తెలుగు సహా దక్షిణాది భాషల్లో జీ గ్రూప్ డిజిటల్ చానల్స్

0
673

జీ గ్రూప్ డిజిటల్ న్యూస్ చానల్స్ రూపంలో దక్షిణాదిన విస్తరిస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో డిజిటల్ న్యూస్ చానల్స్ ప్రసారానికి ఏర్పాటు చేసింది. యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా దక్షిణాది న్యూస్ మార్కెట్ లో ప్రవేశిస్తున్నట్టు సౌత్ చానల్స్ సీఈవో పురుషోత్తమ వైష్ణవ వెల్లడించారు. కేవలం చర్చల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవటం తమ ఉద్దేశ్యం కాదని, నిష్పక్షపాత వార్తలకు, విస్తృతమైన క్షేత్రస్థాయి రిపోర్టింగ్ కు ఉన్న అవకాశాన్ని దృష్టిలోపెట్టుకొని ఆ కోణంలో ఖాళీని భర్తీచేయటానికే విశ్వసనీయమైన చానల్స్ ను తీర్చిదిద్దుతున్నామని ఆయన అంటున్నారు.
మిగిలిన భారతదేశంతో పోల్చినప్పుడు దక్షిణాదిన ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువగా ఉందని, వీడియోలు చూస్తున్న సమయం కూడా గత రెండేళ్లలో 60-70 శాతం మేర పెరిగిందని సంస్థ గుర్తు చేస్తోంది. పైగా ఆలా చూస్తున్న కంటెంట్ లో 85% పైగా ప్రాంతీయ భాషలో కావటం, 68 శాతం జనాభా డిజిటల్ మాధ్యమాల ద్వారా వార్తలు చూస్తుండటం కారణంగా నిజమైన క్షేత్రస్థాయి వార్తలతో ప్రాంతీయంగా ఆకట్టుకోవటమే ధ్యేయంగా విస్తరిస్తున్నట్టు జీ గ్రూప్ చెప్పుకుంటోంది. త్వరలో కాశ్మీరీ భాషలో కూడా డిజిటల్ న్యూస్ చానల్ ప్రారంభించాలనుకుంటోంది.
కేవలం రాజకీయ వార్తలకే పరిమితం కాకుండా క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ సెటైర్, లైఫ్ స్టైల్, హెల్త్ లాంటి వివిధ అంశాల మీద దృష్టిసారిస్తార్అని తెలుస్తోంది. జీ తెలుగు న్యూస్, జీ తమిళ్ న్యూస్, జీ మలయాళం న్యూస్, జీ కన్నడ న్యూస్ పేర్లతో వెబ్ సైట్స్ తోబాటు యూట్యూబ్ వేదిక మీద, ఓటీటీ వేదిక జీ5 మీద కూడా అందుబాటులో ఉంటాయి. జీ తెలుగు న్యూస్ విభాగానికి భరత్ కుమార్ అధిపతిగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here