ఫిక్కీ అధ్యక్షునిగా ఎన్నికైన ఉదయశంకర్

0
484

వాల్ట్ డిస్నీ కంపెనీ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ గాను, స్టార్ ఇండియా చైర్మన్ గాను పనిచేసి ఇటీవలే రాజీనామా చేసిన ఉదయ శంకర్ ఇప్పుడు భారతదేశపు అతి పురాతనమైన, వాణిజ్య మండలి నాయకత్వబాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటివరకు భారత వాణిజ్యమండలుల, పరిశ్రమల సమాఖ్య ( ఫిక్కీ) అధ్యక్షురాలిగా ఉన్న అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు.
11,12,13 తేదీలలో జరిగే ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఉదయ శంకర్ ఈ కొత్త బాధ్యతలు చేపడతారు. జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యమున్న ఈ పరిశ్రమ, వాణిజ్య సంస్థకు మొదటిసారిగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోవటం విశేషం. గతంలో ఆయన ఫిక్కీ లో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగానికి చైర్మన్ గా వ్యవహరించారు.
స్టార్ ఇండియా చైర్మన్ గానే కాకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ రంగం తరఫున అనేక అంశాలలో చొరవ తీసుకొని విశేష సేవలందించారు. టెలివిజన్ రంగంలో మైలురాళ్లుగా చెప్పుకునే అంశాలలో ఆయన కీలకపాత్ర పోషించారు. బ్రాడ్ కాస్ట్ రంగాన్ని డిజిటైజ్ చేయటం, స్వీయ నియంత్రణ దిశలో బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ఏర్పాటు, అధ్యక్ష బాధ్యతలు చేపట్టటం లాంటి ఎన్నో అంశాలలో చొరవతీసుకున్నారు.
జర్నలిస్టుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి భారతదేసపు తొలి 24గంటల న్యూస్ చానల్ స్టార్ న్యూస్ కు సీఈవో అయ్యారు. టీవీ టుడే గ్రూప్ కు ఆయన న్యూస్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలోనే 2000 లో ఆజ్ తక్ న్యూస్ చానల్, 2003 లో హెడ్ లైన్స్ టుడే ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఫిల్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here