్స్ వేసే అవకాశమే లేదని, అలాంటప్పుడు ప్రమాదకరమైన విధంగా కేబుల్స్ వేసి వీధుల్లో నడవటమే కష్ట సాధ్యమయ్యేట్టు ఎలా చేస్తారని నగరపాలక సంస్థను కోర్టు ప్రశ్నించింది.
కేబుల్ టీవీ చట్టం (1995) ప్రకారం కేబుల్ ఆపరేటర్లు నగరపాలక సంస్థ అనుమతితో కేబుల్ వేసుకునే అవకాశం ఉందని, అయితే ప్రజలకు ఇబ్బమ్దికరంగా ఉన్నప్పుడు ఆ కేబుల్ ను తొలగించాలనో, చోటు మార్చాలనో చెప్పే అధికారం నగరపాలక సంస్థకు ఉందన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్, న్యాయమూర్తి ఎస్ ఎస్ మగదుమ్ తో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, కేబుల్ ఆపరేటర్ల హక్కుకంటే ప్రజల ప్రాథమిక హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. అందుకే చట్టప్రకారం అలాంటి ప్రమాదకరంగా ఉన్న కేబుల్స్ ను వెంటనే తొలగించాలని సూచిస్తూ కేసును మార్చి 19కి వాయిదా వేసింది.
గత కొద్ది సంవత్సరాలలో బెంగళూరు నగరంలో 400 మందికి పైగా విద్యుత్ షాక్ తో చనిపోయారు. అయినప్పటికీ కేబుల్స్ వేయటాన్ని అడ్దుకోకపోవటం, హై టెన్షన్ వైర్ల కింద ఇళ్లు కట్టుకోవటానికి అనుమతించటం లాంటి నగరపాలక సంస్థ తప్పులని పిటిష్జనర్ ప్రస్తావించారు. ఇలాంటి కేబుల్స్ వలన బెంగళూరులోనే కాక అనేక నగరాలలో సమస్యలు తలెత్తుతున్నాయి. పాదచారుల నడకకు కూడా ఇబ్బంది కలుగుతోంది. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల లాంటి అత్యవసర సేవలకు కూడా ఇవి అవరోధంగా మారుతున్నాయి.
జనవరిలో ఢిల్లీ హైకోర్టు కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందించింది. చాందినీ చౌక్ ప్రాంతంలో ఇబ్బందికరంగా మారిన కేబుల్ వైర్లను తొలగించాలని మహానగర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్ ను, బి ఎస్ ఇ ఎస్ ను, ఢిల్లీ నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదేశించటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here