కేబుల్ చానల్స్ కు కొత్త సవాళ్ళు (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

0
1068

ఊరూరా కనిపించే కేబుల్ చానల్స్ ఇక మాయం కాబోతున్నాయా? టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు అవుననే అంటున్నాయి. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) సూచించిన నిబంధనలకు తోడు పరిశ్రమలోని వివిధ వర్గాలు వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా ట్రాయ్ ఈ సిఫార్సులు చేసింది. మార్కెట్లో డివిడి ల రూపంలోనో, యూ ట్యూబ్ లోనో దొరుకుతున్నాయనుకున్న సినిమాలు, పాటలు తీసుకొని మూడేసి, నాలుగేసి చానల్స్ నడుపుకునే కేబుల్ ఆపరేటర్లకు చెక్ పెట్టాలన్నదే ట్రాయ్ అభిప్రాయంగా కనబడుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కేబుల్ టీవీ చట్ట సవరణ వలన కొన్ని ఆంక్షలు వస్తుండగా ఇప్పుడు ట్రాయ్ సిఫార్సులు తోడై కేబుల్ చానల్స్ నడపగలిగే పరిస్థితి లేకుండా చేసింది. ఇది కేబుల్ ఆపరేటర్లకు వచ్చే ప్రకటనల ఆదాయానికి గండి కొట్టినట్టే.
కేబుల్ టీవీ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు చూస్తే, ప్రతి కేబుల్ ఆపరేటర్ తాను ప్రసారం చేసే కార్యక్రమాల జాబితా మొత్తాన్ని ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ రూపంలో ఎలక్ట్రానికి పద్ధతిలో కనీసం ఏడాదిపాటు నిల్వ చేయాల్సి ఉంటుంది. దీనివలన ఎక్కడైనా కార్యక్రమాల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్టు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకోవటానికి వీలుంటుంది. అదే విధంగా, ప్రసార హక్కులు లేని కార్యక్రమాలు ప్రసారం చేసినా చర్యలు తీసుకోవటం సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఎప్పుడు అడిగినా ఆ వివరాలు సమర్పించవలసి ఉంటుంది. అంటే, ఇప్పటిలా అడ్డదిడ్డంగా కొత్త సినిమాలు, పాటలు ప్రసారం చేస్తే దొరికిపోతారు. ప్రసారం చేసినట్టు ఆధారాలు లేవని తప్పించుకోవటానికి వీల్లేదు. 1998 తరువాత శాటిలైట్ చానల్స్ యజమానులు కొత్త సినిమాల శాటిలైట్ హక్కులతోబాటు కేబుల్ హక్కులు కూడా కలిపి తీసుకోవటం ద్వారా కేబుల్ చానల్స్ ఆ సినిమాలు ప్రసారం చేసే అవకాశం లేకుండా చేశారు. అయినప్పటికీ కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ వచ్చిన ఆపరేటర్లను అడ్డుకోవటానికి ఇప్పటి నిబంధనలు పనికొస్తాయని సంతోషిస్తున్నారు.
ఇక న్యూస్ ప్రసారం చేసే కేబుల్ చానల్స్ కు సైతం ఆంక్షలు ప్రతిపాదించారు. న్యూస్ ఇవ్వాలనుకుంటే కచ్చితంగా ఆ కేబుల్ ఆపరేటర్ భారతీయ కంపెనీల చట్టం, 2013 కింద తన కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే యాజమాన్యం గురించి కచ్చితంగా తెలుస్తుందని, హద్దుమీరితే చర్యలు తీసుకోవటానికి వీలవుతుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ట్రాయ్ కూడా దీన్ని సమర్థించింది. అందువలన కేబుల్ ఆపరేటర్లకు ఈ నిబంధన తప్పేట్టు లేదు. ఇక ఏది న్యూస్ చానల్ అనే విషయంలో కూడా ట్రాయ్ స్పష్టత ఇచ్చింది. స్థానిక ఘటనలు, కార్యక్రమాలు న్యూస్ చానల్ కిందికి రావు. అయితే, న్యూస్ ఏజెన్సీలనుంచి, ఇతర చానల్స్ నుంచి తీసుకున్నవి ప్రసారం చేయకూడదు. స్థానిక క్రీడా కార్యక్రమాలు ప్రసారం చేయవచ్చు. కానీ ఇతరులకు వాటి ప్రసార హక్కులు ఉంటే ప్రసారం చేయకూడదు. ట్రాఫిక్, వాతావరణం, సాంస్కృతిక కార్యక్రమాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, ప్రవేశాలు, కెరీర్ కౌన్సిలింగ్, ఉద్యోగావకాశాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య సమాచారం, స్థానిక అధికారులు అందించే విద్యుత్, నీటి సరఫరా సమాచారం, వ్యవసాయం, విద్య తదితర కార్యక్రమాలు ప్రసారం చేసుకోవచ్చు. ఇవి వార్తల కిందికి రావు.
అన్నిటికంటే ముఖ్యమైన మరో నిబంధన కేబుల్ చానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలు మరో ఎమ్మెస్వో పరిధిలో ప్రసారం కాకూడదు. అంటే, ఏదైనా ఏజెన్సీ కొన్ని కార్యక్రమాలు తయారుచేసి చందాలు వసూలు చేస్తూ అందరికీ అవే కార్యక్రమాలు పంచటం ఇక మీదట కుదరదు. తమ చందాదారుల కోసం మాత్రమే కార్యక్రమాలు ప్రసారం చేయకపోతే అవి శాటిలైట్ చానల్ అనుమతి లేకుండానే పెద్ద చానల్స్ లాగా తయారవుతాయన్నది ట్రాయ్ అభిప్రాయం. నిజానికి కొంతమంది కేబుల్ వ్యాపారంతో సంబంధం లేకుండా కేబుల్ చానల్స్ నడుపుతూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రసారాలు అందిస్తున్నారు. కారేజ్ ఫీజు తీసుకునే ఎమ్మెస్వోలు కూడా అలాంటి చానల్స్ ను ప్రోత్సహిస్తున్నారు. అందుకే ట్రాయ్ ఈ నిబంధన పెట్టింది.
ఒక ఎమ్మెస్వో 15 లోకల్ చానల్స్ వరకు నడుపుకునేందుకు అవకాశమివ్వాలని ట్రాయ్ సిఫార్స్ చేసింది. ఎంఐబి రిజిస్ట్రేషన్, లేదా పోస్టల్ రిజిస్త్రేషన్ ఉన్నవాళ్లెవరైనా చానల్స్ నడుపుకోవచ్చునని చెప్పటం ద్వారా కేబుల్ ఆపరేటర్లు కూడా చానల్స్ పెట్టుకోవచ్చునని ఒప్పుకుంది. అదే సమయంలో ఆ చానల్స్ అన్నీ కచ్చితంగా ఎమ్మెస్వో డిజిటల్ హెడ్ ఎండ్ దాకా వచ్చిపోవాలన్నది డిజిటైజేషన్ ప్రాథమిక సూత్రమేనని చెప్పింది. అంటే, ఒక ఎమ్మెస్వో పరిధిలో ఉన్న మొత్తం ఆపరేటర్ల చానల్స్ కూడా 15 కి లోపే ఉండాలని చెప్పకనే చెప్పినట్టయింది. ఎమ్మెస్వో ఎంత ఉదారంగా ఉన్నా, తన పరిధిలోని ఆపరేటర్లలో ఐదారుగురికి మాత్రమే ఒక్కో చానల్ ఇవ్వగలుగుతాడు తప్ప అంతకు మించి కుదరదు. దేశవ్యాప్తంగా అపరేటర్లు ఉన్న హిట్స్ కు మినహాయింపు ఏదీ స్పష్టంగా ఇవ్వలేదు. ఈ సంస్థ ఆపరేటర్లు ఎన్ క్రిప్ట్ చేసుకునే సౌకర్యం ఉండటం వలన దీన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించాల్సి వస్తుంది. అందువలన సంఖ్య ముఖ్యమా. ఎన్ క్రిప్షన్ ముఖ్యమా అనే ప్రశ్నకు ట్రాయ్ సమాధానం ఇవ్వక తప్పదు.
ఈ పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ల సొంత చానల్స్ కే దిక్కులేదు గనుక ఇతరుల చానల్స్ ఇవ్వగలిగే పరిస్థితి అసలే ఉండదు. టీవీ చానల్స్ పంపిణీతో సంబంధం లేకపోయిన్నా చాలామంది సొంత చానల్స్ పెట్టుకొని తెలిసిన ఆపరేటర్ల ద్వారా, ఎమ్మెస్వోల ద్వారా ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ కేబుల్ చానల్స్ పేరుతో అక్రెడిటేషన్ల కోసం రాష్ట్రప్రభుత్వాలమీద వత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి చానల్స్ 90 శాతానికి పైగా మూతపడతాయి. కేవలం ఎమ్మెస్వో కారేజ్ ఫీజు తీసుకొని ఇస్తే తప్ప ప్రసారం కావు. పైగా, అవి కూడా ఒక ఎమ్మెస్వో పరిధిని మించి ప్రసారం కావటానికి వీలులేదు. అలా ప్రసారం చేయటం లేదని ఎమ్మెస్వో హామీ ఇవ్వాలి కాబట్టి ప్రసారమైతే, ఎమ్మెస్వో రిజిస్త్రేషన్ సైతం రద్దవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎపి ఎస్ ఎఫ్ ఎల్ కూడా ఒక ఎమ్మెస్వో హోదాలో ఈ ఆంక్షల ఫలితాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇప్పటిదాకా తన ఆధ్వర్యంలోని కేబుల్ చానల్స్ తమ ప్రదేశంలోనే సొంత చానల్స్ కలుపుకోవటానికి అవకాశం ఇవ్వగా డిజిటైజేషన్ నిబంధనలు, ఇప్పటి ట్రాయ్ సిఫార్సుల ప్రకారం అది చెల్లదు. అదే సమయంలో తనకున్న 15 చానల్స్ అవకాశాన్ని ఆపరేటర్లకు ఇవ్వాలంటే కనీస కనెక్షన్ల నిబంధన విధించటమో, లేదా తానే వాటిని వాడుకోవటమో చేయాలి. ప్రస్తుతం న్యూస్, నాన్-న్యూస్ చానల్స్ కు వేరువేరుగా కారేజ్ ఫీజు నిర్ణయించి ప్రైవేట్ కేబుల్ చానల్స్ ను ప్రసారం చేస్తున్నారు. పంపిణీతో సంబంధం లేని కేబుల్ చానల్స్ ఇవ్వాలన్నా, ఆ 15 చానల్స్ పరిమితికి లోబడాలి కాబట్టి కారేజ్ ఫీజు పెంచే అవకాశం ఉంది. లేదా దూరదర్శన్ వారి ఫ్రీడిష్ తరహాలో స్లాట్స్ వేలం వేయవచ్చు.
ఇప్పుడు ట్రాయ్ చేసిన సిఫార్సుల వలన ఎమ్మెస్వోలు కచ్చితంగా తాము అందించే మొత్తం చానల్స్ వివరాలు ప్రకటించాలి. సొంత చానల్స్ అనేకం చూపిస్తూ ఖాళీ లేదన్న నెపంతో కొన్ని ప్రాంతీయ శాటిలైట్ చానల్స్ ను సైతం తొలగించటం చూస్తున్నాం. ఒక దశలో టిడిశాట్ అలాంటి పంపిణీ సంస్థలకు జరిమానా విధించటమూ తెలుసు. కారేజ్ ఫీజు కోసమో, మరే విధమైన వత్తిళ్లకారణంగానో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇకమీదట సొంత చానల్స్ మీద పరిమితి ఉండటం వలన శాటిలైట్ చానల్స్ ఇచ్చే అవకాశం పెరగవచ్చు. అదే సమయంలో ప్రేక్షకులు తాము కోరుకున్న చానల్స్ రావటం లేదని డిటిహెచ్ వైపు మొగ్గు చూపుతారన్న వాస్తవాన్ని గ్రహించకపోతే ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు నష్టపోతారు.
కేబుల్ ఆపరేటర్లు ఇన్నాళ్ళూ నడుచుకున్నది ఒక తీరు. ఇప్పటికైనా మారకపోతే ఇబ్బందుల్లో పడతారు. స్పష్టంగా హక్కులు ఉంటే తప్ప సినిమాలు ప్రసారం చేస్తే చిక్కుల్లో పడక తప్పదు. రిజిస్ట్రేషన్ రద్దయితే మొత్తం వ్యాపారానికే మోసం వస్తుంది. ఎమ్మెస్వోలమీద ఉన్న పరిమితి కారణంగా అందరు ఆపరేటర్ల చానల్స్ ఇవ్వటం కష్టమన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ విషయంలో కార్పొరేట్ ఎమ్మెస్వోల కంటే స్వతంత్ర ఎమ్మెస్వోల పరిస్థితి కొంతలో కొంత మెరుగు కాబట్టి ఎక్కువ కనెక్షన్లున్న ఆపరేటర్లు ఎమ్మెస్వోను ఒప్పించి ఒకటో రెండో చానల్స్ తీసుకోవచ్చు. పెద్ద ఎమ్మెస్వోలకు అది అసాధ్యం.
ట్రాయ్ చేసిన సిఫార్సులలో అధికభాగం ఇప్పటికే ఎంఐబి కూడా ఆమోదించినవే కాబట్టి అమలుకావటానికి ఎలాంటి అవరోధాలూ ఉండకపోవచ్చు. మిగిలిన సిఫార్సులు “నిబంధనల అమలుకు అవసరమైన కనీస అవసరాలు” అని ఎంఐబి కి నచ్చజెప్పటానికి ట్రాయ్ ప్రయత్నించింది. ఆ విషయంలో పూర్తిగా సఫలమైందనే చెప్పాలి. అందువలన అధికారికంగా రాబోయే నిబంధనలకు సిద్ధం కావటం తప్ప కేబుల్ పరిశ్రమ చేసేదేమీ లేదు.

  • తోట భావనారాయణ
    (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here