ఓటీటీ విషయంలో బ్రాడ్ కాస్టర్ల మీద చర్యలు వద్దు: ట్రాయ్ ని ఆదేశించిన టీడీశాట్

0
628

సాధారణ శాటిలైట్ చానల్స్ ను ఓటీటీ వేదికల మీద పునఃప్రసారం చేస్తూ, ఆ సమాచారాన్ని అందించకపోవటం పట్ల బ్రాడ్ కాస్టర్లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ప్రశ్నించటం తెలిసిందే. అయితే అలాంటి బ్రాడ్ కాస్టర్ల మీద చర్యలకు పూనుకోవటం లేదా వత్తిడి తీసుకురావటం చేయవద్దని టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టీడీశాట్)ఆదేశించింది.
టీవీ ప్రసారాలను ఏ మాధ్యమం ద్వారా తమ సొంత వేదికలమీద, మూడో వేదికమీద ఎలా స్ట్రీమింగ్ చేస్తున్నారో తెలియజేయాలని ట్రాయ్ రాసిన లేఖ మీద బ్రాడ్ కాస్టర్లు అభ్యంతరం తెలియజేస్తున్నారు. అసలు ఓటీటీ మీద ట్రాయ్ కి ఎలాంటి అధికారపరీదహీ లేదంటూ సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ( ఎస్ పి ఎన్ ఐ) , సన్ టీవీ నెట్ వర్క్ టీడీశాట్ జోక్యం కోరాయి.
సోనీ, సం లేవనెత్తిన ఈ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దీనిమీద సమాధానం ఇవ్వటానికి ట్రాయ్ కి టీడీశాట్ మూడు వారాల సమయం ఇచ్చింది. తిరిగి జనవరి 24 న విచారణ చేపట్టాలని టీడీశాట్ నిర్ణయించింది. ఆరోజు తాత్కాలిక ఊరటానిచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పింది. ఈ లోగా బ్రాడ్ కాస్టర్లు ఓటీటీ మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తాము బ్రాడ్ కాస్టర్లు అయినా, కాకపోయినా ఓటీటీ వేదిక అనేది ట్రాయ్ పరిధిలో లేనిది కాబట్టి దాన్ని గురించి తమను అడిగే అధికారం ట్రాయ్ కి లేదని సోనీ, సన్ తమ పిటిషన్ లో వాదించాయి. తమకు అనేక పంపిణీ మార్గాలుండగా అందులో ఓటీటీ కూడా ఒకటని స్పష్టం చేశాయి. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 37 కింద తాము ప్రసారాలను ఓటీటీ వేదికలకు అందిస్తున్నామని, ఆ సెక్షన్ ప్రకారం బ్రాడ్ కాస్టింగ్ పునఃప్రసార హక్కులు తమకు ఉంటాయని ఆ చానల్స్ స్పష్టం చేశాయి. పైగా, ఆ పునఃప్రసారానికి తాము ట్రాయ్ నియంత్రించే శాటిలైట్స్ లేదా ఇంకేవైనా మౌలిక సదుపాయాలను వాడుకోవటం లేదని, అందువల్ల ఈ సమాచారాన్ని ఆడిగే అర్హత ట్రాయ్ కి లేదని స్పష్టం చేశాయి.
అయితే, ట్రాయ్ మాత్రం బ్రాడ్ కాస్టర్లు గానే వారికి నోటీసులకు జారీచేశాం తప్ప ఓటీటీ వేదికలుగా కాదని వాదించింది. బ్రాడ్ కాస్టర్ల నుంచి సమాచారం కోరే హక్కు తనకున్నదని, ఏదైనా అతిక్రమణ జరిగిందేమో తెలుసుకోవటానికి ఆలా అడగటం తప్పు కాదని సమర్థించుకుంది. డీకోడర్ బాక్స్ లేకుండా బ్రాడ్ కాసటర్లు తమ ప్రసారాలను ఓటీటీలకు ఎలా ఇస్తున్నారని మాత్రమే ప్రశ్నించామంది. పునఃప్రసారానికి వాడుతున్న నెట్ వర్క్ నిర్మాణం చెప్పవలసిందిగా కోరినట్టు గుర్తు చేసింది.
అయితే, అసలు బ్రాడ్ కాస్టర్లు ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరమేంటో చెప్పాలని ట్రాయ్ ని టీడీశాట్ ఎదురు ప్రశ్న వేసింది. ఒకవేళ బ్రాడ్ కాస్టర్లు ఏదైనా సమాచారం ఇచ్చినా దానిలో విపరీతార్థాలు తీసి తనకు నచ్చిన అభిప్రాయానికి రావటానికి ట్రాయ్ కి అవకాశముందని కూడా టీడీశాట్ అభిప్రాయపడింది. నిజంగా బ్రాడ్ కాస్టర్లు డౌన్ లింకింగ్ మార్గదర్శకాలలోని 5.6 వ క్లాజును ఉల్లంఘిస్తున్నట్టు తేల్చాలనుకుంటే తనదైన పద్ధతిలో నిర్థారించుకోవచ్చునని చెప్పింది. ఓటీటీ నియంత్రణ తన పరిధిలో లేదని స్వయంగా ట్రాయ్ కూడా చెప్పుకున్నందున ఈ సమాచారం అడిగే హక్కు ట్రాయ్ కి లేదని టీడీశాట్ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here