రేటింగ్స్ కుంభకోణం: బార్క్ మాజీ సీఈవోకు బెయిల్

0
447

టీవీ రేటింగ్స్ అక్రమాల కుంభకోణంలో అరెస్ట్ అయి రెండు నెలలకు పైగా జైల్లో గడిపిన బార్క్ (బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీ ఈ వో పార్థోదాస్ గుప్తాకు బెయిల్ లభించింది. పోలీస్ కస్టడీలో అనేక విషయాలు వెల్లడించిన అనంతరం బొంబాయ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు అనేకమార్లు ప్రయత్నించినా బెయిల్ నిరాకరించటంతో తలోజా సెంట్రల్ జైల్లోనే గడపాల్సి వచ్చింది..
బెయిల్ షరతుల ప్రకారం పార్థో దాస్ గుప్తా రూ. 2 లక్షల రూపాయల బాండ్ సమర్పించటంతోబాటు ఆరు నెలల పాటు నెలకొకసారి ముంబయ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. పోలీసులకు పాస్ పోర్ట్ సమర్పించటంతోబాటు దర్యాప్తుకు సహకరించాలని, విచారణకు హాజరుకావాలని కూడా జస్టిస్ ప్రకాశ్ డి నాయక్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు.
గతంలో ముంబయ్ సెషన్స్ కోర్ట్ బెయిల్ నిరాకరించగా దాస్ గుప్తా బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఒక వైపు బెయిల్ పిటిషన్ మీద విచారణ కొనసాగుతుండగానే తన అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని, చికిత్సకోసం ముంబయ్ లోని పిడి హిందుజా ఆస్పత్రికి తరలించాలని కోరారు. అయితే అలాంటి అత్యవసరమేమీ లేదంటూ జనవరి 22న హైకోర్టు ఆ అభ్యర్థనను త్రోసిపుచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here