కొత్త టారిఫ్ ఆర్డర్ ను సమర్థించుకున్న ట్రాయ్

0
1077

సుప్రీంలో కౌంటర్ పే చానల్స్ గరిష్ఠ చిల్లర ధర పరిమితి రూ. 12 కు కుదించటం, బొకేల విషయంలో జంట నియమాలు విధించటం వలన అనుచితమైన బొకేలు తయారు చేయకుండా బ్రాడ్ కాస్టర్లను అడ్డుకోవటం కోసమేనని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) స్పష్టం చేసింది. రెండో టారిఫ్ ఆర్డర్ మీద బొంబాయ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బ్రాడ్ కాస్టర్లు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. బ్రాడ్ కాస్టర్లు కేవలం లాభాలు పెంచుకోవటమే లక్ష్యంగా బొకేలు చేస్తున్నారని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ నిరుడు జనవరి 1 న ఎన్టీవో 2.0 పేరిట జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ మీద బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బొకేలమీద ఇచ్చిన జంట షరతులలో ఒకటి మినహా మిగిలిన నిబంధనలన్నిటినీ బొంబాయ్ హైకోర్ట్ సమర్థించింది. ప్రజాప్రయోజనాలకోసం టారిఫ్ నిర్ణయించే అధికారం నియంత్రణాసంస్థగా ట్రాయ్ కి ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది. 2017 లో టారిఫ్ ఆర్డర్ ఒక పెనుమార్పు కాగా 2020లో కొద్దిపాటి మార్పులు చేసినట్టు ట్రాయ్ పేర్కొంది. అయితే ఈ మార్పులు చాలా దారుణమైనవిగాను, సమూలమైన మార్పులు గాను బ్రాడ్ కాస్టర్లు అభివర్ణించారు. అయితే ఇవన్నీ సత్యదూరమైన ఆరోపణలేనని ట్రాయ్ తన కౌంటర్ అఫిడవిట్ లో వివరించింది. అదేపనిగా దుర్వినియోగం చేస్తున్న 2017 నాటి నిబంధనలలో కొన్నింటిని మాత్రమే సవరించామని, అది కూడా ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేయటం కోసమేనని పేర్కొంది. ఆచరణలో ఎదురైన అనుభవంతో ఇలాంటి సవరణ అనివార్యమైనట్టు కూడా అందులో పేర్కొంది. ప్రధానంగా ట్రాయ్ చేసిన మార్పులలో మొదటిది బొకేలో భాగమయ్యే ఏ చానల్ అయినా నిర్ణయించుకోవాల్సిన గరిష్ఠ ధర గతంలో నెలకు రూ.19 ఉండగా ఇప్పుడది రూ. 12 కు తగ్గించింది. ఇక రెండో మార్పు జంట నిబంధనలు విధించటం. ఈ జంట నిబంధనలలో రెండో దాన్ని బొంబాయ్ హైకోర్టు కొట్టేసింది. అనుచితమైన బొకేల తయారీని అడ్డుకోవటానికే ఇలాంటి నిబంధనలు పెట్టాల్సి వచ్చినట్టు ట్రాయ్ సుప్రీంకోర్టుకు నివేదించింది. ప్రజలు తమకు నచ్చిన చానల్స్ ను మాత్రమే చూసే అవకాశం లేకుండా బ్రాడ్ కాస్టర్లు బొకేలు తయారు చేస్తున్నారని, దీనివలన తక్కువ చందాతో వైవిధ్యభరితమైన చానల్స్ ఎంచుకొని చూసే అవకాశం లేకుండా పోయిందని ట్రాయ్ తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. కేవలం ప్రకటనల ఆదాయం పెంచుకునే వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని ఇందులో స్పష్టం చేసింది. బ్రాడ్ కాస్టర్లకు చందాలు, ప్రకటనలు అనే రెండు మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుండగా అందులో మూడింట రెండొంతులు ప్రకటనల ద్వారానే వస్తుందని, అందువల్లనే ప్రకటనల ఆదాయం కోసం ప్రత్యేక దృష్టుపెడతాయని ట్రాయ్ వివరించింది. ఎంతమంది చందాదారులు ఉన్నారనేదాన్నిబట్టి ప్రకటనల ఆదాయం ఉంటుండిగానుక వీలైనంత మందిని చందాదారులుగా చేర్చుకోవటం మీదనే ఛాన్సల్ దృష్టి పెడతాయని పేర్కొంది. దాన్నే ఒక చానల్ కు ఉండే రీచ్ అని అంటారని కూడా ట్రాయ్ వివరణ ఇచ్చింది. “అధిక డిమాండ్ ఉండే పేరు మోసిన చానల్స్ కు దానికున్న ఆదరణ కారణంగా చందాదారులు వస్తారు. వాటిని ప్రత్యేకంగా జనంలోకి నెట్టాల్సిన అవసరం లేదు. వాటినే “డ్రైవర్ ఛానల్స్” అంటారు.అయితే, బ్రాడ్ కాసటర్లు ఏమంత ప్రజాదరణలేని తమ ఇతర చానల్స్ ను కూడా ఏదో విధంగా అంటగట్టాలనుకుంటారు. ఆ విధంగా చందాదారుల సంఖ్య పెంచుకుంటారు. ఎంతమంది ఎక్కువ చందాదారులున్నట్టు చెప్పుకుంటే ప్రకటనల ఆదాయం అంత ఎక్కువ వస్తుంది. “ అని ట్రాయ్ ఈ కౌంటర్ ఆఫిడవిట్ లో వివరించింది. బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్ తో మిగిలిన చిన్నాచితకా చానల్స్ ను కలిపి ప్రేక్షకులకు ఇష్టం లేకపోయినావాటికి కూడా చందాదారులను చేస్తున్నారని ట్రాయ్ గుర్తించింది. మామూలుగా అయితే ఆ చానల్ కు చందా కట్టటం ఇష్టం ఉండని చందాదారులు కూడా బొకే లో పెట్టిన చానల్స్ అన్నీ తీసుకునేలా అలా కార్టే ధరల కంటే బొకే మెరుగనిపించేలా చేస్తున్నారని కూడా తేలిపోయింది. ఈ పద్ధతిలో కృత్రిమంగా విడి ధర పెంచి బొకే ఆకర్షణీయంగా తయారు చేస్తారని. దానివల్ల భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్టు కనబడుతుందని ట్రాయ్ చెప్పింది. చాలా సందర్భాలలో మొత్తం బొకే ధర అందులోని ప్రధాన చానల్ కంటే తక్కువ అనిపించే స్థితికి చేరటం ఈ విధానానికి పరాకాష్ఠగా అభివర్ణించింది. చాలామంది చందాదారులు తమంతట తాము స్వేఛ్చగా ఎంచుకోవటం ఆ ధరల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బొకేల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా బొకే చందాలనే ఆధారంగా చూపించి బ్రాడ్ కాస్టర్లు దాన్ని ప్రేక్షకాదరణగా చెప్పుకుంటున్నారని ట్రాయ్ వివరించింది. ఈ విధానాన్ని వివరిస్తూ, బ్రాడ్ కాస్టర్లు ఒకటో రెండో పేరున్న చానల్స్ కు కృత్రిమంగా అత్యధిక ధర నిర్ణయించి దానికి చందా కట్టటానికి ప్రేక్షకుడు వెనకడుగేసేటట్టు చేస్తున్నారు. ఆ తరువాత అలాంటి పేరున్న చానల్ ను బొకేలో కలిపి చాలా తక్కువ ధరకే ఇవ్వజూపుతున్నారు. ఆ విధంగా ఒంటరి చానల్స్ ఎంచుకోకుండా బ్రాడ్ కాస్టర్లు జాగ్రత్త పడుతున్నారని చెప్పింది. ఇలాంటి ఉద్దేశపూర్వకమైన ధర విధానాన్ని గతంలో మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టి న విషయాన్ని ట్రాయ్ తన కౌంటర్ అఫిడవిట్ లో గుర్తు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here