డెన్, హాత్ వే లో రిలయెన్స్ పెట్టుబడులు రూ.1122 కోట్ల మేరకు అమ్మకం

0
1242

కేబుల్ టీవీ రంగంలో పెద్ద ఎత్తున వాటాలు కొనుగోలు చేసి డెన్, హాత్ వే లో యాజమాన్యం సంపాదించుకున్న రిలయెన్స్ సంస్థ ఇప్పుడు ఆ వాటాలలో కొంత భాగాన్ని అమ్మజూపుతోంది. హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ లో రూ. 853 కోట్లకు, డెన్ నెట్ వర్క్స్ లో రూ. 269 కోట్లకు వాటాలు అమ్మాలని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్ణయించుకుంది. అంటే, ఈ మొత్తం అమ్మకాల డీల్ విలువ 1122 కోట్లు.

ఇందులో జియో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జియో ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జియో కేబుల్ అండ్ బ్రాడ్ బాండ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలు అవి పెట్టుబడిపెట్టిన హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ లో 33 కోట్ల 80 లక్షల షేర్లు ఒక్కొక్కటి రూ. 25.25 చొప్పున రూ.853.45 కోట్లకు అమ్ముతున్నాయి. అయితే, ఇది మొత్తం సంస్థలో 19.1% మాత్రమే.

అదే విధంగా జియో ఫ్యూచరిస్టిక్ డిజిటల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జియో డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జియో టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి డెన్ నెట్ వర్క్స్ లో 5కోట్ల 55 లక్షల వాటాలు ఒక్కోవాటా రూ.48.50 చొప్పున 269.18 కోట్లకు అమ్ముతున్నాయి. ఇది ఆ సంస్థలో కేవలం 11.63% మాత్రమే.

సెబీ నియమాల ప్రకారం కనీస ప్రజలవాటా ఉండాల్సినంత ఉండటం కోసం రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇలా కొద్దిపాటి వాటాలను బహిరంగంగా అమ్మటానికి నిర్ణయించింది. ఇందులో పెద్ద మొత్తంలో కొనేవాళ్ళకోసం మార్చి 26న. చిల్లర కొనుగోలుదార్లకోసం మార్చి 30న అమ్మకాలకు అందుబాటులో ఉంచుతారు.

మీడియా పంపిణీ వ్యాపారంలో తనదైన ముద్ర వేసే క్రమంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2020 ఫిబ్రవరిలో హాత్ వే, డెన్ సంస్థలను టీవీ 18, నెట్ వర్క్ 18 లలో విలీనం చేసింది. వాటాలు కొనుగోలు చేసింది. 2018 అక్టోబర్ లో డెన్ నెట్ వర్క్స్ , హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థల్లో మెజారిటీ వాటాను రూ,5,230 కోట్లకు రిలయెన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మజూపుతున్న కొద్ది వాటాలమీద కూడా రిలయెన్స్ కు లాభాలు బాగానే వస్తున్నాయి. గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రిలయెన్స్ ఇండస్ట్రీస్ వాటా ధర రూ, 1992.75 ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here