మేకిన్ ఇండియా సెట్ టాప్ బాక్సులకు సవాళ్ళు

0
750

నిరుడు టాటా స్కై, డిష్ టీవీ లాంటి పెద్ద డిటిహెచ్ సంస్థలు సెట్ టాప్ బాక్సుల తయారీని భారత్ కు బదలాయించి మేకిన్ ఇండియాకు అండగా నిలబడతామని ప్రకటించినప్పుడు ఆ వార్త పతాక శీర్షికలకెక్కింది. నిజానికి ప్రభుత్వం మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలని అనుకున్నప్పుడు అందుకు అనుగుణంగా డిటిహెచ్ ఆపరేటర్లు ఈ నిర్ణయం ప్రకటించటం గమనార్హం. కానీ ఆచరణలోకి తీసుకురావటంలో ఎదురైన ఇబ్బందులతో తయారీదారులు ఇరకాటంలో పడ్డారు. కేవలం దిగుమతి చేసుకున్న విడిభాగాలను భారత్ అసెంబుల్ చేయటానికే పరిమితం కావాల్సి వచ్చింది.
రెండేళ్ళుగా భారత్ లో సెట్ టాప్ బాక్సుల తయారీ మీద తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. 2020 లో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ మేకిన్ ఇందియా నినాదంలో భాగస్వామి కావాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ( ఎంఐబి) ని కోరింది. ఆ క్రమంలోనే డిటిహెచ్ ఆపరేటర్లతోబాటు సెట్ టాప్ బాక్సుల తయారీదారులతో ఒక సమావేశం జరిపి మొత్తం పరిస్థితిని మదింపు చేయవలసిందిగా సూచించింది. సెట్ టాప్ బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి అది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది. కానీ వాటిని కొనేవాళ్లను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నియంత్రిస్తుంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇంకోవైపు ఎంఐబి మాత్రం మేకిన్ ఇండియా అంటే పూర్తిగా ఇండియన్ డిజైన్ తో తయారు చేయాలి తప్ప విడి భాగాలు తెచ్చి అసెంబుల్ చేస్తే కుదరదని చెబుతూ వస్తోంది.
ఎన్ ఎక్స్ టి డిజిటల్ మాత్రం డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా నడుచుకుంటున్నదని ఆ సంస్థ ఎండీ, సీఈవో విన్ స్లే ఫెర్నాండెజ్ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఫుట్ ప్రింట్ ఉన్న తమ సంస్థ గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుకుపోయిందని, ఆవిధంగా డిజిటల్ వైపు నడిపిస్తున్నామని అంటున్నారు. తమ కేబుల్ ఆపరేటర్ ఆవరణలోని పరికరాలు (కోప్) అధికభాగం స్వదేశీ తయారీ కాబట్టి తమ మేకిన్ ఇండియా ధోరణికి అద్దం పడుతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. సెట్ టాప్ బాక్సుల తయారీని కూడా సాధ్యమైనంతగా భారత్ కు తరలించామన్నారు. అయితే అందులో ఎక్కువభాగం విదేశాలనుంచి తెప్పించుకు రావాల్సిన పరిస్థితే అసలైన సవాలుగా అభివర్ణించారు.
ఈ ఏడాది ఆరంభంలో ప్రచురించిన ముసాయిదా జాతీయ ప్రసార విధానం ( నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ పాలసీ) కూడా సెట్ టాప్ బాక్సులతో సహా వినియోగదారు ఆవరణలో ఉండే పరికరాలన్నీ స్వదేశీ తయారీ అయి ఉండేలా ప్రోత్సహించాలని పేర్కొంది. ప్రస్తుతం వాటికోసం పెద్దఎత్తున దిగుమతులమీద ఆధారపడుతున్నామని, దీనికోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( బిఐఎస్) సంస్థ కొన్ని ప్రమాణాలు నిర్దేశించాలని, ఆ ప్రమాణాలకు అనుగుణంగా సెట్ టాప్ బాక్సులు తయారు కావాలని భావించారు. దిగుమతి ధరలు ప్రకటించటం ద్వారా స్వదేశీ తయారీదారులను ప్రోత్సహించాలన్నది కూడా అందులో భాగం.
సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ రెండు మూడేళ్ళుగా ఈ కోణంలో భారత తయారీదారులను ప్రోత్సహిస్తున్నదని, అయితే, చిప్ సెట్స్ లాంటివి దిగుమతి చేసుకోవాల్సి రావటం లాంటి సమస్యలు కొనసాగుతున్నాయని జిటిపిఎల్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పీయూష్ పంకజ్ వ్యాఖ్యానించారు. స్వదేశీ తయారీదారులు సొంత డిజైనింగ్ మీద దృష్టిపెట్టినా దానికి చాలా సమయం పడుతుందంటున్నారు. పైగా ఇక్కడి డిటిహెచ్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు ప్రోత్సహించినప్పుడే తయారీ సాధ్యమవుతుందని, కనీసం ట్రయల్ పద్ధతిలోనైనా ఆర్డర్లు ఇవ్వాలని మైబాక్స్ టెక్నాలజీస్ ఎండీ, సీఈవో అమిత్ ఖర్బందా కోరుతున్నారు.
మరోవైపు ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్ల వాదన మరోలా ఉంది. టెక్నాలజీ ఏ దేశానిది, తయారీ ఎక్కడ అనే విషయాలు తెలుసుకొని ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు విచారించి కొనటం ఆచరణలో సాధ్యమయ్యే పనికాదని, భారత్ లో రిజిస్టర్ అయిన కంపెనీకి పన్నులు కట్టు తీసుకోవటం వరకే తమ బాధ్యత అని అంటున్నారు. అందువలన భారత్ లోనే కొంటున్నామన్నది ఒక్కటే ముఖ్యమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here