2022 జనవరిలో 16 కొత్త చానల్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన స్టార్ ఇండియా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదావేసింది. రెండో టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (ఆర్ ఐ వో) ప్రకటించినప్పుడే కొత్త చానల్స్ మీద కూడా స్టార్ ప్రకటన చేసింది. వాటిలో 15 పూర్తిగా కొత్త చానల్స్ కాగా ఒకటి మాత్రం పేరు మార్చిన చానల్. అయితే, ఇప్పుడు వాటి వాయిదా నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు పంపిణీ వేదికలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లకు ఈ తాజా సమాచారం అందించింది.
ఈ ఏడాది అక్టోబర్ లో కొత్త పే చానల్ ధరలతో రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ఇచ్చిన సందర్భంగా త్వరలో రాబోయే చానల్స్ వివరాలను కూడా ప్రకటించింది. ఈ ఆర్ ఐ వో డిసెంబర్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా అమలుకు ట్రాయ్ ఏప్రిల్ 1 వరకు గడువు పొడిగించటంతో స్టార్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకొని కొత్త వ్యూహంతో ముందుకు వచ్చే దిశలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
స్టార్ ప్రకటించిన కొత్త చానల్స్ లో స్టార్ గోల్డ్ రొమాన్స్, స్టార్ గోల్డ్ థ్రిల్స్, జల్సా జోష్, స్టార్ మూవీస్ సెలెక్ట్, సూపర్ హంగామా, స్టార్ గోల్డ్ 2 హెచ్ డి, స్టార్ స్పోర్ట్స్ తెలుగు హెచ్ డి, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ హెచ్ డి, డిస్నీ చానల్ హెచ్ డి, హంగామా హెచ్ డి, ప్రవాహ పిక్చర్స్ హెచ్ డి, ప్రవాహ పిక్చర్స్, విజయ్ సూపర్ హెచ్ డి, ఏషియానేట్ మూవీస్ హెచ్ డి, స్టార్ కిరణో. స్టార్ కిరణో హెచ్ డి. ఉన్నాయి. ప్రస్తుతం వెనక్కి తగ్గినా ఏప్రిల్ నాటికి వీటిని కూడా ప్రారంభించి రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ జారీచేసే అవకాశముంది.
