హాత్ వే రాజశేఖర్ కు సుభాష్ రెడ్డి ఘన నివాళి

0
1012

కేబుల్ రంగం ఎదుగుతున్న దశలో కీలకపాత్ర పోషించి హాత్ వే సంస్థ ద్వారా టీవీ రంగంలోని అందరికీ పరిచయమై, ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెస్వోల సంఘం నాయకునిగా పనిచేసిన హాత్ వే రాజశేఖర్ కన్నుమూసి నేటికి ఏడాది గడిచింది. కార్పొరేట్ సంస్థకు ప్రతినిధి అయినా, క్షేత్ర స్థాయి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆపరేటర్ల సంక్షేమం కోరుకున్నవాడు. అదే సమయంలో సొంత సంస్థ “వెంకట సాయి“ ద్వారా ఒక ఎమ్మెస్వోగా కూడా పనిచేశారు.

హాత్ వే రాజశేఖర్ గా అందరికీ, వెంకటసాయి రాజశేఖర్ గా మరికొందరికి బాగా పరిచయమున్న చెలికాని రాజశేఖర్
విజయనగరం జిల్లా సీతానగరంలో 1968 ఏప్రిల్ 4 న జన్మించారు. తొలిసారి విశాఖపట్నం లో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టి కొద్ది కాలంలోనే అంచలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్ లో హాత్ వే లో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. హాత్ వే ను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్ గా తీర్చిదిద్దారు.

ఆయన హాత్ వే రీజినల్ హెడ్ గా ఉన్నకాలంలో హాత్ వే ను తిరుగులేకుండా చేయడంలో ఆయనదే. నంబర్ వన్ ఎమ్మెస్వోగా నిలపటంతో ఆయన ఉన్నతాధికారుల అభిమానం పొందుతూ ఆ స్థానంలో కొనసాగారు. హాత్ వే నుంచి వైదొలగిన తరువాత ఆయన తన సొంత నెట్ వర్క్ వెంకట సాయి మీడియా మీద దృష్టి సారించారు.

కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎమ్మెస్వో ల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం శ్రమించారు. ప్యాకేజి ల పేరుతో చానల్స్ ఎమ్మెస్వోలని వేధించిన సమయంలో రాజశేఖర్ అనేక ఆందోళనలు చేపట్టారు. మధ్యే మార్గంగా ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు లాభపడేలా చూశారు. జెమినీ పే చానల్ గా చేస్తున్న అరాచకాలమీద పెద్ద ఎత్తున పోరాటం నడపటంలో ఆయనదే కీలపాత్ర. ఒక దశలో మాటీవీ తో వివాదం ముదిరినప్పుడు మా టీవీ యాజమాన్యం ప్రేక్షకులను రెచ్చగొట్టి హాత్ వే మీదకు ఉసిగొల్పినా ఎమ్మెస్వో బలమేంటో చాటిచెప్పిన ఘనత కూడా ఆయనదే.

హైదరాబాద్ లో అత్యధిక కనెక్షన్లు ఉండటంతో టీవీ పంపిణీలో హాత్ వే తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చింది. ఆదాయ వనరులు అత్యధికంగా ఉండే హైదరాబాద్ లో చానల్ అందుబాటులో ఉండటమనేది ఎంతో కీలకంగా మారింది. ఆ పరిస్థితుల్లో హాత్ వే రాజశేఖర్ ను ప్రసన్నం చేసుకోవటానికి చానల్ యజమానులు ఎంతగా ఆరాటపడేవారో పరిశ్రమలో ఉన్నవారికి తెలియనిదేమీ కాదు.

రాజశేఖర్ కు చిన్నప్పటినుంచీ బాల్ బాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. హాత్ వే రీజినల్ హెడ్ గా ఉన్న సమయంలో అనేక బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్స్ ను ఆయన స్పాన్సర్ చేశారు. కొంతకాలం ఆయన రాష్ట్ర బాల్ బాడ్మింటన్ సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

డిజిటైజేషన్ మొదలయ్యేనాటికే రాజశేఖర్ తప్పుకొని సొంత పంపిణీ సంస్థ వెంకట సాయి మీద దృష్టిపెట్టారు. హైదరాబాద్ తో బాటు విజయవాడ, విశాఖపట్టణంలో కూడా నెట్ వర్క్ విస్తృతమై ఉన్నప్పటికీ కొంత కాలం దూరంగా ఉన్నారు. వ్యాపార కార్యకలాపాలకు అకస్మాత్తుగా దూరమైన రాజశేఖర్ అనూహ్యమైన పరిస్థితుల్లో మౌనంగా ఉంటూ నిరుడు ఇదే రోజున గుండెపోటుతో కన్నుమూశారు. యావత్ కేబుల్ పరిశ్రమ ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికింది.

ఉమ్మడి రాష్ట్రంలో కేబుల్ రంగానికి నాయకత్వం తీసుకొని ఈ రంగం ప్రాధాన్యాన్ని చాటి చెప్పి బ్రాడ్ కాస్టర్ల ముందు ఎమ్మెస్వోలు తలెత్తుకొని తమ గొప్పతనం చాటుకునేట్టు చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి మనకు దూరమై ఏడాది గడిచిన సందర్భంగా కేబుల్ పరిశ్రమ తరఫున, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ తరఫున ప్రథమ వర్ధంతి నివాళులర్పిస్తున్నాను.
ఎం. సుభాష్ రెడ్డి
ఎండీ, బ్రైట్ వే కమ్యూనికేషన్
అధ్యక్షుడు, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here