శాటిలైట్ బ్రాడ్ బాండ్ చౌకగా అందటానికి సలహాలు కోరిన ట్రాయ్

0
718

మనకు బ్రాడ్ బాండ్ సేవలు పెద్ద ఎత్తున అందుతున్నది టవర్ల ద్వారా వచ్చే వైఫై సిగ్నల్స్ సాయంతోనే. మనం ఫోన్లలో వాడుకునే ఇంటర్నెట్ అందేది ఇదే పద్ధతిలో. అయితే, వైర్ ద్వారా అందే ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ మొత్తం డేటా వాడుకునే అవకాశం ఉంది. వైఫై ద్వారా కూడా టవర్లు అందుబాటులో ఉండే చోట తప్ప మారుమూల ప్రాంతాలకు సిగ్నల్స్ అందే అవకాశం లేదు. అదే విధంగా కేబుల్ కూడా ఎక్కువమంది తీసుకునే అవకాశం ఉంటేనే మారుమూల ప్రాంతాలకు వెళుతుంది.

ఈ పరిస్థితిల్లో శాటిలైట్ ద్వారా అన్ని ప్రాంతాలక్లూ ఇంటర్నెట్ అందించేందుకు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. కానీ శాటిలైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ అనేది చాలా ఖరీదైన వ్యవహారం. అంతిమ వినియోగదారుడు దాన్ని ఎంతమేరకు వడుకోగలుగుతాడన్నది పెద్ద ప్రశ్న. అందుకే ఈ ధరలను ఏ మేరకు తగ్గించి చందాదారుకు అనుకూలంగా మార్చటానికి వీలుంటుందన్న విషయం మీద అభిప్రాయాలు, సూచనలు, సలహాలు సేకరించటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నడుం బిగించింది. ఈ క్రమంలోనే ఒక చర్చాపత్రం విడుదలచేసింది. ఏప్రిల్ 9 లోగా అభిప్రాయాలు తెలియజేయాలని, వాటిమీద ఇంకేవైనా వ్యాఖ్యలు ఉంటే ఏప్రిల్ 23 వరకు అవకాశముంటుందని ప్రకటించింది. చర్చాపత్రం పూర్తిపాఠం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయవచ్చు:
https://www.trai.gov.in/sites/default/files/CP_12032021.pdf

“శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం అందించే వీలుంటుంది. భౌగోళికంగా చేరుకొవటం కూడా కష్టమయ్యే ప్రాంతాలకు సైతం ఇది అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వస్తున్న మార్పుల ఫలితంగా తక్కువ బిట్ రేట్ వాడకం విధానాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటికి చాలా తక్కువ ఖర్చవుతుంది. సిగ్నల్ బదలీ సమర్థంగా ఉండటమే కాకుండా ప్రసారంలో నాణ్యత నష్టం కనీస స్థాయిలో ఉంటుంది.” అని ట్రాయ్ తన చర్చాపత్రంలో పేర్కొంది.

అయితే, అదే సమయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న అవరోధాలని సైతం ట్రాయ్ ప్రస్తావించింది. శాటిలైట్ బాండ్ విడ్త్ సంపాదించుకోవటానికి చాలా ఆలస్యం కావటం, అనేక నియమనిబంధనలు అడ్డురావటం వంటి అవరోధాల గురించి గుర్తు చేసింది. ఆమోదం పొందటానికి అనేక సంస్థల దగ్గరికి వెళ్లాల్సి రావటాన్ని కూడా గుర్తు చేసింది. ఈ రంగంలోకి కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించటానికి, వ్యాపారాన్ని సరళతరం చేయటానికి, సింగిల్ విండో విధానం అమలు చేయటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో సూచించాలని కూడా ట్రాయ్ ఈ రంగంలోని భాగస్వాములందరికీ విజ్ఞప్తి చేసింది.

శాటిలైట్ బ్రాడ్ బాండ్ పంపిణీదారులకు మళ్లీ కొత్త లైసెన్సులు ఉండాలా, ఇంతకుముందు టెలికామ్ లైసెన్సుల నియమాలలో కొద్దిపాటి సవరణలు చేస్తే సరిపోతుందా అనే విషయాలమీద కూడా అభిప్రాయాలు కోరింది. భారత్ లో ఉపగ్రహ ప్రయోగానికయ్యే ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ అయినప్పటికీ లైసెన్సింగ్ నిబంధనలు, మరికొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బందికరం కావటంతో బాటు ధర విషయంలో చాలా ఆచితూచి అడుగేసే భారత ప్రజానీకం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని ట్రాయ్ భావిస్తోంది. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here