ఒటిటి సిరీస్ గా హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్

0
589

1992 ఏప్రిల్ లో యావత్ భారత్ దేశాన్ని కుదిపేసిన స్టాక్ మార్కెట్ కుంభకోణం ఇప్పటికీ ఎవరూ మరచిపోనిది. దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే దేశ ఆర్థిక భద్రత విషయంలో నిర్మాణాత్మకమైన మార్పులు చేసి స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

అయితే, దీనివెనుక పనిచేసిన బుర్ర ఎలాంటిదన్నది పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ రోజుల్లోనే అంతకుముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో దాదాపు ఐదు వేలకోట్ల కుంభకోణంగా పేరుమోసిన ఈ వ్యవహారానికి కేంద్ర బిందువు హర్షద్ మెహతా. ఈ స్టాక్ బ్రోకర్ పుర్రెలోనుంచి పుట్టిన ఆలోచన, లక్షలాది మంది మధ్యతరగతి కలలను, ఆశలను ఆవిరి చేసిన తీరు ఇప్పటికీ చాలామంది తలుచుకుంటూనే ఉంటారు. అతగాడి ఆలోచనలు, అమలు తీరును అత్యంత ఉత్కంఠభరితంగా కళ్ళకు కట్టినట్టు చూపించే 10 భాగాల సిరీస్ సోనీలైవ్ ఒటిటి వేదికమీద ఈనెల 9న అందుబాటులోకి వస్తుంది.

ఒరిజినల్ కంటెంట్ అందించే కృషిలో భాగంగా తయారైన ఈ సిరీస్ వలన చందాదారులను మరింత పెంచుకోవచ్చునని సోనీ సంస్థ భావిస్తోంది. జర్నలిస్టులు దేబశిష్ బసు, సుచేతా దలాల్ రాసిన “ది స్కామ్ “ అన్ పుస్తకం ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ నిర్మించారు. స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ గా పేరుమోసిన హర్షద్ మెహతా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వేలకోట్ల కుంభకోణం నడిపి, ఎదిగిన తీరు, బాంకులను తనకు అనుగుణంగా మోసం చేసిన తీరు ఇందులో చూడవచ్చు.

జాతీయ స్థాయి అవార్డులందుకున్న సినీ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్ కి దర్శకత్వం నెరిపారు. ప్రతీక్ గాంధీ, శ్రేయా ధన్వంతరి, సతీశ్ కౌశిక్, షరీబ్ హష్మి, లలిత్ పరిమూ తదితరులు నటించారు. స్కామ్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉండటం వలన వ్యవస్థలో లోపాలను వాడుకునేందుకు ఎలాంటి వారు సిద్ధంగా ఉంటారో చెప్పటం ద్వారా ఇది ముందు జాగ్రత్తలు చెప్పేందుకు పనికొస్తుందని ఈ సిరీస్ డైరెక్టర్ హన్సల్ మెహతా అంటున్నారు.

సంక్లిష్టమైన సామాజిక, రాజకీయ కోనాలున్న చిత్రాల రూపకల్పనలో పేరుమోసిన హన్సల్ మెహతా గతంలో షాహీద్, అలీగఢ్ లాంటి చిత్రాల్లో కీలకంగా వ్యవహరించారు. 15 సినిమాలకు దర్సకత్వం వహించిన అనుభవం ఆయనకుంది. 1992 నాటి స్టాక్ మార్కెట్ కుంభకోణం తీవ్రతను తెరకెక్కించాల్సిన అవసరం ఉందని భావించటమే ఆయనను ఈ వైపు నడిపించింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here