కౌన్ బనేగా కరోడ్ పతి-12 కు స్పాన్సర్ షిప్ సమస్య?

0
511

ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని నిలిచిన సోనీ టీవీ వారి కార్యక్రమాల్లో ముఖ్యమైనది కౌన్ బనేగా కరోడ్ పతి. భారతదేశంలో ఈ కార్యక్రమం ఇప్పటిదాకా 20 సీజన్లు పూర్తి చేసుకోగా సోనీలో ఇది పన్నెండో సీజన్. అన్ని వయోవర్గాలవారినీ ఆకట్టుకోగలగటం దీని ప్రత్యేకత. మెదడుకు మేత లాంటి ప్రశ్నలతో సాగుతూ ఏడాదికేడాదీ బహుమతి మొత్తాన్ని కూడా పెంచుతూ ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగూ మహానటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ఉండటం దీని స్థాయిని మరింత పెంచింది. ఈ ఏడాది కెబిసి మీద సోనీ ఇప్పటికే ప్రోమో విడుదల చేసింది.
అయితే, ఈ సంవత్సరం కెబిసి మాత్రం గడ్డుకాలం ఎదుర్కుంటోంది. పాల్గొనేవారి ఎంపిక విధానం మొత్తం కరోనా కారణంగా డిజిటల్ పద్ధతిలో సాగింది. అయితే షూటింగ్ జరిగే ప్రదేశం విజువల్స్ తో సోనీ విడుదలచేసిన ప్రోమో చూస్తే ఈ కార్యక్రమం షూటింగ్ సమయంలొ ప్రేక్షకులే ఉండబోరని తెలుస్తోంది. అయితే పాల్గొనేవారివెంట ఒక్క సభ్యుడు/సభ్యురాలు మాత్రం రావటానికి అనుమతి ఉంటుంది.
ఈ గేమ్ షోకి రెండు ప్రీమియం సహ సమర్పకులతో సోనీ ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. ఒకటి టాటా సాల్ట్ అయితే రెండోది వేదాంతు. ఇతర స్పాన్సర్ల కోసం వేట మొదలైంది. అయితే, మిగిలినవారి పేర్లేవీ ఇంకా వెల్లడి కాలేదు. సోనీ ప్రస్తుతం పది సెకెన్ల స్పాట్ కి రూ 4 లక్షల చొప్పున వసూలు చేస్తుంది. ఎస్ డి చానల్ లోనూ, హెచ్ డి చానల్ లోనూ ఆ యాడ్ ప్రసారమవుతుంది. కెబిసి కార్యక్రమం చాలా పేరిఉమోసినది కావటం వల్ల ధర తగ్గించకపోవచ్చునని, తగ్గించినా మహా అయితే ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ తగ్గింపు ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
నిరుడు పండుగ సీజన్ లో ప్రకటనలమీద పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే ప్రకటనదారులెవరూ 80 శాతం మించి ఖర్చుపెట్టే అవకాశం కనిపించటం లేదు. ఇంకోవైపు ఐపిఎల్ కూడా బడ్జెట్లను మింగేస్తోంది. ఇలాంటప్పుడు ఏ చానల్ కార్యక్రమానికైనా ఎంత వరకు ఖర్చుచేయాలన్నదానికి ఎన్నో పరిమితులు ఏర్పడ్డాయి. కెబిసి కి ప్రకటనల రేట్ కార్డ్ లో నిరుటి ధరలే ఉన్నాయి. పండుగల సమయంలోనే ఐపిఎల్ రావటం వలన ప్రస్తుత పరిస్థితులు బాగా మారిపోయాయి. అందువలన ప్రకటనల వ్యయమంతా కకావికలమవుతోంది.
కెబిసి ఎంత విజయవంతమైన కార్యక్రమమైనా, ఎంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్నా అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయటానికి క్లయింట్స్ సిద్ధంగా లేరు. అందుకే ఇంతకాలం కెబిసి వాయిదాపడుతూ వచ్చింది. కరోనా సంక్షోభం కారణంగా ఏ రియాల్టీ షో ప్రారంభించాలన్నా అదొక సవాలే. క్లయింట్స్ ఆచితూచి అడుగేస్తున్నారు. కోవిడ్ కేసులు ఇంకా పెరుగుతుండటం, ఐపిఎల్ సీజన్ తో పాటు పండుగలూ రావటం వలన టెలివిజన్ కి గడ్డుకాలమే ఎదురవుతున్నదనే నిరాశ మాత్రం తప్పటం లేదు. ఐపిఎల్ కనీసం 40 శాతం ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుందంటున్నారు. దీనివలన జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ప్రేక్షకాదరణ తగ్గుతుందని, మూజిక్, మూవీ చానల్స్ మాత్రమేప్రేక్షకాదరణ నిలబెట్టుకోగలుగుతాయని అంచనావేస్తున్నారు. పండుగ సీజన్ అంచనాలకు దగ్గరగానైనా లేకపోతే మొత్తం టీవీ రంగానికే హెచ్చరికలు వచ్చినట్టు. అదే జరిగితే ఈ ఏడాది మొత్తం టీవీ చానల్స్ కోలుకోనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here