ఎన్టీయార్ హోస్ట్ గా జెమినీలో “ఎవరు మీలో కోటీశ్వరులు?”

0
705

ఇంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో స్టార్ మా టీవీలో నాలుగు సీజన్లపాటు ప్రసారమైన ప్రతిష్ఠాత్మకమైన గేమ్ షో ఇప్పుడు తాజాగా జెమినీ టీవీలో తాజా ప్రసారానికి సిద్ధమవుతోంది. “హూ వాంట్స్ టు బి ఎ మిలియనేర్ “ అనే ఒరిజినల్ గేమ్ షో దాదాపు 120 దేశాలలో ప్రసారమైన సంగతి తెలిసిందే, భారత్ లో జాతీయ చానల్స్ స్టార్ , సోనీ లో ప్రసారం కావటంతోబాటు 8 ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారమైంది.
సామాన్యుడు సైతం పెద్ద మొత్తం గెలుచుకునేట్టు ఊహించుకోగల అవకాశమిచ్చే ఈ షో సన్ నెట్ వర్క్ వారి తెలుగు చానల్ జెమిని లో “ఎవరు మీలో కోటీశ్వరులు?” పేరుతో రాబోతోంది. ఒకప్పుడు తెలుగునాట తిరుగులేని నెంబర్ వన్ గా వెలుగొందిన జెమిని టీవీ ఈ మధ్య కాలంలో ప్రేక్షకాదరణ పరంగా బాగా వెనుకబడింది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ తెలుగు మొదటి మూడు స్థానాల్లో ఉండగా జెమిని టీవీ నాలుగో స్థానానికే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో జెమినీకి ఇలాంటి కార్యక్రమం చాలా అవసరం. చాలాకాలం తరువాత జెమినీ మీద ఖర్చు పెట్టాలని సన్ నెట్ వర్క్ భావించటం సరైన నిర్ణయం. అదే విధంగా అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగల ఎన్టీయార్ ను హోస్ట్ గా ఎంచుకోవటం కూడా ఈ కార్యక్రమానికి తగినంత ఆదరణ తెచ్చిపెట్టే అవకాశముంది. గతంలో స్టార్ మా లో బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీయార్ తన సత్తా చాటుకోవటం వలన టీవీకి సరిపోతాడనే అభిప్రాయం సహజంగానే తెలుగు ప్రేక్షకులలో ఏర్పడింది.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన దలచినవారు త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అవకాశం కల్పించబోతున్నారు. జెమినీ టీవీ, సన్ గ్రూప్ వారి ఒటిటి వేదిక సన్ నెక్స్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా, లేగా జెమినీలో ప్రశ్నకు సమాధానం ఎస్ ఎం ఎస్ చేయటం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సరైన సమాధానం చెప్పినవారిలో నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ఎంపికచేస్తారు. వారికి హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాలలో లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూ కూడా నిర్వహించి అంతిమంగా పాల్గొనేవాళ్ళని ఎంపికచేస్తారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని జెమినీ నిర్వాహకులు నిర్ణయించారు. టీవీ తో బాటు పత్రికలు, రేడియో, డిజిటల్, సోషల్ మీడియాలో ఈ ప్రచారం సాగుతుంది. ప్రచార ప్రకటన మరింత ఆకర్షణీయంగా ఉండటానికి దాని రూపకల్పన బాధ్యతను సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారు. ఎంపిక విధానం చాలా కఠినతరం చేయటం వలన అన్ని విధాలా అర్హులైన వారు మాత్రమే హాట్ సీట్ కు చేరుకునే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here