సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం

0
271

సుభాష్ చంద్ర సారధ్యంలో ప్రారంభమైన భారత దేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ జీ ఒక మహాసామ్రాజ్యంగా ఎదిగినా, ఇప్పుడు దాని ఎంటర్టైన్మెంట్ చానల్స్ విభాగం మొత్తం సోనీలో విలీనమవుతోంది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా లో విలీనమవుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. దక్షిణాసియాలో అత్యధిక ఎదుగుదల, లాభదాయకత సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనీ సంస్థ ప్రకటించింది. ఈ విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ బోర్డ్ కూడా ఆమోదం తెలియజేసింది. కొత్త సంస్థలో సోనీకి మెజారిటీ వాటా ఉంటుంది. అయితే జీ ఎండీ గా ఉన్న సుభాష్ చంద్ర కుమారుడైన పునీత్ గోయెంకా ఈ కొత్త సంస్థకు ఎండీగా కొనసాగుతారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లను నియమించే అధికారం సోనీకి ఉంటుంది.

ఈ విలీనం పూర్తయ్యాక సోనీ వాటాదారుల వాటా 52.93 శాతణ, జీ వాటాదారుల వాటా 47.07 ఉంటాయి. ఈరోజు సమావేశమైన జీ డైరెక్టర్ల బోర్డు ఈ విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. ఈ రెండు సంస్థల పరిధిలోని చానల్స్ ఆస్తులు, కార్యకలాపాలు అన్నీ ఇకమీదట కలిసి పోతాయి. జీ వ్యవస్థాపకులకు ప్రస్తుతం 4 శాతం వాటా ఉండగా దీనిని 20 శాతం వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు. గతంలో ఒక విదేశీ సంస్థకు అమ్మేందుకు జీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు రాగా అనూహ్యంగా ఇప్పుడు సోనీలో విలీనమైంది.

నిజానికి జీ డైరెక్టర్లను, మేమేజింగ్ డైరెక్టర్ ను తొలగించాలని కొంత కాలంగా వాటాదారులైన సంస్థలు డిమాండ్ చేస్తున్న సమ యంలో ఈ ఆకస్మిక పరిణామం అందరినీ ఆశ్చర్య పరచింది. పైగా అదే మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు విలీనం తరువాత కూడా కొనసాగబోవటం విచిత్రం. సోనీకి ప్రాంతీయ చానల్స్ లేకపోవటం ఒక లోటు కాగా ఇప్పుడు జీ విలీనంతో ఆ లోటు తీరుతుంది. జీ గ్రూప్ న్యూస్ విభాగం, డిష్ టీవీ లాంటివి జీ గ్రూప్ లోనే కొనసాగుతాయి. గతంలో జీ టీవీ తన స్పోర్ట్స్ విభాగాన్ని సోనీకి అమ్మటం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here