బేస్ పాక్ నుంచి స్టార్ చానల్స్ తొలగించిన తమిళనాడు ఎమ్మెస్వోలు

0
1023

తమిళనాడులోని ప్రధాన ఎమ్మెస్వోలు ఈ రోజు ( ఏప్రిల్ 7) నుంచి తమ బేసిక్ పాక్ లో నుంచి స్టార్ వాల్యూ పాక్ ను తొలగించాయి. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఇళ్ళలో బేస్ పాక్స్ లో స్టార్ విజయ్, స్టార్ స్పోర్ట్స్ మాయమయ్యాయి. ఒకవైపు సన్ టీవీ కి దీటుగా ఎదుగుతూ, ఈ వారం టాప్ 5 ప్రోగ్రామ్స్ లో 3 తనవే అని గర్వంగా చెప్పుకుంటున్న స్టార్ విజయ్ కి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎన్టీవో 3.0 లో పెంచిన ధరల విషయంలో ఒప్పందానికి రాలేకపోవటమే ఎమ్మెస్వోల నిర్ణయానికి కారణం. తమిళనాడులో పేరుమోసిన ఎమ్మెస్వోలు టీసీసీఎల్, వికె డిజిటల్, ఎస్ సివి ( సం గ్రూప్) ఈ నిర్ణయం ప్రకటించాయి.

డిస్నీ స్టార్ వారి స్టార్ వాల్యూ పాక్ లో కీలకమైన ఎంటర్టైన్మెంట్ చానల్ స్టార్ విజయ్ తో బాటు స్టార్ స్పోర్ట్స్ తమిళ్ నేషనల్ జాగ్రఫిక్, హంగామా ( తమిళ డబ్బింగ్ చానల్) కూడా ఉన్నాయి. ఎన్టీవో 3.0 లో భాగంగా డిస్నీ స్టార్ తన చానల్స్ ధరలు పెంచటాన్ని ఈ ఎమ్మెస్వోలు వ్యతిరేకిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అందిన సమాచారాన్ని బట్టి డిస్నీ స్టార్ సంస్థ తన స్టార్ వాల్యూ పాక్ ధరను రూ.29 నుంచి రూ.45 కు పెంచింది. అంటే, దాదాపు 55% పెరుగుదల. దీన్ని ఎమ్మెస్వోలు ఒప్పుకోవటం లేదు. చర్చలు జరిపినా, ఫలితం కనబడలేదు. దీంతో ఈరోజు ( 7 వ తేదీ) ఉదయం నుంచి ఎమ్మెస్వోలు తమ బేసిక్ పాక్ నుంచి స్టార్ వాల్యూ పాక్ ను తొలగించాలని నిర్ణయించుకున్నారు.

తమిళనాడులో ప్రధానమైన ఎమ్మెస్వోలు టీసీసీఎల్ (29 లక్షలు), వికె డిజిటల్ (16 లక్షలు), సుమంగళి కేబుల్ విజన్ – ఎస్ సి వి (20 లక్షలు) కనెక్షన్లతో మొత్తం 65 లక్షల ఇళ్ళకు చేరుతున్నాయి. తమిళనాడులో కోటి కేబుల్ ఇళ్ళు ఉండగా వీటివాటా మూడింట రెండొంతులు ఉంది. అయితే, ఎన్టీవో 3.0 నిబంధనల ప్రకారం చందాదారులు అ లా కార్టే లో చానల్స్ ఎంచుకునే అవకాశం ఉంది. బేసిక్ పాక్ నుంచి ప్రధానమైన స్టార్ విజయ్, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ను తొలగించటం వలన దాని ప్రభావం రేటింగ్స్ మీద చాలా ఉంటుంది. అందువలన డిస్నీ స్టార్ యాజమాన్యం మళ్ళీ చర్చలకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనావేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here