ఇంటర్నెట్ కత్తిరించారు, టీవీ సంగతేంటి?

0
955

రిపబ్లిక్ దినోత్సవం రోజు అల్లర్లను అరికట్టటానికి అని పేర్కొంటూ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన ప్రభుత్వం, రెచ్చగొట్టే టీవీ ప్రసారాలను ఎందుకు అడ్డుకోలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే ఆధ్వర్యంలోని త్రిసభ్య న్యాయమూర్తుల బృందం ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, టీవీలో కొన్ని కార్యక్రమాలు ఒక వర్గం మీద ప్రభావం చూపేలా రెచ్చగొట్టే తరహాలో ఉంటే వాటి విషయంలో ప్రభుత్వంలో ఉదాసీనంగా ఉందని పేర్కొంది.
“ఒక వర్గాన్ని ప్రభావితం చేయటమో, రెచ్చగొట్టటమో చేసిన కార్యక్రమాలున్నాయి. నిన్న మీరు రైతుల ఢిల్లీ యాత్ర పేరుతో ఇంటర్నెట్, మొబైల్ సర్వీస్ కత్తిరించారు. నేను వివాదాస్పదం కాని పదం వాడుతున్నారు. ఇంటర్నెట్ కేబుల్ కత్తిరించారు. ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా, ఎక్కడైనా తలెత్తవచ్చు. నిన్న టీవీలో ఏం జరిగిందో నాకు తెలియదు” అన్నారు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే.
2020 మార్చిలో నిజాముద్దిన్ మర్కజ్ లో జరిగిన సమావేశం మీద మీడియా రిపోర్టింగ్ మీద జమియాత్ ఉలేమా ఇ హింద్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఆ సమావేశమే దేశంలో కోవిడ్-19 వ్యాప్తికి కారణమని మీడియా పెద్ద ఎత్తున ఆరోపించింది. తబ్లిగీ జమాత్ అనే ముస్లిం సంస్థ గత మార్చి లో నిజాముద్దీన్ లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి అనేక మంది హాజరు కావటం, వారికి కరోనా వైరస్ సోకినట్టు తేలటంతో మార్చి 30 నాడు ఆ పరిసరాలను మూసివేశారు. మార్చి 13-24 మధ్య దాదాపు 16,500 మంది నిజాముద్దీన్ లోని తబ్లిఘి జమాత్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు.
సుప్రీంకోర్టు ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితోబాటు జస్టిస్ ఎ ఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్ ఉన్నారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతుల నిరసనలను, ట్రాక్టర్ రాలీని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ నిలిపివేయటం గురించి ధర్మాసనం ప్రశ్నించింది. రెచ్చగొట్టే వార్తాంసాలు ప్రసారం చేసిన టీవీ ల విషయంలో కూడా అలాంటి చర్య తీసుకొని ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది. నిష్పాక్షికమైన, నిజాయితీతోకూడిన రిపోర్టింగ్ మాత్రమే ఆమోదయోగ్యమని పేర్కొంది.
ఇతరులను రెచ్చగొట్టే వార్తలతోనే అసలు సమస్యంతా వస్తున్నదని, అదే శాంతిభద్రతలకు విఘాతంగా మారితోందని పేర్కొంది. అలాంటి రెచ్చగొట్టే వార్తాంశాల పట్ల ప్రభుత్వం ఎందుకు కళ్ళుమూసుకుంటున్నదో అర్థం కావటం లేదని, ఎందుకు నియంత్రించటం లేదని కూడా ప్రశ్నించింది. బ్రాడ్ కాస్తర్లు కూడా కేబుల్ టీవీ చట్టం కిందికి వస్తారా, లేదా?, ఇతర మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు కూడా కార్యక్రమాల నియంత్రణ పరిధిలోకి వస్తాయా, రావా? అని కూడా ప్రశ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here