రేటింగ్స్ కుంభకోణం: రిపబ్లిక్ సీఈవోకు బెయిల్

0
583

టెలివిజన్ రేటింగ్స్ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ సీఈవో ఖాన్ చందానీకి ముంబయ్ కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో ఆ చానల్ కు ఊరట లభించింది. టీవీ పరిశ్రమను కుదిపేసిన ఈ కుంభకోణంలో వరుసగా అరెస్టులు జరుగుతుండగా ఒక జాతీయ చానల్ సీఈవో అరెస్ట్ కావటం ఇదే మొదటిసారి. ఆదివారం నాడు ముంబయ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఎస్ ప్లనేడ్ లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా బుధవారం నాడు ఆయనకు బెయిల్ లభించింది.
ముంబయ్ పోలీసులు అక్టోబర్ 8న రేటింగ్స్ కుంభకోణాన్ని బైటపెట్టారు. అప్పటినుంచి వరుసగా జరుగుతున్న అరెస్టులలో రిపబ్లిక్ టీవీ సీఈవో ది 13వ అరెస్ట్. అంతకుముందు ఆ చానల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యామ్ సింగ్ ను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ముంబయ్ పోలీసుల చార్జ్ షీట్ లో ఆయనపేరు కూడా ఉంది.
రేటింగ్స్ పెంచుకోవటం కోసం రిపబ్లిక్ నెట్ వర్క్ తన ఇంగ్లిష్ చానల్ రిపబ్లిక్ టీవీ, హిందీ చానల్ రిపబ్లిక్ భారత్ తరఫున నెలనెలా 15 లక్షలు చెల్లిస్తూ ఉందన్నది ముంబయ్ పోలీసుల అభియోగం. ఈ పనిలో పాత్రధారిగా భావిస్తున్న అభిషేక్ కొలవాడే నుంచి పోలీసులు సొమ్ము స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. రిపబ్లిక్ నెట్ వర్క్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఘన్ శ్యామ్ సింగ్ ను విచారించిన పోలీసులు ఆయన ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటానికి ప్రోత్సహిస్తున్నది రిపబ్లిక్ టీవీ సీవోవో ప్రియా ముఖర్జీ అని ధ్రువీకరించుకున్నారు. అయితే ఈ ఆదేశాలు ప్రియా ముఖర్జీకి వస్తున్నది సీఈవో ఖాన్ చందానీ నుంచేనని విచారణలో తేలినట్టు పోలీసులు ప్రకటించారు.
అయితే, చానల్ అధిపతి ఆర్ణబ్ గోస్వామి అనేక విషయాలలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తలపడుతుండటం వల్లనే ఉద్దేశపూర్వకంగా రిపబ్లిక్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని ఖాన్ చందాని తరఫు న్యాయవాది వాదించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ముంబయ్ సెషన్స్ కోర్టులో విచారణకు వస్తుండగా ఒకరోజు ముందుగా కావాలనే ఆదివారం నాడు అరెస్ట్ చేశారని కూడా ఆరోపించారు.
ఎంపిక చేసిన ఇళ్లలో బార్క్ సంస్థ తరఫున బారోమీటర్లు ఏర్పాటు చేసే హన్సా రీసెర్చ్ ద్వారా బార్క్ దాఖలు చెసిన పిటిషన్ మీద ముంబయ్ పోలీసులు స్పందించి ఈ కుంభకోణాన్ని గత అక్టోబర్ లో వెలికి తీశారు. ఈ వ్యవహారం దర్యాప్తు జరిపేకొద్దీ అనేక విషయాలు బైటపడ్డాయి. మొత్తం 140 మంది సాక్షులను చార్జ్ షీట్ లో చేర్చారు. అందులో బార్క్ సభ్యులు, ఫోరెన్సిక్ ఆడిటర్లు కూడా ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here