కేబుల్ ఆపరేటర్ల ఆదాయం పెంచే “జస్ట్ లోకల్”

0
1092

కేబుల్ చందాదారులకు సేవలందిస్తూ కేబుల్ వ్యాపారంలో ఉన్న స్థానిక కేబుల్ ఆపరేటర్లు లాభాలు ఆర్జించే అవకాశం కల్పించే జస్ట్ లోకల్ అనే యాప్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆవిష్కరణకు సిద్ధమైంది. కేబుల్ వ్యాపారంలో దాదాపు 30 ఏళ్ల అనుభవమున్న శ్రీ శివశంకర్ దీనికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విషయమై ఈ రోజు బ్రైట్ వే ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి తో సమావేశమై ఆయన సహకారం కోరారు. కేబుల్ రంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ చేపట్టినందుకు శ్రీ సుభాష్ రెడ్డి ఆయనను అభినందిస్తూ, తన వంతు సహకారం ఉంటుందని హామీ యిచ్చారు.
1992 లో కేబుల్ టీవీ ఆపరేటర్ గా ప్రస్థానం ప్రారంభించిన శ్రీ శివశంకర్ 1995 లో సిటీ కేబుల్ జాయింట్ వెంచర్ భాగస్వామిగా మారారు. అలా 12 ఏళ్లపాటు కొనసాగిన తరువాత సొంతగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నెలకొల్పారు. డిజిటైజేషన్ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల ఆదాయం పడిపోవటం గమనించిన శ్రీ శివశంకర్ కేబుల్ ఆపరేటర్లు తమ బలాన్ని ఉపయోగించుకొని ఆదనపు ఆదాయం పొందగలిగే మార్గానికి మెరుగులు దిద్దారు.
అనేక కార్పొరేట్ సంస్థలు కిరాణా వ్యాపారంలో ప్రవేశించి లాభాలు పొందుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో బలమున్న కేబుల్ వ్యవస్థ ఇందులో భాగస్వామి కావటం సమంజసమన్నది శ్రీ శివశంకర్ అభిప్రాయం. అందుకే జస్ట్ లోకల్ పేరుతో ఒక మొబైల్ యాప్ కు శ్రీకారం చుట్టారు. కేబుల్ ఆపరేటర్ ద్వారా అనేక వస్తువులు పంపిణీ చేయటం వలన కస్టమర్లకు తాజా సరకు అందటం, ఆపరేటర్ లాభాలు పొందటం ఏకకాలంలో జరుగుతాయని చెబుతున్నారు.
ఆపరేటర్లు తమ కస్టమర్లకు ఇలాంటి అదనపు సేవలు అందించటం ద్వారా వారిని కాపాడుకోవటానికి వీలవుతుందని, మెరుగైన సేవలు అందించి లాభాలు సంపాదించుకోవటానికి కూడా ఇది దోహదపడుతుందన్నారు. ఇప్పటికే రకరకాల పంటలకు పేరుమోసిన చోట్ల రైతులతో ఒప్పందాలు చేసుకోవటం పూర్తయిందని చెబుతూ వాటిని గ్రేడింగ్, పాకేజింగ్ పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు.
త్వరలో అఖిలభారత స్థాయిలో ఆవిష్కరించబోతున్న ఈ యాప్ లో ఆపరేటర్ నమోదు కావటానికి వీలున్నదని, దీనికి ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదని చెప్పారు. తాము పెద్ద మొత్తంలో నేరుగా తయారీ దారులనుంచి కొనటం వలన తక్కువ ధరకే అందించటానికి, ఇందులో పాలుపంచుకునే కేబుల్ ఆపరేటర్లకు తగిన లాభాలు పంచటానికీ వీలవుతుందన్నారు. కేబుల్ రంగం ఈ జస్ట్ లోకల్ యాప్ ను ఒక ఆదాయ వనరుగానూ , చందాదారులతో సత్సంబంధాలకు ఆయుధంగానూ వాడుకోవాలని శ్రీ శివశంకర్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వివరాలకు https://www.justlocalm2m.com/# ను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here