రేటింగ్స్ కుంభకోణం: ఐసియు లో బార్క్ మాజీ సీఈవో

0
633

రేటింగ్స్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. రిపబ్లిక్ టీవీ అధిపతి ఆర్ణబ్ గోస్వామికి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాకు మధ్య నడిచినట్టు చెబుతున్న 500 పేజీల వాట్సాప్ చాటింగ్ ను ముంబయ్ పోలీసులు విడుదల చేయటంతో అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. టీఆర్పీ సమాచారంలో మార్పుల విషయంలో అవసరమైతే తనకు రాజకీయ మద్దతు ఉన్నట్టు ఆర్ణబ్ హామీఇవ్వటం కూడా ఆ చాటింగ్ లో ఉంది. ఇది బైటపడ్డ వెంటనే పార్థోదాస్ గుప్తా షుగర్ స్థాయి పడిపోవటంతో ఆయనను హుటాహుటిన ముంబయ్ లోని జెజె ఆస్పత్రికి తరలించారు.
55 ఏళ్ళ దాస్ గుప్తా మధుమేహ వ్యాధిగ్రస్తుడు. ఆయన నవీ ముంబయ్ లోని తలోజా కేంద్ర కారాగారంలో ఉండగా అర్థరాత్రి వేళ షుగర్ పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్ళినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐసియు లో ఆక్సిజెన్ మీద ఉన్నారు. ఇలా ఉండగా, జైల్లో తన తండ్రిని పోలీసులు వేధించారని దాస్ గుప్తా కూతురు ఆరోపిస్తున్నారు. తన తండ్రి ప్రాణాలు కాపాడాల్సిందిగా ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
టీవీ రేటింగ్స్ లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో రేటింగ్స్ ను తారుమారుచేయటంలో కీలకపాత్ర పోషించినట్టు ఆధారాలు దొరికిన నేపథ్యంలో ముంబయ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలొ వెల్లడైన అంశాల ఆధారంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఆయనకు రిమాండ్ విధించటమే కాకుండా బెయిల్ కు సైతం కోర్టు నిరాకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here