కేబుల్ పరిశ్రమను మరచిన తెలంగాణ లాక్ డౌన్ జీవో

0
1232

తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధిస్తూ 2021 మే 11వ తేదీతో తెలంగాణ రాష్ట ప్రభుత్వం జారీచేసిన జీవో నెం. 102 కేబుల్ పరిశ్రమలోని సిబ్బందికి మినహాయింపు ఇవ్వటం మరచిపోయింది. ఈ జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రమంతటా బుధవారం ఉదయం 10 గంటలనుంచి పది రోజులపాటు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 వరకు నాలుగు గంటల సమయం మాత్రమే నిబంధనలు వర్తించవు.
లాక్ డౌన్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలలో భాగంగా 20 రకాల కార్యకలాపాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. అందులో వ్యవసాయ కార్యకలాపాలు, ఉపాధిహామీ పథకం పనులు, పెట్రోల్ పంపులు, విద్యుత్ సరఫరా, పత్రికలు, టీవీ, నిర్మాణ రంగ కార్యకలాపాలు లాంటివి మినహాయింపు పొందినవాటిలో ఉండగా టీవీ ఉన్న ఇళ్లకు నిరంతరాయం ప్రసారాలు అందించటానికి కృషి చేసే కేబుల్ టీవీ సిబ్బందిని మాత్రం అందులో చేర్చలేదు.
నిరుడు కరోనా లాక్ డౌన్ సమయంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా కేబుల్ టీవీ రంగానికి విజ్ఞప్తి చేస్తూ టీవీ ప్రసారాలు నిరాటంకంగా అందించేందుకు కృషి చేయాలని పిలుపునివ్వటం తెలిసిందే. ఆ విధంగా ప్రజలు ఇళ్ళకే పరిమితమై లాక్ డౌన్ ను విజయవంతం చేస్తారని పేర్కొంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ జీవోలో మాత్రం కేబుల్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వటం మరచిపోయింది. ప్రభుత్వం ఈ పొరపాటును గ్రహించి మార్గదర్శకాలను మార్చి కేబుల్ టీవీ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వటం ద్వారా పోలీసులకు కూడా తగిన ఆదేశాలు అందుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here