ట్రాయ్: కొత్త చైర్మన్ కు సవాళ్ల స్వాగతం

0
515

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కి ఐదేళ్ల తరువాత కొత్త చైర్మన్ వచ్చారు. 2015లో మూడేళ్ళ పదవీకాలానికి ఎంపికైన రామ్ సేవక్ శర్మ 2018 లో పదవీవిరమణ చేయాల్సి ఉండగా సరిగ్గా ఒకరోజు ముందు ఆయనకు పొడిగింపు వచ్చింది. “మూడేళ్ళు లేదా 65 ఏళ్ళు నిండటంలో ఏదై ముందయితే అది” అనే నిబంధన కింద ఆయన 65 ఏళ్ళు నిండటం వల్ల ఈరోజు ( సెప్టెంబర్ 30) తో పదవీ విరమణ చేస్తుండగా ఆయన స్థానంలో పిడి వాఘేలా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1986 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐ ఎ ఎస్ అధికారి అయిన వాఘేలా ప్రస్తుతం ఫార్మాసూటికల్ డిపార్ట్ మెంట్ లో కార్యదర్శిగా ఉన్నారు.

నియంత్రణా సంస్థగా ట్రాయ్ ఒక కఠినమైన నియంత్రణా వాతావరణానికి మద్దతు ఇస్తున్నదన్న ఆరోపణల మధ్య వాఘేలా ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. అటు టెలికామ్ రంగాన్ని, ఇటు బ్రాడ్ కాస్టింగ్ రంగాన్ని నియంత్రించే క్రమంలో ట్రాయ్ తన దృష్టిని ప్రధానంగా టెలికామ్ మీద సారించింది. బ్రాడ్ కాస్టింగ్ మీద సవతి తల్లిప్రేమ చూపించిందన్న పరిశ్రమ వర్గాల అభిప్రాయాన్ని పరిశీలకులు ఎంతోకాలంగా సమర్థిస్తున్నారు. అయితే, బ్రాడ్ కాస్ట్ రంగంలోని భాగస్వాములు దాదాపు అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సరైన న్యాయం జరగటం లేదని ఆరోపించటం మరో కోణం.

ఇలా ఉండగా వాఘేలా నియామకం వార్త వెలువడిన వెంటనే భారత సెల్యులార్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలుకుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రభుత్వం నుంచి, ట్రాయ్ నుంచి ఎప్పటిలాగానే మద్దతు కావాలని కోరుకుంటున్నట్టు కూడా అందులో పేర్కొన్నారు. సుస్థిరమైన నియంత్రణాపూర్వక వాతావరణం కొనసాగించాలని, అప్పుడే డిజిటల్ సేవారంగం ఎదుగుతుందని అభిప్రాయపడ్దారు.

డిమాండ్, సప్లై కి అనుగుణంగా మార్కెట్ శక్తులు తమ పాత్ర పోషించటానికి అవకాశమివ్వకుండా ట్రాయ్ చైర్మన్ గా ఉన్న ఆర్ ఎస్ శర్మ  నియంత్రణావిధానం అమలుచేశారన్నది పరిశ్రమ పరిశీలకుల అభిప్రాయం. నియంత్రణావిధానం సుస్థిరంగా ఉండటానికి ఆయన అనుసరించించి సరైన ధోరణి కాదనేది ఎక్కువమంది అభిప్రాయం.

ఈ ఏడాది బ్రాడ్ కాస్టర్లతో తలపడిన సన్నివేశాలు కూడా అందుకు ఉదాహరణలు. టారిఫ్ నిర్ణయం, పాకేజీలమీద ఆంక్షలు విధించాలనుకోవటం ద్వారా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు చానల్స్ సంఖ్య విషయంలో పరిమితి పెంచటం, ఒకటికంటే ఎక్కువ టీవీ కనెక్షన్లున్నవారికి ఊరట కల్పించటం లాంటి చర్యలు కేబుల్ ఆపరేటర్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.  అయినప్పటికీ, పంపిణీ సంస్థలైన కేబుల్, డిటిహెచ్ ఈ తాజా నియమాలు అమలు చేయగా బ్రాడ్ కాస్టర్లు ఒప్పుకోలేదు. అర్జెంటుగా స్టే కావాలంటూ బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెక్కగా ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here