అమెజాన్ నుంచి ‘V’ చిత్రం తొలగించాలని కోర్టు ఆదేశం

0
561

తెలుగు చిత్రం V ని తొలగించాలని బొంబాయ్ హైకోర్టు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అను ఆదేశించింది. ముంబయ్ కి చెందిన సాక్షి మాలిక్ అనే నటి దాఖలు చేసిన పరువునష్టం దావా మీద విచారణ జరిపిన బొంబాయ్ హైకోర్టు ఈ తీర్పు చెబుతూ, ఆమె అనుమతి లేకుండా ఒక దృశ్యంలో ఆమె ఫొటో వాడుకున్నట్టు తేలటంతో ఆ ఫోటోను తొలగించి, అలా తొలగించిన దృశ్యాన్ని ఆమెకు చూపేదాకా మళ్లీ ప్రసారం చేయకూడదని ఆదేశించింది.
నాని, అదితీరావు హైదరి నటించిన V చిత్రం 2020 సెప్టెంబర్ 5న విడుదలైన చిత్రాన్ని ఇప్పుడు కోర్టు ఆదేశానికి అనుగుణంగా అన్ని భాషలలో సబ్ టైటిల్స్ ఉన్న సినిమాతో సహా తొలగించాల్సి వచ్చింది. జస్టిస్ జి ఎస్ పాటిల్ ఈ చిత్ర నిర్మాతలైన వెంకటేశ్వర క్రియేషన్స్ ను ఆ సినిమా అన్ని వెర్షన్లలోనూ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.
తాను 2017 లో తీయించుకున్న ఒక ఫొటోను ఆ తరువాత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్నానని, ఒక వ్యభిచారిని చిత్రించే క్రమంలో వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తన ఫొటో వాడుకున్నారని సాక్షి మాలిక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక వ్యక్తి లిఖితపూర్వక అనుమతి లేకుండా వాణిజ్యపరంగా ఆ వ్యక్తి ఫొటో వాడటం కుదరదని కోర్టు అభిప్రాయపడింది. రాయల్టీ చెల్లించారా, లేదా అనేది కూడా ఇక్కడ అప్రస్తుతమని కోర్టు పేర్కొంది.
వాడిన తీరు కచ్చితంగా పరువుకు భంగం కలిగించిందని నటి తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ చిత్ర నిర్మాతలు ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసినట్టయిందని కూడా వాదించారు. మరీ ముఖ్యంగా ఆమె ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వాడటం మరింత దారుణమన్నారు. ఈ సినిమాలో ఆ నటి చిత్రాన్ని తొలగించి ఆమెకు, ఆమె న్యాయవాదులకు చూపిన తరువాతనే మళ్ళీ అమెజాన్ లో రిలీజ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here