చందాదారుల పట్ల ఎమ్మెస్వో, ఆపరేటర్ బాధ్యతలు

0
577

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రసారాలు ఆపేస్తే బాధ్యులెవరు? 24 గంటలకు మించి ప్రసారాలు అందకపోతే వినియోగదారుడికి నష్టం ఎవరు చెల్లిస్తారు? ఒక బొకే నుంచి ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని చానల్స్ నిలిపేస్తే ఎమ్మెస్వోకు బాధ్యత ఉండదా? టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సేవల నాణ్యత, వినియోగదారుడి రక్షణ కోసం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించింది. .పంపిణీ వేదికలైన డిటిహెచ్, హిట్స్, కేబుల్ టీవీ, ఐపిటీవీ లకు ఒకే రకమైన సేవల నాణ్యతా నిబంధనలు రూపొందించటమే దీని లక్ష్యం. ఆ విధంగా మెరుగైన పారదర్శకత ప్రదర్శించటానికి సాధ్యమవుతుందని ట్రాయ్ భావిస్తోంది.

చానల్ తొలగింపు

చాలా సందర్భాలలో ఎమ్మెస్వోలు ఒక బొకేలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చానల్స్ నిలిపివేయవచ్చు. కారణం ఏంటన్నది కూడా చందాదారుకు తెలియజేసే సందర్భాలు చాలా అరుదు. ఇలాంటి అనేక ఘటనలు ట్రాయ్ దృష్టికొచ్చాయి. మరికొన్ని సార్లయితే, తొలగించిన చానల్ స్థానంలో పంపిణీదారుడు తనకిష్టమైన మరో చానల్ చేరుస్తాడు. అప్పుడు కూడా చందాదారునికి తెలియజేయడు. అంటే చందాదారుకు ఎలాంటి హక్కులూ లేవన్నట్టుగానే పంపిణీదారుడు భావిస్తూ ఉంటాడు.

కానీ ప్రస్తుత డిజిటైజేషన్ యుగంలో మాత్రం పంపిణీదారుడు ఏదైనా చానల్ సర్వీసు నిలిపివేయబోతుంటే ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటించి చందాదారుకు తెలియజేయాలి. అదే సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా అదే తరహా చానల్ మరొకటి ఇవ్వజూపాలి. అప్పుడు కూడా చందాదారుకు తెలియజేసి, అతడి ఆమోదంతోనే ఆ పనిచేయాలి. అంటే ఏదైనా కారణం వలన జెమిని మ్యూజిక్ చానల్ ఇవ్వలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా అదే తరహా చానల్ అయిన మా మ్యూజిక్ ఇవ్వజూపవచ్చు. చందాదారుడు వద్దంటే అది ఇవ్వకూడదు. అంతే తప్ప ఏకపక్షంగా ఒక చానల్ కు బదులు మరో చానల్ ఇవ్వటం తగదు. ఇలాంటి సందర్భంలో ఆగిపోయిన చానల్ స్థానంలో ఇవ్వజూపిన చానల్ ను చందాదారు ఒప్పుకోకపోతే 24 గంటల తరువాత అలా ఆగిపోయిన చానల్ చందాను పంపిణీదారుడు తగ్గించి మాత్రమే వసూలు చేసుకోవాలి.

ఎంత తగ్గించాలనేది ఆ చానల్ ఉన్న బొకేలోని చానల్స్ అ లా కార్టే ధరల సగటు ధర మీద లెక్కగట్టాలి.  లేదా ఆ బొకే లోని చానల్స్  ధరకు నిష్పత్తి ప్రకారం అ లా కార్టే ధర లెక్కించాలి. అయితే, ఇలా నిలిపివేసిన చానల్ కు తగ్గించుకోవాల్సిన చందా ధర లెక్కింపు విషయంలో అటు పంపిణీదారుగాని, ఇటు చందాదారుగాని నష్టపోని విధంగా లెక్కగట్టే మార్గం నిర్ణయించవలసి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. అందరి ప్రయోజనాలూ కాపాడటమే లక్ష్యమని అభిప్రాయపడింది.

సేవలో అంతరాయం

సేవలలో అంతరాయం ఏర్పడినప్పుడు చందాదారుకు తగిన విధంగా నష్టపరిహారం అందే విధంగా చందాలో మినహాయింపు ఉండాలని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారంపంపిణీ సంస్థలు ముందుగా నిర్ణయించుకున్న నిర్వహణకు సంబంధించిన పనులకోసం ప్రసారాలు నిలిపివేసే పక్ష లో 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు సేవలు ఆగిపోతాయో, మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించబడతాయో కూడా తెలియజేయాలి. అయితే, చణ్దాదారు ఆవరణలోని పరికరాలో ఏదైనా సాంకేతిక వైఫల్యం ఏర్పడిన కారణంగా ప్రసారాలు ఆగిపోయి, పునరుద్ధరణకు 24 గంటలకు మిమ్చి సమయం పట్టే అవకాశం ఉంటే అలా పునరుద్ధరణ జరిగేదాకా చందా మొత్తాన్ని రద్దు చేయటం సమంజసమని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.

అయితే, ఈ పరికరాలను పంపిణీదారు నుంచి అద్దెకు తీసుకున్న పక్షంలో ఆ అద్దెను మినహాయించాల్సి ఉంటుంది. ఎంత గరిష్ఠ సమయం ప్రసారాలు అందకపోయినా పరిహారం చెల్లించకుండా ఉండవచ్చునని అనుకుంటున్నారో చెప్పాలని పంపిణీ సంస్థలను ట్రాయ్ అడుగుతోంది. ఎంత వ్యవధి తరువాత పరిహారం చెల్లిస్తారో ఇప్పుడు పంపిణీ సంస్థలు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంది. పంపిణీ సంస్థ లో లేదా చందాదారు ఆవరణలో సాంకేతిక లోపం కారణంగా సేవలు నిలిచిపోయిన పక్షంలో ఎంత సేపు సేవలు నిలిచిపోతే చందాదారుకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరమొస్తుంది, ఆ మొత్తాన్ని ఎలా లెక్కగట్టాలో చెప్పమని కూడా ట్రాయ్ కోరుతోంది.

అయితే కొన్ని అంశాలు సాంకేతికంగా సులభ సాధ్యం కావని, కొన్ని అంశాలు ఒక్కో పంపిణీ వేదికకు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి అన్నిటికీ కలిపి ఒకే విధానాన్ని రూపొందించటం సమస్య కావచ్చునని భావిస్తున్నారు. అలాంటప్పుడు సేవల నాణ్యత విషయంలో అన్ని వేదికలకూ ఒకే రకమైన ప్రమాణాలు నిర్దేశించటం సమంజసమా అనేది కూడా చర్చించాలి. ముఖ్యంగా వినియోగదారుల రక్షణకు రూపొందించే చట్రం మీద ఇంకా అనుమానాలున్నాయి.

కొత్త కనెక్షన్ ఇవ్వటానికి వ్యవధి

ఒక కొత్త చందాదారుకు సర్వీస్ కనెక్షన్ ఇవ్వటానికి కాలపరిమితి నిర్ణయించాలని కూడా ట్రాయ్ భావిస్తోంది. ఈ వ్యవహారంలో రెండు విధాల వైఖరులకు అవకాశముందని భావిస్తోంది. ఒకటేంటంటే సేవల నాణ్యత నిబంధనల లోనే అర్థవంతమైన సమయాన్ని నిర్వచించటం. దానికి సంబంధించిన రకరకాల పనులకు ఒక్కోదానికి ఎంత సమయం పడుతుందో లెక్కగట్టటం. అంటే స్పష్టంగా వెల్లడించటం. దీనికి ప్రత్యామ్నాయంగా ఆయా పంపిణీ సంస్థలే తమ తమ విధానాలు ప్రకటించుకోవటం ఇంకో పద్ధతి. చందాదారులకు తెలిసేలా పారదర్శకంగా విధానాన్ని వెల్లడించటం ఇందులో ప్రత్యేకత.

ప్రామాణిక చందాదారు దరఖాస్తు, ఈ-దరఖాస్తు

ఒక్కో పంపిణీ సంస్థ ఒక్కో విధంగా చందాదారుల సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నదని ట్రాయ్ అభిప్రాయ పడుతోంది. అందువలన చందాదారు దరఖాస్తు (సిఎ ఎఫ్) నమూనాలు రకరకాలుగా ఉండటం, సమాచారం అసంపూర్ణంగా ఉండటం జరుగుతోంది. ఒక్కోసారి చాలా కీలకమైన సమాచారం కూడా సేకరించే అవకాశం కలుగుతుందని ట్రాయ్ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ చందాదారు దరఖాస్తు ఫారం విషయంలో పంపిణీ దారులను ప్రోత్సహించాలా,  సహకరించాలా, తప్పనిసరి చేయాలా అనేది కూడా పంపిణీ సంస్థల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయించాలనుకుంటోంది.

అయితే, కొంతమంది చిన్న ఎమ్మెస్వోలకు ఈ-చందాదారు దరఖాస్తు అమలుచేయటం ఆర్థికంగా భారం కావచ్చునని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థితుల్లో రాతపూర్వకంగా నింపే దరఖాస్తుకు పరిమితం కావటమా, ఈ-దరఖాస్తుకే మొగ్గుచూపటమా అనేది పూర్తిగా పంపిణీదారుకే అప్పగించటం మంచిదనే అభిప్రాయం కూడా ట్రాయ్ వ్యక్తం చేస్తోంది. లేదంటే, నిర్వహణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు పద్ధతులకూ అవకాశం ఇవ్వటాన్ని కూడా పరిశీలించవచ్చునని భావిస్తోంది.

ఆచరణ నియమావళి

చందాదారుడు కనెక్షన్ తీసుకున్నప్పుడు ప్రతి చందాదారుడికీ ఒక ఆచరణ నియమావళి ప్రతి ) మాన్యువల్ ఆఫ్ ప్రాక్టీస్ ) ఇవ్వాలని ట్రాయ్ సూచిస్తోంది. అందులో సేవల వివరాలు, స్కీములు, వినియోగదారుల జాగ్రత్తలు, సమస్యల పరిష్కార విధానం, రకరకాల సేవలందించటానికి గడువులు తదితర సమాచారమంతా అందులో ఉంటుంది. ఈ ఆచరణ నియమావళినే పంపిణీదారు తన వెబ్ సైట్ లో కూడా పెట్టవచ్చు. లేదా చందాదారు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ ఐడి కి మెయిల్ ద్వారా పంపవచ్చు. ఆచరణ నియమావళి లోని అంశాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మారుస్తూ ఉండవచ్చు అని కూడా ట్రాయ్ సూచించింది.

కనీస చందా సమయం

ఒక చందాదారుడు ఒక పంపిణీ సంస్థ నుంచి సేవలు అందుకోవటానికి సిద్ధమైనప్పుడు  కనీస చందాకాలం అంటూ ఉండాలన్నది ఒక వాదన, దీని గురించి కూడా ట్రాయ్ తన చర్చాపత్రంలో ప్రస్తావించింది. అయితే ఈ విషయంలో లోపరహితమైన విధానమొకటి రూపొందించాలన్న అభిప్రాయముంది. చందారుకు సేవలకు, ధరకూ సంబంధించిన రక్షణ కావాలి, అదే సమయంలో పంపిణీ దారుకు కూడా కనీస చందా రక్షణ కావాలి. ఇక కనీస చందా కాలం అనేది చాలా లౌక్యంతో కూడుకున్న వ్యవహారం.

ఒకవైపు చందాదారు తమతోనే కచ్చితంగా కొంతకాలంపాటైనా కొనసాగేలా ఏదైనా షరతు విధిస్తే అలాంటప్పుడు ఆ గడువు కాలం పూర్తయ్యేదాకా చందాదారుడు తప్పనిసరిగా ఉండి తీరాల్సి వస్తుంది. ఇది చందాదారుణ్ణి బలవంతంగా కట్టి పడేసి ఇబ్బంది పెట్టినట్టవుతుంది. అదే సమయంలో పంపిణీ సంస్థ కొత్త చందాదారులను ఆకర్షించటంకోసం పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు చందాదారుడు కొంత కనీస కాలం తనతోనే ఉండాలని కోరుకుంటుంది. అలా ఉండకపోతే నష్టపోతుంది కూడా. పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది. ఇక్కడ మరో సమస్య ఏంటంటే, చందాదారుకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు పెద్ద పెద్ద పంపిణీ సంస్థలు భవిష్యత్తులో వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల స్కీముల ద్వారా చందాదారుణ్ణి ఆకర్షించే అవకాశముంది. ఎప్పటికప్పుడు కొత్త ఆశల వలలో పడి చందాదారు మారుతూ ఉంటే పంపిణీ సంస్థలు నష్టపోతాయి. చిన్న సంస్థలు మూతపడతాయి.

సేవల బదలాయింపు

వినియోగదారుడు ఇల్లు మారినా, ఊరు మారినా కనెక్షన్ బదలాయింపు ఎలా ఎంత సమయంలోపు జరగాలన్నది మరో అంశం. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా లైసెన్స్ ఉండి, కార్యకలాపాలున్న సంస్థల విషయంలో వినియోగదారుడు ఒకచోటు నుంచి మరో చోటుకు బదలీ అయినప్పుడు అదే సెట్ టాప్ బాక్స్ వాడుకునే వెసులుబాటు కల్పించటం గురించి కూడా చర్చించాలని ట్రాయ్ భావిస్తోంది. ఒక ప్రదేశానికే పరిమితమైన ఎమ్మెస్వోలున్నప్పుడు సెట్ టాప్ బాక్స్ పరిస్థితేమిటి ? ఈ అంశం మీద కూడా పరిశ్రమలోని భిన్నరంగాల వారి అభిప్రాయాలను సేకరించాలని ట్రాయ్ నిర్ణయించుకుంది.

తాత్కాలికంగా సేవల నిలిపివేత

ఒకవేళ చందాదారులు కొంతకాలం తాత్కాలికంగా సేవలు నిలిపివేయవలసిందిగా కోరినప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని పునఃపరిశీలించటం అవసరమని కూడా ట్రాయ్ భావిస్తోంది. అందరు భాగస్వాముల ప్రయోజనాలు కాపాడగలిగేలా ఈ విధానం ఉండాలని సూచిస్తోంది. ఒక ఉద్యోగి తాత్కాలికంగా కొంత కాలం బదలీ మీద వేరే ప్రదేశానికి వెళ్ళే సమయంలో టీవీ ప్రసారాలు వద్దనుకుంటే ఆ కాలంలో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఈ నిబంధన లక్ష్యం. చాలామంది తల్లిదండ్రులు పరీక్షల సమయంలో టీవీ కనెక్షన్ ఆపేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం చందాదారుడు తన కనెక్షన్ తాత్కాలికంగా నిలిపివేయాలని కోరినప్పుడు సేవలు నిలిపివేయటానికి గాని, పునరుద్ధరించటానికి గాని ఎలాంటి ఫీజూ వసూలు చేయకూడదు.

సేవల ముగింపు

చందాదారుడు బిల్లు చెల్లించలేదని అకస్మాత్తుగా సేవలు నిలిపివేస్తే ప్రసారాలు ఆగిపోతాయి. అందుకే దశలవారీగా ఆ పనిచేయాలన్నది ట్రాయ్ అభిప్రాయం. అందుకే గతంలో ఇచ్చిన సూచనలలో కూడా ట్రాయ్  ఇదే విధానాన్ని వెల్లడించింది. అంటే, ముందుగా పే చానల్స్ నిలిపివేయటం ద్వారా చందాదారు మీద వత్తిడి తీసుకురావటం, ఆ తరువాత ఒక నిర్దిష్ట కాలపరిమితిపాటి అంటే గడువు పూర్తయిన వారం రోజులదాకా ఉచిత చానల్స్ మాత్రమే అందించటం, అప్పటికీ బకాయిలు చెల్లించకుండా ఉండిపోతే అప్పుడు పూర్తి సేవలు నిలిపివేయటమన్నది సమంజసమని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.

చందాదారు ఆవరణలో పరికరాలు / సెట్ టాప్ బాక్స్

సెట్ టాప్ బాక్స్ సహా చందాదారుడి ఆవరణలో ఉండే పరికరాలు తిరిగి ఇవ్వదలచుకుంటే అప్పుడు అనుసరించాల్సిన పద్ధతి విషయంలోనూ ఒక స్పష్టత కచ్చితంగా అవసరమని ట్రాయ్ భావిస్తోంది. ట్రాయ్ అభిప్రాయం ప్రకారం అయితే, తరుగుదల తగ్గించుకొని బాక్స్ ని వెనక్కి తీసుకోవటం. ఇదే చాలా సులభమైన విధానమని టాయ్ భావిస్తోంది. అంటే, ఏడాదిలోపు తిరిగి ఇస్తే 25% తగ్గించుకోవటం, రెండేళ్ళలోపు అయితే 50%, మూడేళ్ల లోపు అయితే 75%  తగ్గించుకొని ఇవ్వటం. ఆ విధంగా ఇవ్వాలంటే ముందుగా కనెక్షన్ ఇచ్చినప్పుడే బాక్స్ ఖరీదు పారదర్శకంగా వెల్లడించాల్సి వస్తుంది. ఒకవేళ  సెట్ టాప్ బాక్సును అద్దెకు ఇచ్చినట్టయితే పంపిణీ దారు ( ఎమ్మెస్వో/ డిటిహెచ్ ఆపరేటర్/హిట్స్ ఆపరేటర్ ) తన ప్రయోజనాలు కాపాడుకోవటానికి సెక్యూరిటీ డిపాజిట్ కోరవచ్చు.

సాంకేతిక వివరాలు

డిజిటల్ అడ్రెసిబుల్ ప్లాట్ ఫామ్స్ సేవల నాణ్యత బాగా ఉండటానికి సాంకేతికంగా ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంలో సలహాలు, సూచనలూ ఇవ్వాలని కూడా ట్రాయ్ కోరింది. పంపిణీదారులు ఒక్కోసారి కొన్ని చానల్స్ కు అత్యధిక కంప్రెషన్  పద్ధతులు వాడటం వలన అలాంటి ప్రసార నాణ్యత బాగా పడిపోతుందని అడియో వీడియో ఆగి ఆగి వస్తుంటాయని ట్రాయ్ గుర్తు చేసింది. అదే విధంగా ఒక్కో చానల్ ఆడియో ఒక్కో స్థాయిలో ఉండటం వలన కూడా చానల్ మార్చినప్పుడు ఆ తేడా స్పష్టంగా కనబడుతూ చందాదారులకు ఇబ్బంది కలుగుతుందని, ఆ చానల్ మీద దురభిప్రాయం కలిగే ప్రమాదముందని ట్రాయ్ తెలియజెప్పింది. అందుకే సాంకేతిక ప్రమాణాలు ఎలా పాటించాలో అందరూ ఏకాభిప్రాయానికి రావాలని కోరింది.

సేవల నాణ్యత పాటించటం

చిన్న చిన్న ఎమ్మెస్వోలవంటి వారు సైతం పాటించటానికి వీలుగా ఒక ఉమ్మడి విధానం రూపొందించటం ద్వారా సేవల నాణ్యతను నిర్వచించగలుగుతామని ట్రాయ్ అభిప్రాయపడింది. అయితే, వెబ్ సైట్ ఆధారిత నాణ్యతాసేవలను నిర్వహించటానికి వీలుగా చిన్న చిన్న ఎమ్మెస్వోలు తమ వెబ్ సైట్ల బాధ్యతను ఔట్ సోర్స్ చేయటమే మేలని ట్రాయ్ సూచిస్తోంది. అలాంటప్పుడు అలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది పంపిణీదారుల తరఫున వెబ్ సైట్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యత తీసుకుంటుందన్నది ట్రాయ్ అభిప్రాయం.

కేబుల్ టీవీ చందాదారులను ఆకట్టుకోవటానికి రూపొందించాల్సిన పాకేజీల మీద కూడా అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్ సూచించింది. అటు పోస్ట్-పెయిడ్ చందాదారులకు, ఇటు ప్రీ-పెయిడ్ చందాదారులకు బిల్లులు చెల్లించే తేదీలు నిర్ణయించి ప్రామాణీకరించాలని భావిస్తోంది. చందాదారుకు నెలవారీ బిల్లులు పంపటానికి బహుళ విధానాలు వాడుకోవాలని సూచించింది. అంటే హార్డ్ కాపీ, ఈ మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ, బ్రాడ్ కాస్ట్ మెయిల్ తో బాటు అతడి ఖాతాకు ఆన్ లైన్ ద్వారా పంపటానికి కూడా వెసులుబాటు ఉండాలని ట్రాయ్ ప్రతిపాదించింది. 

డిటిహెచ్ రంగంలో ఇప్పటికే ఆన్ లైన్ చెల్లింపులు, మొబైల్ చెల్లింపులు. ఈ-రీచార్జ్ కూపన్ చెల్లింపులు అమలు చేస్తుండగా కేబుల్ టీవీ రంగంలో మాత్రం ఇంకా నేరుగా డబ్బు తీసుకునే  వసూళ్ళ పద్ధతే అమలులో ఉన్న విషయాన్ని ట్రాయ్ గుర్తుచేసింది. కేబుల్ టీవీ రంగంలో ప్రీపెయిడ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా చందాదారుల సమాచారం కేబుల్ ఆపరేటర్ కు సైతం పరిమిత స్థాయిలో అందుబాటులో ఉండేందుకు ఎమ్మెస్వోలు ఒప్పుకోవటం సమంజసమని ట్రాయ్ అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితిలో కేబుల్ ఆపరేటర్ పారదర్శకంగా తన పరిధిలో బిల్లింగ్ సమాచారం, చందాదారు సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అదే విధంగా చందాదారుడు సర్వీస్ నిలిపివేయాల్సిందిగా కోరినప్పుడు, యాక్టివేట్ చేయాల్సిందిగా కోరినప్పుడు  ఆపరేటర్ స్పందించటానికి వీలవుతుంది.

అయితే, ఈ మేరకు ఎమ్మెస్వో-ఆపరేటర్ మధ్య  ఇంటర్ కనెక్షన్ ఒప్పందంలో స్పష్టంగా రాతకోతలు ఉండటం సమంజసం. అప్పుడే ముందస్తుగా వసూలు చేసిన ఆదాయం విషయంలో కూడా సర్దుబాట్లు సులభమవుతాయి. చందాదారుల తరఫున కేబుల్ ఆపరేటర్ నెలవారీ చందాను ఈ-రీచార్జ్ ద్వారా చెల్లిస్తూ తాను చందాదారులనుంచి వసూలు చేసుకోవటంలో సాధ్యాసాధ్యాలను చర్చిస్తోంది. కస్టమర్ కేర్ కాల్ సెంటర్, సేవల నాణ్యతకు సంబంధించిన అంశాల పరిష్కార వివరాలు తదితర అంశాలమీద కూడా ట్రాయ్ఆలోచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here