రేటింగ్స్ మీద సిబిఐ విచారణ : న్యూస్ చానల్స్ లో గుబులు

0
540

పెద్ద సంఖ్యలో న్యూస్ చానల్స్  సభ్యత్వం ఉన్న న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్ బి ఎ) హఠాత్తుగా ఉలిక్కిపడింది. టీవీ ప్రేక్షకాదరణను కొలిచే టీఆర్పీ కుంభకోణం మీద సిబిఐ విచారణను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ డిమాండ్ చాలా చిత్రంగా ఉందని చాలామంది అనుకోవచ్చుగాని ఎవరెవరి బాగోతాలు బైటపడతాయోనన్న భయాలే ఈ పరిస్థితికి కారణం. ఇంటిగుట్టు రట్టవుతుందన్న ఆందోళన కనబడుతూనే ఉంది. పేకాట ఆడుకునేవాళ్ళు అప్పటిదాకా ఎంత పోటీ పడి గొడవపడినా పోలీసులొచ్చేసరికి ఒక్కటైనట్టుందని ఈ పరిస్థితి మీద ఒకరు వ్యాఖ్యానించటం చూస్తే ఈ వ్యవహారం మొత్తం అర్థమవుతుంది.

ఇదంతా ఎలా మొదలైందంటే, ఆర్ణబ్ గోస్వామి కొంతకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన రిపబ్లిక్ టీవీలో పనిగట్టుకొని ప్రసారం చేస్తున్నారని మహారాష్ట్ర పాలకులకు అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పాలకులు ఎమ్మెస్వోల మీద వత్తిడి తెచ్చి అలాంటి చానల్ ప్రసారాలు ఆపేస్తారు.  కానీ ఇది జాతీయ చానల్ కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి అలా కుదరలేదు. రేటింగ్స్ కోసం అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ రిపబ్లిక్ టీవీ మీద దృష్టి పెట్టి విచారణ ప్రారంభించింది. స్వయంగా ముంబయ్ పోలీస్ కమిషనర్ విచారణ ప్రారంభించారు. “ మా వాళ్ళను వేధిస్తున్నారు. విచారణ ఆపండి” అంటూ ఆర్ణబ్ గోస్వామి సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడి హైకోర్టుకు వెళ్ళమని చెప్పింది.

ఇలా ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న యాడ్ ఏజెన్సీ కూడా రేటింగ్స్ మీద కేసుపెట్టింది. ఇలాంటి కేసులు ఇంతకుముందు కూడా చాలా రాష్ట్రాల్లో వచ్చినా, అక్కడి ప్రభుత్వం మాత్రం నేరుగా సిబిఐ కి అప్పగించింది. ఇప్పుడు సిబిఐ విచారణలో మహారాష్ట్ర కేసు సహా రేటింగ్స్ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) పనితీరు మీద కూడా దర్యాప్తు జరుగుతుందని తెలియటంతో చాలా చానల్స్ లో కలవరం మొదలైంది. పైగా, ఇంతటితో ఆగకుండా టీవీ పరిశ్రమలోకి వస్తున్న భారీ మొత్తాలమీద ఆదాయం పన్ను వాళ్ల దృష్టిపడేలా చేయవచ్చునన్నది మరో  కోణం.

న్యూస్ చానల్స్ సంఘం ఇప్పుడు ఒకటి కాదు. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ పేరుతో ఉన్న సంఘానికి ఇండియా టీవీ అధిపతి రజత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా ఇప్పుడు ఇంకొకటి కొత్తగా ఆర్ణబ్ గోస్వామి నాయకత్వంలో న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫౌండేషన్ ఏర్పాటైంది.  టీవీ 9 గ్రూప్ కూడా ఎన్ బి ఏ నుంచి వైదొలగి అందులో చేరింది. అయినప్పటికీ దీని సభ్యత్వం చాలా తక్కువ. టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, నెట్ వర్క్ 18, ఎన్దీటీవీ, జీ గ్రూప్, ఎబిపి గ్రూప్ లాంటి ప్రధాన న్యూస్ చానల్స్ అన్నీ ఎన్ బి ఎ లోనే ఉన్నాయి. సిబి ఐ విచారణను ఉపసంహరించుకోవాలని కోరుతున్నది ఈ సంస్థే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here