కారుచౌక డిటిహెచ్ గా సన్ డైరెక్ట్ కొత్త ప్లాన్

0
3531

20129 లో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టారిఫ్ ఆర్డర్ ప్రకటించినప్పుడు అటు ట్రాయ్ తో బాటు ఇటు ప్రేక్షకులు కూడా కేబుల్, డిటిహెచ్ నెలవారీ చందాలు బాగా తగ్గుతాయని ఆశించారు. చానల్స్ ఎంచుకునే అవకాశం కల్పించిన డిజిటైజేషన్ అమలు కారణంగా నెలవారీ చందా అందుబాటులో ఉంటుందనుకున్నారు. కానీ వాస్తవంగా జరిగింది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

కేబుల్ కావచ్చు, డిటిహెచ్ ఆపరేటర్ కావచ్చు, బ్రాడ్ కాస్టర్ కావచ్చు… అందరూ ఎవరికి వాళ్ళే ధరలు పెంచేసి కూర్చున్నారు. ఇది ట్రాయ్ నిర్వాకం వల్లనే జరిగింది. అందరికీ న్యాయం చేస్తున్నట్టు చెప్పుకున్న ట్రాయ్ కొందరికి ఒక న్యాయం, ఇంకొందరికి ఒక న్యాయం, మరికొందరికి మరోన్యాయం వర్తింపజేసి వాళ్లలోనూ అసంతృప్తి నింపింది. చివరగా కొత్త టారిఫ్ ఆర్డర్ వలన చందాదారుడు మొత్తం భారం భరించకతప్పలేదు.

అయితే, ఇదంతా అనూహ్యంగా కలిగిన ఫలితమే. ఒకవిధంగా చెప్పాలంటే, డిటిహెచ్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు ఒకే విధమైన ధర వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అంతకుముందు నాణ్యమైన ప్రసారాలకు తగినట్టుగా వసూలు చేస్తున్నామని చెప్పుకునే టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ లాంటి డిటిహెచ్ ఆపరేటర్లు కూడా తోటి టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ తో సమానంగా వసూలు చేస్తున్నామని గ్రహించారు. దిగువ, మధ్యతగరగి ఆదాయ వర్గాలకు సేవలందిస్తున్నామని చెప్పుకునే కేబుల్ ఆపరేటర్ల నెలవారీ చందా కూడా టాటా స్కై తో సమానంగా ఉన్నట్టు తేలింది.

ఇలాంటి పరిస్థితిలో కాస్త అందుబాటు ధరల్లో ఉన్నామని చెప్పుకునే ఈ సంస్థల చందాదారులు కూడా టాటా స్కై , ఎయిర్ టెల్ డిజిటల్ లాంటి ఆపరేటర్లవైపు మొగ్గు చూపటం మొదలుపెట్టారు. ధరలో తేడా లేనప్పుడు ప్రీమియం సంస్థలవైపు వెళ్లాలనుకోవటమే అందుకు కారణం. దీంతో కేబుల్ ఆపరేటర్లు, తక్కువ ధరకే ఇస్తూ వచ్చిన డిటిహెచ్ ఆపరేటర్ల మనుగడకు ఇది ప్రమాదకరంగా తయారైంది.

చందాదారుల అభిప్రాయం ఒక్కటే: ప్రీమియం సంస్థలైన టాటా స్కై లాంటి వారు అదే చందాకు నాణ్యమైన సేవలు, ఎక్కువ చానల్స్ అందిస్తున్నప్పుడు మరో చిన్న డిటిహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమున్నదనేది. ఉదాహరణకు టటా స్కై దగ్గర ప్రస్తుతం దాదాపు 592 చానల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 90 హెచ్ డి చానల్స్ కూడా ఉన్నాయి. అదే సన్ డైరెక్ట్ లో అయితే 457 చానల్స్ ఉండగా అందులో 73 హెచ్ డి చానల్;స్ ఉన్నాయి. డిష్ టీవీ లో 529 చానల్స్ ఉండగా వాటిలో 71 హెచ్ డి చానల్స్. మెట్రో నగరాలు మినహాయిస్తే, కేబుల్ ఆపరేటర్లు ఇస్తున్నది సుమారు 300-400 చానల్స్ కాగా అందులో దాదాపు 60 హెచ్ డి చానల్స్ ఉంటాయి.

అయితే, దేశమంతటా సేవలందించే సన్ డైరెక్ట్, డిష్ టీవీలతో పోల్చుకున్నప్పుడు కేబుల్ ఆపరేటర్లు కాస్త మెరుగైన స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం వారు స్థానిక అవసరాలను గుర్తించి స్థానిక చానల్స్ అన్నీ ఇవ్వటానికి ప్రాధాన్యం ఇవ్వటం. అస్సాం లో ఉన్న కేబుల్ ఆపరేటర్ 39 మలయాళం చానల్స్ ఇవ్వనక్కర్లేదు. అదే టాటా స్కై అయితే దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలి గనుక ఇవ్వక తప్పదు. సన్ డైరెక్ట్ లాంటి డిటిహెచ్ ఆపరేటర్ కూడా తన దగ్గర అన్ని చానల్స్ ఉన్నాయని చెప్పుకునేందుకైనా అన్నీ ఇవ్వలేకపోతే చందాదారుడు తన స్వేచ్ఛను వాడుకునేందుకు టాటా స్కై లాంటి డిటిహెచ్ ఆపరేటర్ వైపే మొగ్గుచూపుతాడు.

ధరల తగ్గింపు

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ధర సమస్య పరిష్కరించటానికి ముందుగా అడుగేసింది కేబుల్ ఆపరేటరే. కొత్త టారిఫ్ అమలుకావటం మొదలై ఆరు నెలలు గడిచే సరికి తమిళనాడు ప్రభుత్వానికి చెందిన అరసు కేబుల్ నెట్ వర్క్ కెపాసిటీ ఫీజును కేవలం రూ. 41 కి పరిమితం చేసింది. మిగిలినవాళ్ళు ఆ సమయంలో రూ. 153 (పన్నులు సహా) వసూలు చేస్తున్నారు. ఎందుకంటే, చందాదారులు అప్పటివరకూ కడుతూ ఉన్న నెలవారీ చందా రూ. 150 కి మించి కట్టటానికి ససేమిరా అంటున్నారు. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ అమలయ్యాక అది రూ. 250 కి పెరిగింది.

మరోవైపు సన్ దైరెక్ట్ లాంటి డిటిహెచ్ ఆపరేటర్లు అధికారికంగానే రూ. 153 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజుగా వసూలు చేస్తున్నారు. కానీ, కొన్ని పాకేజీలమీద కొద్దిపాటి డిస్కౌంట్ ప్రకటించారు. కానీ కేబుల్ అయినా, డిటిహెచ్ అయినా కనీస నెలవారీ చందా మాత్రం రూ. 150 గానే ఉండిపోయింది.

ఇప్పుడు కోవిడ్ సంక్షోభం కారణంగా చందాదారులు వీలైనంత చౌక ధరకు అందుబాటులో ఉన్న పాకేజ్ వైపు చూడటం మొదలుపెట్టారు. అందుకే సన్ డైరెక్ట్ ఒక్క సారిగా కనెక్షన్ నెలవారీ చదాను రూ.94.40 మేరకు హఠాత్తుగా తగ్గించింది. ఇంకోలా చెప్పాలంటే ఇకమీదట నెలకు రూ. 153 బదులు రూ. 59 మాత్రమే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ధరకు 148 ఉచిత చానల్స్ ( పే చానల్స్ కానివి ) చూసే వెసులుబాటు కలుగుతుంది)

కారుచౌక ఆఫర్

కొత్త ప్లాన్ వలన సన్ డైరెక్ట్ ఇప్పుడు అత్యంత చౌకధరలో అందుబాటులో ఉన్న డిటిహెచ్ పాకేజ్ గా మారుతుంది. భారతదేశంలొ ఇంతకంటే తక్కువ ధరకు ఇచ్చే డిటిహెచ్ ఆపరేటర్ మరొకరు లేరు. కనీసం ఒక చానల్ చూసినా రూ. 150 కట్టాల్సిన పరిస్థితిని మార్చేసి ఆకట్టుకునే విధంగా పాకేజ్ తయారుచేసింది. ధరే ప్రధానంగా చూసే దక్షణాది మార్కెట్, పశ్చిమ బెంగాల్ మార్కెట్ ను సన్ డైరెక్ట్ తన వ్యాపారానికి లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది.

ఇప్పుడు సన్ డైరెక్ట్ ప్రకటించిన రూ. 59 పాక్ లో 25 తమిళ చానల్స్, 21 మలయాళం చానల్స్, 14 తెలుగు చానల్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మిగిలిన డిటిహెచ్ ఆపరేటర్లందరూ తమ నెలవారీ చందాల విషయంలో పునరాలోచనలో పడాల్సివస్తున్నది. దేశంలో అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన డిటిహెచ్ కాబట్టి మిగిలిన డిటిహెచ్ ఆపరేటర్ల మీద వత్తిడి ఉండటం చాలా సహజం.

అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ తగ్గింపు వలన కేవలం అల్పాదాయ వర్గాలు మాత్రమే లాభపడతాయని అనుకోవటానికి వీల్లేదు. పే చానల్స్ కూడా ఎక్కువ చూడాలనుకునేవారు ఈ సబ్సిడీ ధర కారణంగా సన్ డైరెక్ట్ ను ఎంచుకొని మరిన్ని పే చానల్స్ చూడటానికి ఆ సబ్సిడీని వాడుకునే అవకాశముంది. సన్ డైరెక్ట్ అందించే చానల్స్ లో ఉచిత హెచ్ డి చానల్స్ ను ఎంచుకోవటం, పే చానల్స్ ను కూడా ఎంచుకోవటం ద్వారా నెలవారీ బిల్లును 200 లోపే ఉండేలా నియంత్రించుకోగలుగుతారు. అంటే, రూ. 300 కట్టేవాళ్ళు కూడా అవే చానల్స్ ను రూ.200 కే పొందగలుగుతారు.

ఉదాహరణకు తమిళ్ బేసిక్ పాకేజ్ ఎంచుకునే చందాదారుడు ఏడు చానల్స్ ఉన్న సన్ టీవీ బొకే తీసుకుంటే రూ. 59 ప్లస్ రూ, 47.20 చెల్లించాలి. అంటే, అతడి బిల్లు నెలకు రూ.106.20 మాత్రమే. అదే టాటా స్కై, డిష్ టీవీ లాంటి డిటిహెచ్ ఆపరేటర్ సేవలు వాడుకుంటున్న చందాదారుడు అయితే నెలకు రూ.200.60 కట్టాల్సిందే. ఇప్పుడు సన్ డైరెక్ట్ తీసుకున్న నిర్ణయం ప్రభావం ప్రధానంగా డిటిహెచ్ ఆపరేటర్లమీద బాగా వత్తిడి తెస్తుంది. ముఖ్యంగా డి2హెచ్ ఇప్పుడు దక్షిణాది మార్కెట్ లో సన్ డైరెక్ట్ ను డీకొడుతున్నది అదే కాబట్టి. ఎయిర్ టెల్ డిజిటల్ మీద కూడా కొంత ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది.

కేబుల్ ఆపరేటర్లమీద ప్రభావం

ఇక కేబుల్ ఆపరేటర్ల మీద ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టం. ఎందుకంటే, చాలామంది కేబుల్ ఆపరేటర్లు ఇప్పటికే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు తగ్గించి వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల అది రూ.50-100 మధ్య ఉంది. అయితే, వాళ్ళు కూడా స్థానిక పే చానల్స్ కలపటానికి కనీస మొత్తంగా రూ. 150 వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక కేబుల్ ఆపరేటర్లు / ఎమ్మెస్వోలు ప్రాథమికంగా వసూలు చేసే రూ.150 లోనే దాదాపు రూ. 50-90 విలువచేసే పే చానల్స్ కూడా కలిపి ఇస్తున్నారు. అందువలన వాళ్ళు ఇంతకంటే ధర తగ్గించే వీలు లేదు.

ఇప్పుడు సన్ డైరెక్ట్ ఇవ్వజూపుతున్న కొత్త పాకేజ్ వలన ధర విషయంలో మరీ గట్టిగా పట్టుబట్టే చందాదారుడు, ఉచిత వ్చానల్స్ మీదనే ఆధారపడదామనుకునే చందాదారుడు అటువైపు వెళ్ళవచ్చు. అలా ఎక్కువమంది చందాదారులు అటువైపు మొగ్గు చూపటం మొదలుపెడితే మాత్రం కేబుల్ ఆపరేటర్ల తమ చందాల విషయంలో పునరాలోచనలో పడక తప్పదు. నిర్వహణ ఖర్చులు ఉంటాయి గనుక వాళ్ళు అలా తగ్గించి రూ. 59 కే ఇవ్వటమన్నది అసాధ్యం.

డిటిహెచ్ లాగా కాకుండా, కేబుల్ ఆపరేటర్ కు నెలనెలా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. చందాదారుడు కేవలం ఉచిత చానల్స్ మాత్రమే చూస్తున్నప్పటికీ ఆపరేటర్ తన ఎమ్మెస్వోకు కూడా కొంత వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ నెలసరి చందా ( నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు) ను రూ. 59 కి ( రూ.50 ప్లస్ పన్ను రూ.9) తగ్గించిన పక్షంలోనూ ఎమ్మెస్వోకు పోగా ఆపరేటర్ కు మిగిలేది సుమారు రూ. 30-40 మాత్రమే. ప్రస్తుతం కేబుల్ ఆపరేతర్ కు రూ. 70 నుంచి 100 వరకు మిగులుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here