కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు జూన్ 1కి వాయిదా

0
840

కొత్త టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) అమలును జూన్ 1 కి వాయిదా వేస్తున్నట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ఈ రోజు ప్రకటించింది. గతంలో విధించిన గడువు ప్రకారం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు కావలసి ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా గడువును రెండు నెలల పాటు పొడిగించింది.
ఈ ప్రణాళిక ప్రకారం బ్రాడ్ కాసటర్లు తమ రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ( ఆర్ ఐ ఒ) 28 వ తేదీలోగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆలా మార్చిన ఆర్ఐఒ ను తమ వెబ్ సైట్స్ లో ప్రకటించాలి. అదే విధంగా పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు పే చానల్ బైక్ ధరలు, తమ చిల్లర పంపిణీ ధరలను మార్చి 31 లోగా కొత్త నిబంధనల ప్రకారం ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆర్ ఐ ఒ ప్రకటించినవారు కూడా మార్చి 31 నాటికి సవరణలు చేసుకోవటానికి వెసులుబాటు కల్పించింది.
అయితే, దేశమంతటా ఇప్పుడు నెలకొన్న కరోనా వాతావరణ నేపథ్యంలో, కొత్త నిబంధనల అమలుకు మరికొంత వ్యవధి కావాలని వివిధ భాగస్వాముల నుంచి అందుతున్న విజ్ఞప్తులను పరిగణనలోకి ఎన్టీవో 2.0 అమలుకు గడువు పెంచాలని నిర్ణయించినట్టు ట్రాయ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తమ సిబ్బంది చాలామంది కోవిడ్ బారిన పడినందున వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి ఆఫీసులకు హాజరు కాలేకపోతున్నట్టు పంపిణీ సంస్థలు ట్రాయ్ కి తెలియజేశాయి. కేబుల్ ఆపరేటర్లు, వారి సిబ్బంది చాలా ప్రాంతాలలో కోవిడ్ బాధిత చందాదారులను చేరుకోలేకపోతున్నారని, వసూళ్ళు చేపట్టలేకపోతున్నారని తెలియటంతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫలితంగా ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు జూన్ 1 నుంచి చందాదారులకు వారు కోరుకున్న విధంగా బొకేలు, చానల్స్ అందించాలని ట్రాయ్ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here