పే చానల్ ధరల పెంపు మీద మళ్ళీ మొదలైన చర్చ

0
2265

పే చానల్ ధరలమీద రెండేళ్ళుగా సాగుతున్న వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. టీవీ ప్రేక్షకులు కట్టే నెలవారీ చందా తగ్గించటానికి 2020 జనవరి 1 న ట్రాయ్ తీసుకున్న నిర్ణయం దాదాపు రెండేళ్ళపాటు కోర్టు కేసులతోనే ఆగిపోయింది. తీరా అమలు చేయటానికి వచ్చే సరికి బ్రాడ్ కాస్టర్లు తెలివిగా తమకు అనుకూలమైన ధరలు నిర్ణయించి ట్రాయ్ లక్ష్యాన్ని దెబ్బతీశారు. కేబుల్ టీవీ చందా ధరలు తగ్గకపోగా, ఇంకా పెరగటంతో ఏం చేయాలో ట్రాయ్ కి దిక్కు తోచలేదు. అదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ రావటంతో ఈ సమయంలో జనంలో వ్యతిరేకత రాకుండా వాయిదా వేశారు.

2020 జనవరి 1 న ట్రాయ్ ప్రకటించిన టారిఫ్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలైన కేబుల్ ఆపరేటర్లు, డీటీఎచ్ ఆపరేటర్లు జీ ఎస్టీ సహా నెలకు 154 రూపాయలు తీసుకొని 228 ఉచిత చానల్స్ ఇవ్వాలి. దీన్నే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజ్ (ఎన్ సి ఎఫ్) అంటారు. ఇలా అందుకునే వాటిలో 200 ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కాగా, 28 ప్రసార భారతి వారి డీడీ, కిసాన్, సంసద్ చానల్స్. అంతకు ముందు డీడీ చానల్స్ సహా 100 మాత్రమే ఉండగా ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువ చానల్స్ ఉచితంగా పొందే వీలుంది.

అదే సమయంలో ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఈ కనీస ధర మొదటి చానల్ కి రూ. 154 అయినా, ఆ తరువాత ప్రతి అదనపు టీవీ సెట్ కూ 61 రూపాయల చొప్పున కడితే సరిపోతుంది. పే చానల్ చందా మాత్రం ఎంచుకున్న చానల్స్ ను బట్టి దీనికి అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎమ్మెస్వోలు, డీటీఎచ్ ఆపరేటర్లు తమ ఆదాయానికి గండిపడినా సరే అమలు చేయటానికి ఒప్పుకున్నారు. కానీ పే చానల్ చందాల విషయంలోనే అసలు సమస్య వచ్చింది. బ్రాడ్ కాస్టర్లు టారిఫ్ ఆర్డర్ అసలు లక్ష్యానికి తూట్లు పొడిచారు. బ్రాడ్ కాస్టర్ల ప్రధాన అభ్యంతరం గరిష్ఠ చిల్లర ధర విషయంలోనే. బొకేలో చేర్చే పే చానల్ ధర గరిష్ఠంగా రూ.19 వరకు ఉండేలా మొదటి టారిఫ్ ఆర్డర్ లో చెప్పగా దానివల్ల వినియోగదారులమీద భారం ఎక్కువగా పడుతున్నట్టు ట్రాయ్ గుర్తించింది.
అందుకే రెండో టారిఫ్ ఆర్డర్ లో ఈ గరిష్ఠ చిల్లర ధరను రూ.12 కి తగ్గించింది. దీనికి విరుగుడుగా బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్స్ ను బొకే నుంచి తప్పించి సగటున 30% మేరకు వాటి ధర మునుపటికంటే కూడా ఎక్కువగా ఉండేలా నిర్ణయించారు.

బ్రాడ్ కాస్టర్లు జారీచేసిన రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ప్రకారం చూస్తే కేబుల్ బిల్లు సగటున నెలకు రూ.50 మేరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడ్డాయి. దీనివల్ల కొంతమంది చందాదారులు టీవీ వదిలేసి ఓటీటీకి వెళ్ళిపోయే ప్రమాదముందని కేబుల్, డీటీఎచ్ రంగాలు గుర్తించాయి. అదే సమయంలో ఉత్తరాదిన చాలామంది ఫ్రీడిష్ కోరుకోవచ్చు. మొత్తంగా చూసినప్పుడు ఇది కేబుల్ వ్యాపారం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కనెక్షన్లు తగ్గితే స్థానిక కేబుల్ ఆపరేటర్లకు ఖర్చు తగ్గకపోగా ఆదాయం పడిపోయి భారీగా నష్టపోతారు.

కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టయింది ట్రాయ్ పరిస్థితి. ఎటూ జవాబు చెప్పుకోలేని ఇరకాటంలో పడింది.ఇలా నవ్వులపాలైన ట్రాయ్ ఏం చేయాలో అర్థం కాక అమలు తేదీని రెండు సార్లు వాయిదా వేసింది. ఆ గడువు కూడా ఇప్పుడు ముగిసింది. చావు తప్పి కన్నులొట్టబోయిన ట్రాయ్ ఏదో రకంగా బ్రాడ్ కాస్టర్లతో రాజీపడే ఆలోచనలో ఉన్నట్టు అందరూ బాహాటంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే, మరీ అలా ఒప్పుకుంటే బాగుండదని ముందుగా ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు అనధికారికంగా సమావేశాలు జరిపిన ట్రాయ్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో బ్రాడ్ కాస్టర్లు, జాతీయ స్థాయి కార్పొరేట్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎం ఎస్ వో లు) స్వతంత్ర ఎమ్మెస్వోలు ఉన్నారు.

ఈ కమిటీ సూచనల ప్రకారం ట్రాయ్ తాజాగా మే 7 న చర్చాపత్రం విడుదల చేసింది. ఈ వ్యవహారంలో భాగస్వాములైన పే చానల్ యజమానులు, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీఎచ్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లతో బాటు టీవీ వినియోగదారులు కూడా తమ అభిప్రాయాలను ట్రాయ్ కి మే 30 లోగా advbcs-2@trai.gov.in లేదా jtadvbcs-1@trai.gov.in కు ఈ-మెయిల్ ద్వారా పంపాలి. పే చానల్ గరిష్ఠ చిల్లర ధర ఎంత ఉండాలి, బొకేలో పెట్టే పే చానల్స్ ధర ఎంత ఉండాలి, బొకే మీద డిస్కౌంట్ ఎంతవరకు ఉండవచ్చు అనే విషయాలమీద అభిప్రాయాలు సేకరించి వాటిని ట్రాయ్ వెబ్ సైట్ లో ఉంచుతుంది. వాటిమీద స్పందించేవారికి జూన్ 6 వరకు అవకాశం కల్పిస్తారు. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ట్రాయ్ కొత్త ధరలమీద నిర్ణయం తీసుకుంటుంది. పూర్తి చర్చాపత్రం కోసం https://www.trai.gov.in/sites/default/files/CP_07052022.pdf లింక్ క్లిక్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here