కోలుకుంటున్న టీవీ, ఇప్పట్లో కోలుకోలేని పత్రికలు

0
730

పత్రికల ప్రకటనల వ్యయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్లు ఉండవచ్చునని నిపుణులు అంచనావేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అది రూ.20,000 కోట్లుగా నమోదు కావటాన్నిబట్టి చూస్తే కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మరికొందరి అంచనాల ప్రకారమైతే సర్క్యులేషన్ సగటున 20%. ఆదాయం 30% తగ్గినట్టు తెలుస్తోంది. అన్ లాకింగ్ పూర్తి స్థాయిలో పూర్తయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడటం లేదు. అదే సమయంలో టీవీ, డిజిటల్ వేదికలు మాత్రం బాగానే పుంజుకున్నాయి. పత్రికలు ఇంకా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇంగ్లిష్, బిజినెస్ పత్రికలు కోవిడ్ సమయంలో కోల్పోయిన సర్క్యులేషన్ లో 60-65 శాతం మాత్రమే మళ్లీ పొందగలిగినట్టు తేలింది. హిందీ పత్రికలలో కోలుకున్న శాతం 75-80 కి చేరి కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పటికీ అది కూడా ఆదాయం పెంచుకోగలిగే స్థాయిలో లేదు. ఆదాయం పరంగా పూర్తిగా కోలుకోవటమన్నది సుదూర స్వప్నంగానే కనబడుతోంది. ప్రకటనలు కోవిడ్ కు ముందున్న స్థాయితో పోల్చుకుంటే ఇప్పుడు 55% మాత్రమే వస్తున్నాయి. దీపావళి సీజన్లో కాస్త కళకళలాడినట్టు కనిపించినా అవన్నీ భారీ డిస్కౌంట్ ఇవ్వటం వల్ల వచ్చినవేనని తేలింది. పండుగ సీజన్ తరువాత మళ్లీ దారుణమైన పరిస్థితి కనబడుతోంది.
ప్రకటనలు ఎంతగా తగ్గాయంటే పత్రికలు గతంలో వేస్తూ వచ్చిన అనుబంధాలను కూడా ఇప్పుడు ప్రధాన పత్రికలోనే ఇముడ్చుతున్నాయి. కోవిడ్ వలన కలిగిన నష్టాన్ని ఇప్పట్లో పూడ్చుకోవటం పత్రికలకు అసాధ్యంగా కనిపిస్తోంది.మళ్లీ పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేపడుతూ, ఇంటింటికీ బృందాలను పంపి చందాదారులను పెంచుకుంటే తప్ప సర్క్యులేషన్ పెరిగే అవకాశం కనబడటం లేదు. ఇందులోనూ అనేక రాయితీలు, ఆకర్షణీయమైన పథకాలు ఇవ్వజూపక తప్పదు.
ఆదాయ పరంగా చూస్తే, నిరుటి కంటే ఈ ఏడాది దదాపు 40-5-% తగ్గింది. కొద్దిగా కోలుకున్నప్పటికీ కోవిడ్ కి ముందున్న యథాపూర్వ స్థితికి రావటం మాత్రం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడ్డం లేదు. ప్రజలు పత్రికలు చదివే అలవాటును సైతం కోవిడ్ బాగా మార్చేసింది. అడ్వర్టయిజర్లు తమ ప్రకటనల పంపిణీలో మార్పులు చేశారు. ఎక్కువ మొత్తాలను టీవీకి, డిజిటల్ కు బదలాయించారు. వీటివలన పెట్టుబడికి తగిన ఆదాయం ఉందని నమ్ముతున్నారు. అంతమాత్రాన పత్రికలు కోల్పోయినదంతా టీవీ, డిజిటల్ సంపాదించుకున్నట్టు కాదు. కొంతమాత్రమే అటు మళ్ళింది. మిగతాది తగ్గించుకున్న ప్రకటనల ఖర్చు మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here