ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షునిగా సూర్యనారాయణ

0
948

కేబుల్ రంగంలో మూడుదశాబ్దాలకు పైగా అనుభవంతో బాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ పరిశ్రమకు నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన శ్రీ కె సూర్యనారాయణరావు (సూరి) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఎన్నికైన ఆయన ఈ పదవిలో రెండేళ్ళపాటు కొనసాగుతారు.
ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ రాకముందే దూరదర్శన్ ప్రసారాలు సైతం సరిగా అందని రోజుల్లో 1987 లోనే పులివెందులలో ఉదయ్ కమ్యూనికేషన్ పేరిట ఆయన కేబుల్ ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత శాటిలైట్ చానల్స్ ఊపందుకున్న నేపథ్యంలో తెలుగు శాటిలైట్ చానల్స్ ప్రారంభమైన 1995 లో కడపలో ప్రవేశించి కడప పబ్లిక్ చానల్ పేరుతో కేబుల్ టీవీ ప్రసారాలను, నెట్ వర్క్ ను విస్తృతం చేశారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ డిజిటల్ హెండ్ ను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ రంగ సంక్షేమం కోసం కృషి చేసిన కొద్ది మందిలో శ్రీ సూర్యనారాయణ ఒకరు. ఉపాధ్యక్షునిగా, కార్యదర్శిగా ఆయన సంఘ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సమస్యల మీద పోరాడారు. మరోవైపు జర్నలిస్టులకూ తలలో నాలుకగా ఉంటూ దాదాపు దశాబ్ద కాలంగా కడప ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సేవలందిస్తూ వస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తా
కేబుల్ రంగ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని సూర్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్ది రామచంద్రారెడ్ది, పేర్ని నాని, కొడాలి నాని తో ఒక కమిటీని నియమించిందని వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుంది గనుక ఆ కమిటీ ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రధానంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు వేస్తున్న కేబుల్స్ కారణంగానే విద్యుత్ సిబ్బంది సేవలకు అంతరాయం కలుగుతున్నదని, దానివలన కేబుల్ రంగం సైతం ఇబ్బందుల్లో పడుతున్నందున దీనికి పరిష్కారం కనుక్కోవటానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. కేబుల్ ఆపరేటర్లమీద పోల్ టాక్స్ లేకుండా ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
ఎపి ఎస్ ఎఫ్ ఎల్ కు గౌతం రెడ్డి చైర్మన్ గా నియమితులు కావడాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశామన్నారు. కేబుల్ పరిశ్రమ గురించి పూర్తి అవగాహన ఉన్నందున సంస్థ పరిధిలోని ఆపరేటర్లకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ సేవలందించే అవకాశాన్ని కేబుల్ ఆపరేటర్లు కూడా అందిపుచ్చుకొని లాభపడేలా కృషి చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here